Wednesday, April 17, 2024

దక్షిణ దేశాల ముందు ప్రత్యామ్నాయాలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఆధిపత్యం లేదా పాశ్చాత్య నాయకత్వం ఇకపై సాగదు. దక్షిణాది ప్రపంచం ముందు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. దక్షిణాది ప్రపంచంలో (గ్లోబల్ సౌత్) అనేక దేశాలు తమ భవిష్యత్తు పాశ్చాత్య ప్రభావంలో లేని దేశాలతో ముడిపడి ఉన్నట్లు భావి స్తున్నాయి. వారి ఆలోచనలకు ఆధారమైన సందర్భోచితమైన కొన్నిఅంశాలను చూద్దాం.
ప్రపంచ ఉత్పత్తిలో అమెరికా వాటా 1991లో 21% కాగా 2021 నాటికి 15%కు తగ్గిపోయింది. ఇదే సమయంలో చైనా వాటా 4 శాతం నుంచి 19 శాతానికి పెరిగింది. ప్రపంచంలోని చాలా దేశాలకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కొనుగోలు శక్తి సమానతలో దాని జిడిపి ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌ను అధిగమించింది.

2021లో జి-7 గ్రూపు దేశాల మొత్తం జిడిపి 41 ట్రిలియన్ల డాలర్లు కాగా, బ్రిక్స్ బృందం (బ్రెజిల్, రష్యా, చైనా, ఇండియా, దక్షిణాఫ్రికా) సంయుక్త జిడిపి 42 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 370 కోట్ల వీరి జనాభా, జి7 దేశాల ఉమ్మడి జనాభా (70 కోట్ల మంది) కంటే 4.5 రెట్లు ఎక్కువ. బ్రిక్స్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం లేదు, ప్రత్యర్థి పక్షానికి ఆయుధాలను సరఫరా చేయడం లేదు. దక్షిణ దేశాలకు ఇంధనం, ఆహార ధాన్యాలను సరఫరా చేసే అతిపెద్ద ఎగుమతిదారుడు రష్యా కాగా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా వారికి ఫైనాన్సింగ్, మౌలిక వసతులుకల్పించే అతిపెద్ద మద్దతుదారుడు చైనా. యుద్ధం కారణంగా రష్యా, చైనాలు ఇప్పుడు మరింత దగ్గరయ్యాయి. దక్షిణాది దేశాలు ఫైనాన్స్ పెట్టుబడి, ఆహారం, ఇంధనం, విద్యు త్తు, మౌలిక వసతుల నిర్మాణంలో పాశ్చాత్య దేశాలపై కంటే ఎక్కువగా చైనా, రష్యాలపైనే ఆధారపడాలి.

దక్షిణ దేశాలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ను విస్తరించాలని, బ్రిక్స్‌లో చేరాలనికోరుకుంటున్నాయి. అధిక ద్రవ్యోల్బణంతో పాటు అధిక ఇంధన వ్యయాల కారణంగా ఐరోపాలోని కొన్ని దేశాలలో ఆర్ధిక సంక్షోభం పెరుగుతోందని వారు గమనిస్తున్నారు. అనేక దేశాలు ఇప్పుడు డాలర్, యూరో లేదా పాశ్చాత్య దేశాల నుండి దూరంగా వున్న కరెన్సీలలో వ్యాపారం చేస్తున్నాయి. యుద్ధానికి ముందు పశ్చిమ దేశాలలో అంత స్పష్టంగా కనిపించని ఆర్థిక బలహీనతకు ఇది స్పష్టమైన సూచిక. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పౌరుల ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాల్సిన బాధ్యత కలిగిఉన్నందున, పాశ్చాత్య నాయకత్వం లేని లేదా అమెరికన్ ఆధిపత్యం లేని దేశాలతో వారి భవిష్యత్తును ముడి పెట్టుకోవడంలో ఆశ్చర్యమేముంది?
నియమ ఆధారిత అంతర్జాతీయ క్రమంలో (‘రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్’) విశ్వసనీయత క్షీణిస్తోంది.

