Sunday, April 28, 2024

కమిటీ పేరుతో కాలయాపనా?

- Advertisement -
- Advertisement -

దేశం మొత్తాన్ని కుదిపి వేసినా, ప్రపంచంలో మన కంపెనీల విశ్వసనీయత మీద అనుమానం తలెత్తినా, మదుపర్లు లక్షల కోట్లు పోగొట్టుకున్నా దేశ అత్యున్నత పార్లమెంటులో అదానీ హిండెన్‌బర్గ్ వివాదం మీద ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపలేదు. మోడీ తీరుతెన్నులను గమనించిన వారు నోరు విప్పుతారని ఏ ఒక్కరూ ఆశించలేదన్నది కూడా పచ్చినిజం. ఎవరి సె్టైల్ వారిది, తగిన తరుణం వచ్చినపుడు ఎవరి పద్ధతిలో వారు స్పందిస్తారు. పార్లమెంటులో ప్రతిపక్షాల డిమాండ్‌ను ఖాతరు చేయని అపర ప్రజాస్వామికవాది ఇప్పుడు సుప్రీం కోర్టుకైనా ఏదైనా నివేదిస్తారా ? లేక దేశ భద్రతకు సంబంధించిన అంశం కనుక కోర్టుకు చెప్పలేం అని ఠలాయిస్తారా? లేదా విచారణ, సూచనల కమిటీ పేరుతో కాలయాపన చేస్తారా? చూద్దాం! శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ముందు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ఎంఎల్ శర్మ, విశాల్ తివారీ అనే ఇద్దరు న్యాయవాదులు ఒక దావావేశారు. అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా అమెరికా కేంద్రంగా ఉన్న హిండెన్‌బర్గ్ సంస్థ కుట్రలో భాగంగా విడుదల చేసిన పరిశోధన నివేదిక మదుపర్లకు భారీ నష్టం కలుగ చేసినందున సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని విడివిడిగా కేసులు దాఖలు చేశారు.దీన్ని స్వీకరించిన కోర్టు సోమవారంనాడు విచారణకు తీసుకుంటామని వివాదం తలెత్తిన నేపధ్యంలో నియంత్రణ విధానం, తీసుకున్న చర్యల గురించి ఆరోజుకు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి)ని ఆదేశించింది. ప్రభుత్వం, సెబీని సంప్రదించి భవిష్యత్‌లో ఇలాంటి ఉదంతం పునరావృతం కాకుండా నియంత్రణ వ్యవస్థలను ఎలా పటిష్ట పరచాల్సిందీ, క్రమబద్ధీకరణ చట్టాలు, మార్కెట్ల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన మార్పులు అవసరమైతే దాని కోసం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుతో సహా ఒక నివేదికను అందచేయాలని సొలిసిటర్ జనరల్‌ను కోరింది. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఒక కమిటీని వేయవచ్చని కూడా చెప్పింది. తాము దీని గురించి ఏదైనా చెబితే మార్కెట్ ప్రవృత్తి, మదుపుదార్ల విశ్వాసం మీద ప్రభావం చూపవచ్చని కోర్టు పేర్కొన్నది. భారత మదుపుదార్ల ప్రయోజనాలను ఎలా కాపాడాలన్నదే నిజంగా తమ తాపత్రయమని కోర్టు పేర్కొన్నది. బంతి ఇప్పుడు ఎక్కడ ఉన్నదీ చెప్పనవసరం లేదు.

జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, హిండెన్‌బర్గ్ నివేదిక దేశ స్టాక్ ఎక్సేంజ్‌ను కుదిపివేయడమే కాదు, దేశంలోని వాణిజ్యవేత్తలను అనుసరిస్తున్న పద్ధతులను కూడా ప్రశ్నార్ధకంగా మార్చిందని పిటీషనర్లు పేర్కొన్నారు. నియంత్రణలు లేకుండా ప్రభుత్వరంగ బాంకులు రుణాలు ఇవ్వటం తీవ్ర ఆందోళనకరమైన అంశమని, బడా కార్పొరేట్లకు ఐదు వందల కోట్ల రూపాయలకు మించి ఇచ్చే రుణాలపై పరిశీలనకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని కూడా కోరారు. ఈ పిటీషన్ మీద విచారణ ఎలా జరుగుతుందో, ఏమి తేలుస్తారో చెప్పలేము గానీ పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తకుండా ఒకవేళ ఎవరైనా అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకొనేందుకు వీలుగా సుప్రీంకోర్టు సూచించినట్లుగా ఒక కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకరిస్తే కథ కంచికే. కోర్టు అందుకు అంగీకరిస్తే దాని నిర్ణయాన్ని తప్పు పట్టకూడదు గానీ ఇది నరేంద్ర మోడీ, అదానీ ప్రయోజనం కోసం దాఖలైన పిటీషన్ అనుకొనేందుకు అవకాశం ఉంది.

ప్రపంచంలో హిండెన్‌బర్గ్ వంటి షార్ట్ సెల్లర్స్, వారి లీలలు కొత్త కాదు. ఇలాంటి వారు ఉండటం మార్కెట్‌కే మంచిదని సమర్ధించేవారు ఉన్నారు. అదానీ కంపెనీల మీద ఇప్పుడు కాకుండా మరోఐదేండ్ల తరువాత గనుక ఇలాంటి నివేదిక వచ్చి ఉంటే ఇంకా పెద్ద ముప్పు వచ్చి ఉండేదని అనేక మంది అనుకుంటున్నట్లుగా మీరా యె ఎసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ సిఐఒ రాహుల్ చద్దాతో నిర్వహించిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాన్ని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన టైవ్‌‌సు ఆఫ్ ఇండియా రాసింది.‘రానున్న 510 సంవత్సరాల్లో భారత్ గనుక ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారితే మన కంపెనీలలో ఎక్కువ భాగం మరింతగా తనిఖీకి గురికావచ్చు. దీన్ని గతంలో చూశాము. కొంత మంది షార్ట్ సెల్లర్స్ చైనా కంపెనీల గురించి నివేదికలు రాశారు. కొన్ని నివేదికలు వాస్తవమే, కొన్ని సంచలనం కలిగించాయి. మార్కెట్ దాన్ని పెద్ద అంగలు వేయటంగా చూసింది. ఎక్కడైతే నివేదికలు వాస్తవమో అక్కడ స్టాక్స్ ప్రభావితం అయ్యాయి. అదానీ గ్రూపు విషయానికి వస్తే ఎక్కువ మంది మదుపుదార్లు ప్రైవేటు సంభాషణల్లోనే మాట్లాడుతున్నారు. ప్రముఖంగా ప్రస్తావించిన కొన్ని అంశాలను చూస్తే ఒక విధంగా చెడ్డలో మంచిగా చూస్తున్నారు. ఇప్పుడు గాకుండా ఐదేండ్ల తరువాత ఈ సమస్య తలెత్తివుంటే పెద్ద వ్యవస్థాపరమైన ముప్పుగా ఉండేది. దీన్నుంచి ప్రతివారూ పాఠం నేర్చుకున్నారని అనుకుంటున్నాను’ అని చద్దా చెప్పారు.

ఇటీవల తాను ఐరోపా వెళ్లినపుడు ప్రతిచోటా మదుపర్లు తనను అదానీ ఉదంతం గురించి అడిగితే పైన చెప్పుకున్న అంశాలనే వివరించాల్సి వచ్చిందని, ఇంత జరిగాక తానైతే ఆచితూచి పెట్టుబడులు పెడతానని కూడా చెప్పారు. సంస్థాగత మదుపర్ల ఆలోచన ఎలా ఉందో చూశాము. ఎంతసేపూ షార్ట్ సెల్లర్లు, వారి వెనుక ఉన్న కుట్ర సిద్ధాంతాల చుట్టూ చర్చను తిప్పేందుకు చూస్తున్నారు. హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత అదానీ కంపెనీ ఎఫ్‌పిఒ పేరుతో రూ. 20 వేల కోట్లను సేకరించేందుకు వాటాలను జారీ చేసింది. చిన్నచిన్న మదుపుదార్లెవరూ ముందుకు రాలేదు. కానీ ఆశ్చర్యంగా కొందరు రంగంలోకి దిగి వాటిని కొని అదానీ పరువు నిలిపేందుకు చూశారు. అలా ఎల్‌ఐసి కూడా మూడు వందల కోట్ల మేరకు దరఖాస్తు చేసిందని వార్తలు. వాటిని స్టాక్ ఎక్సేంజ్‌లో పెడితే కొన్నవారంతా చేతులు కాల్చుకొనేవారే. కానీ అదానీ ఆ అమ్మకాలను రద్దు చేసి ఆదుకున్న తన మిత్రులను రక్షించారు. ఇదొక పెద్ద కుంభకోణం, దీని మీద విచారణ జరపాలి. అస్థిర పరిస్థితి ఉన్నపుడు అదానీ కోసం ముందుకు వచ్చిన వారెవరు అన్నది బహిరంగం కావాల్సి ఉంది.

