Friday, May 3, 2024

మళ్లీ ముంచింది

- Advertisement -
- Advertisement -
Heavy rain in many places across Telangana
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం, హైదరాబాద్‌లో మళ్లీ అదే బాదుడు
రహదారులపై ట్రాఫిక్ జాం, మునిగిన లోతట్టు ప్రాంతాలు
మరి మూడు రోజులు భారీ వర్షాలు, ఆదిలాబాద్, కొమురంభీం, అసిఫాబాద్,
నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రంగారెడ్డిలో 107, హైదరాబాద్‌లో 105
మి.మీ. వర్షపాతం, జడ్చర్లలో ఓ నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి దుర్మరణం

మనతెలంగాణ/ హైదరాబాద్ : నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం పడింది. శనివారం మధ్యాహ్న సమయంలో కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. బంజరాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా, రాజేంద్రనగర్, అత్తాపూర్లో భారీ వర్షం కురిసింది. ఇక మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బినగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. రహదారులు చెరువుల్లా మారాయి. వనస్థలిపురం, కిస్మత్‌పుర, అత్తాపూర్, రాజేంద్రనగర్, గండిపేట, బండ్లగూడ, శంషాబాద్, లంగర్‌హౌస్, గోల్కొండ, మెహిదీపట్నం తదితర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షం నేపథ్యంలో పలు చోట్ల రహదారులపై ట్రాఫిక్ జాం అయ్యింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సుమారు మూడుగంటల పాటు కురిసిన భారీ వర్షానికి వాల్మీకినగర్‌లోని నాలాలో పడి రాఘవేందర్ అనే వ్యక్తి దుర్మరణం చెందారు.

మంచిర్యాల జిల్లా అన్నారం మండంలంలోని వాగు ఉధృతి పెరగడంతో ఎడ్లబండి కొట్టుకుపోయింది. ఎడ్లబండిపై ఉన్న రైతు ప్రమాదం నుంచి బయటపడగా రెండు ఎద్దులు మృత్యవాతపడ్డాయి. వనస్థలిపురం పనామా చౌరస్తా నుంచి ఎల్బీనగర్ వచ్చే రహదారిపై వరదనీరు నిలవడంతో చింతలకుంట వద్ద పనామా కూడలి వద్ద వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మోకాళ్ల లోతు వరకు రహదారిపై నీరు చేరడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. అంబర్‌పేటలో భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఓయూ పరిధిలోని మోహిని చెరువు నుంచి వస్తున్న వరద తాకిడికి అంబర్‌పేట, పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్ కాలనీల్లోకి నీరు చేరింది. కోదండరాం నగర్, సీసాల బస్తీ కాలనీల్లోని పలు ఇళ్లలోని భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మలక్‌పేటలో ఓ వాహనదారుడు వర్షానికి బండిపై నుంచి పడడంతో గాయాలయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News