‘రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్’ పాశ్చాత్య దేశాలచే రూపొందించబడి, ఇతర దేశాలపై ఏకపక్షంగా రుద్దబడిన ఒక భావనగా అనేక దక్షిణ దేశా లు చూస్తున్నాయి. పాశ్చాత్యేతర దేశాలు ఈ ఉత్తర్వుపై సంతకం చేసిన సందర్భాలు చాలా తక్కువ. దక్షిణాది వారు నియమ ఆధారిత క్రమాన్ని వ్యతిరేకించడం లేదు, కానీ పాశ్చాత్యు లు నిర్ధారించిన విషయాన్నే వ్యతిరేకిస్తున్నారు. రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ పాశ్చాత్య దేశాలకు వర్తించదా అని అడుగుతున్నారు.
పాశ్చాత్య దేశాలు ఇతర దేశాల అభిప్రాయాలను ఖాతరు చేయకుండా దశాబ్దాలుగా తమ ఇష్టమొచ్చిన మార్గంలో వెళుతున్నట్లు చాలా దక్షిణ దేశా లు భావిస్తాయి. భద్రతామండలి అనుమతి లేకుండానే పలు దేశాలు ఇష్టానుసారంగా దాడులు చేసి పలు దేశాలను ఆక్రమించాయి.

మాజీ యుగోస్లేవియా, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, లిబియా, సిరియా ఇలా దాడులకు గురయ్యాయి. ఏ ‘నియమాల’ ప్రకారం ఆ దేశాలపై దాడులు చేశారు? ఎందుకు నాశనం చేశారు? ఈ దురాగతాల వెనుక ఉన్న సత్యాలను బహిర్గతం చేసే సాహసం లేక ధైర్యం చేసినందుకు జూలియన్ అసాంజే జైలులో మగ్గుతున్నాడు, ఎడ్స్నోడెన్ ప్రవాసంలో ఉన్నాడు, పాశ్చాత్య దేశాలు 40కి పైగా దేశాలపై విధించిన ఆంక్షలు గణనీయమైన కష్టాలను, బాధలను కలిగించాయి. ఏ అంతర్జాతీయ చట్టం లేదా ‘నియమాల ఆధారిత క్రమం’ కింద పాశ్చాత్య దేశాలు ఈ ఆంక్షలను విధించాయి? ఆకలి, కరవును ఎదుర్కొంటున్న అఫ్ఘానిస్తాన్ ఆస్తులు ఇప్పటికీ పాశ్చాత్య బ్యాంకుల్లో ఎందుకు స్తంభింప చేయబడ్డాయి? జీవనోపాధి కోల్పోయి ప్రజలు అలమటిస్తుంటే వెనిజులా బంగారం ఇప్పటికీ యు.కెలో ఎందుకు తాకట్టులో కట్టుబడి ఉంది? ఒకవేళ సై హెర్ష్ బహిర్గతం చేసినది వాస్తవమైతే, నార్డ్స్ట్రీమ్ పైప్ లైన్లను, పాశ్చాత్య దేశాలు ఏ ‘నియమాల ఆధారిత క్రమం’ కింద నాశనం చేశాయి?

పాశ్చాత్య ఆధిపత్య ప్రపంచానికి దూరంగా జరుగుతూ, మరింత బహుళ ధ్రువ ప్రపంచంలోకి ఒక మార్పు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం ఈ నమూనా మార్పులో భాగమైన విభేదాలను లేదా అంతరాలను మరింత స్పష్టం గా చూపించింది. వాటి స్వంత చరిత్ర కారణంగా కొంత, మారిపోతున్న ఆర్థికవాస్తవాల కారణంగా మరికొంత, దక్షిణ భూగోళ దేశాలు బహుళ ధ్రువ ప్రపంచాన్నివారి గొంతులు ఎక్కువగా వినిపించే అవకాశమున్న ఒక మంచి పరిణామంగా పరిగణిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ 1963లో తన అమెరికన్ విశ్వవిద్యాలయ ప్రసంగంలో ‘బలహీనులు సురక్షితంగా, బలవంతులు న్యాయబద్ధంగా ఉండే శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడానికి మనం కృషి చేయాలి. ఆ పని చేయడానికి మనం నిస్సహాయంగానూ లేము. విజయం సాధించలేమనే నిరాశతోనూ లేము. ఆత్మవిశ్వాసంతో, భయం లేకుండా ఆ శాంతి వ్యూహానికై కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. ఆ శాంతి వ్యూహం నేటికీ సవాలుగానే ఉన్నది. శాంతి కోసం దక్షిణంతో సహా అన్ని గొంతులు వినిపించుకోవాల్సిన అవసరం ఉంది.

డా. జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News