ఇక షార్ట్ సెల్లర్స్ అంటే ఎవరు అన్న ఆసక్తి చాలా మందిలో కలిగింది. అమరావతి ప్రాంత రైతులతో అగ్రిమెంటు చేసుకొని భూములు కొనుగోలు చేసి చేతులు కాల్చుకున్నవారి సంగతి తెలిసిందే. వైసిపి ప్రభుత్వం రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన రంగంలోకి తేవటంతో భూముల ధరలు ఢమాల్ అన్నాయి. దాంతో ఒప్పందాలు చేసుకున్న వారు రైతులకు పెద్ద మొత్తంలో ఇచ్చిన బయానా సొమ్మును వదులుకొని లావాదేవీలను రద్దు చేసుకున్నారు. అదే అదనుగా ధరలు తగ్గటంతో కొందరు చౌకగా కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లో బ్రోకర్ల వద్ద కొందరు ఒక కంపెనీ వాటాను అరువు తెచ్చుకుంటారు. వాటిని మార్కెట్‌లో ఉన్న ధరల కంటే కారుచౌకగా తెగనమ్ముతారు. దీన్నే షార్ట్ సెల్లింగ్ (తక్కువ ధరలకు అమ్మకం) అంటారు. ఇలాంటి జూదాన్ని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థలు నిషేధించవచ్చుకదా అని కొందరు అడగవచ్చు. ప్రపంచంలో చైనాతో సహా ఎక్కడా స్టాక్ మార్కెట్లలో అలా జరగలేదు. అనుమతిస్తూనే ఉన్నారు.

భారీ ఎత్తున అమ్మకాలకు దిగినపుడు స్టాక్ ధరలు పతనమైతే ఒక పరిమితి దగ్గర కొద్దిసేపు అమ్మకాలను నిలిపివేస్తారు. అది భారీ ఎత్తున నిర్ణీత పరిమితికి మించి పెరుగుతున్నపుడు కూడా అదే పని చేస్తారు. పూర్తిగా నిషేధించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అదానీ కంపెనీల వాటాల ధరలు విపరీతంగా పెరిగినపుడు లేని నిషేధాలు పతనమైనపుడు ఎలా పెడతారు? గతంలో కేతన్ పరేఖ్ అనే నేరస్థుడు ఇతర బ్రోకర్లతో కలసి కంపెనీల వాటాల ధరలను కృత్రిమంగా పెంచిన కుంభకోణం జరిగింది. జి టెలిఫిలివ్‌ు వాటా ధర రూ. 127 ఉంటే దాన్ని పది వేలకు, విజువల్ సాప్ట్ రూ. 625ను రూ. 8,448, సోనాటా సాఫ్ట్ రూ. 90ని రూ. 2,936కు పెంచి మదుపుదార్లను ముంచారు.

షార్ట్ సెల్లర్లు ఒక్క అదానీ కంపెనీ మీదనే తొలిసారిగా కుట్ర చేసినట్లు, దాన్ని దేశం మీదనే జరిగిన దాడిగా, దాని వెనుక చైనా ఉన్నదని ఆరోపిస్తూ కుహనా జాతీయభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. హిండెన్‌బర్గ్ కంపెనీ ఉంది అమెరికాలో, దానికి నిజంగా చైనా మద్దతు ఇస్తే అమెరికా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు ? చైనా బెలూన్ను కూల్చివేసి అమెరికాను రక్షించినట్లు చెబుతున్న ప్రభుత్వం హిండెన్‌బర్గ్ మీద విచారణకు ఆదేశించి చైనా పాత్రను వెల్లడించేందుకు, తన మిత్ర దేశంగా భావిస్తున్న భారత్‌ను, అదానీని బహిరంగంగా సమర్ధించలేక విమర్శించలేక ఎక్కాతిక్కా స్థితిలో ఉన్న జిగినీ దోస్తు నరేంద్ర మోడీని రక్షించేందుకు జో బైడెన్ ఎందుకు పూనుకోలేదు? 2021లో చైనా ప్రభుత్వం తమ టెక్నాలజీ సంస్థలపై చర్య తీసుకున్నపుడు షార్ట్ సెల్లర్స్ భారీ ఎత్తున లబ్ధి పొందారు. ఆ ఏడాది ఒక్క జూలై నెలలోనే ఎనిమిది బిలియన్ డాలర్లు పోగేసుకున్నారు.

అలాంటి సొమ్ముతో ఎంచుకున్న కంపెనీల వాటాలను కొనుగోలు చేసి షార్ట్ సెల్లింగ్‌కు పాల్పడి లబ్ధి పొందేందుకు చూశారు. ఇది నిరంతర ప్రక్రియ. అలీబాబా కంపెనీల షేర్లను మార్కెట్ కంటే పదమూడు శాతం తక్కువకు అమ్మి పతనం కాగానే అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసి లాభాలు పొందారు. అలాంటి వారికి ఒక దేశం, ఒక కంపెనీ, దేశభక్తి లాంటివేమీ ఉండవు. అప్పుడు అలీబాబా కంపెనీ కూడా అదానీ మాదిరే కొత్త షేర్లను అమ్మచూపితే ప్రభుత్వం అడ్డుకున్నది. ఇక్కడ నరేంద్ర మోడీ సర్కార్ అలాంటి పని చేయకున్నా అదానీ తోక ముడిచిన సంగతి తెలిసిందే. 2021 జూలైలోనే చైనాలోని ఆన్‌లైన్ సరకుల విక్రయ కంపెనీ పిండూడూ కూడా షార్ట్ సెల్లర్ల దాడికి గురైంది.

వారు పెద్ద మొత్తంలో లబ్ధి పొందారు. అప్పుడు చైనా ప్రభుత్వం లేదా పాలక పార్టీ దాన్ని తమ దేశం మీద దాడిగానో దాని వెనుక భారత్ లేదా అమెరికా ఉందనో ఆరోపించలేదు. టెక్నాలజీ కంపెనీలపై చైనా సర్కారు తీసుకున్న చర్యలు కొనసాగింపుగా తదుపరి గేమింగ్ కంపెనీలపై ఉంటాయని పుకార్లు పుట్టించి షార్ట్ సెల్లర్లు లబ్ధి పొందారు. ఇలా ప్రతి దేశంలో అచిరకాలంలోనే తారా జువ్వలా ఎదిగిన కంపెనీలన్నింటినీ షార్ట్ సెల్లర్లు ఎంచుకొని లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ మద్దతుతో అదానీ వంటి వారు, పాలకుల పక్కన చేరి లెక్కలను తిమ్మినిబమ్మిని చేసిన సత్యం కంప్యూటర్స్ మాదిరి కంపెనీలకు లేని విలువను సృష్టించి జనం నెత్తిన చేతులు పెట్టదలచుకుంటే ఇలాంటి షార్ట్ సెల్లర్స్ అలాంటి కంపెనీల మీద కన్నేసి దెబ్బతీసి లబ్ధి పొందుతారు. దివాలా తీసేది అమాయకపు మదుపుదార్లు మాత్రమే. మహా అయితే అదానీ వంటి వారు 2014లో ఎక్కడ ఉన్నారో తిరిగి అక్కడకు పోతారు, వారికి వచ్చే నష్టం ఉండదు. అంతే !

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News