Thursday, May 2, 2024

మానవత్వ పరిమళం ‘పునీత్’

- Advertisement -
- Advertisement -

Humanity perfume Puneeth Rajkumar

‘పెద్ద సినిమా నటుడి కొడుకైన, రిక్షాలాగి బతికేవాడి పిల్లాడైన తినేది అన్నమే.. అన్నం ఒకటే అయినపుడు మిగితా వాటితో మనిషిని చిన్నాపెద్దా అని విడదీయడమెందుకు..’ అని తన సహజ చిరునవ్వుతో పునీత్ రాజ్‌కుమార్ ఈ మధ్య తెలుగులో వచ్చిన తన సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. వృత్తి, హోదా ఏదైనా, సంపద ఎంతున్నా ప్రాథమికంగా మనం ఈ సమాజంలో కలిసి బతికే, ఒకరికొకరం బాసటగా నిలిచే మనుషులం అనే మాటకు ఎల్లవేళలా ప్రాధాన్యతనిచ్చే మనిషి ఆయనలో కనిపించాడు. పునీత్ కరోనా ఉధృతి కాలంలో సినీ కార్మికులకు, ఇతరులకు అందించిన సహాయాన్ని ప్రశంసిస్తూ దాని వివరాలు చెప్పమని రిపబ్లిక్ టివి ప్రతినిధి ఎన్ని మార్లు అడిగినా ‘అందరూ చేశారు.. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చారు’ అంటూ చెబుతూ దాటేశాడే గాని తానింత చేశాను అని ఒక్క మాట కూడా చెప్పలేదు. పెద్ద మనసు గల గొప్ప మనిషి అని చెప్పుకోవడాని ఆయనెన్నో ఉదాహరణలను మనకు మిగిల్చి పునీత్ రాజ్ కుమార్ కానరాని లోకాలకు తరలిపోయారు.

పునీత్ రాజ్ కుమార్ వృత్తి రీత్యా సినీ నటుడు, కన్నడ కథానాయకుడు. ఊహించని రీతిలో అక్టోబర్ 29 న ఆయన బెంగళూరులో తన ఇంట వ్యాయామం చేస్తున్న క్రమంలో ఆకస్మిక గుండెపోటుతో మరణించారు. మనిషిగా ఎదుగుతూ, సినీ హీరోగా ఉన్నత శిఖరాలు అందుకుంటున్న సమయంలో కేవలం 46 ఏళ్ల వయసులో ఆయన అస్తమయం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ నమ్మలేని వార్తలా మనసుల్ని పిండేసింది.

నటుడుగా ఆయన సినీ ప్రస్థానం, విజయాలకు తోడుగా ఆయన చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలు మాధ్యమాల్లో ప్రస్తావనకొస్తున్నాయి. మన సినిమా నటుల్లో అరుదైన ఆయన దాతృత్వ గుణం గురించి తెలిసి పునీత్ పట్ల ఎనలేని గౌరవం పెరిగి ఆయన లేదన్న వార్త మరింత బాధకు గురి చేస్తోంది. సినిమా నటుల్లో ఎక్కువ మందికి తన కెరీర్ పట్ల తప్ప మరే ధ్యాస ఉండదు. మరీ నాలుగు, అయిదు పదుల వయసులో అయితే ఎలాంటి సినిమా అయినా చేసి వీలైనంత ఆస్తి కూడబెట్టి కుటుంబానికి ఆర్థిక బలాన్ని ఈయాలనే ఉంటుంది. సమాజం నుండి తీసుకోవాలనే ఆశ తప్ప తిరిగి ఇయ్యాలనే ఆలోచన కూడా ఉండని వయసు, సమయం అది. చేసేదంతా చేసి, సినిమాలు తగ్గుముఖం పట్టాక సామాజిక సేవ, రాజకీయాలు అంటూ పేరు నిలుపుకొనే కొత్త మార్గాలు పడుతుంటారు. తమ కాలంలో తెలిసి ఆచరించని సూక్తులను కొత్తతరానికి బుద్ధులు నేర్పుతున్నట్లు వేదికలెక్కి గంటల కొద్దీ ఉపన్యాసాలిస్తుంటారు. దీనికి పూర్తిగా భిన్నంగా పునీత్ బతికారు. చిన్నవాడైనా పెద్దలకు మార్గ నిర్దేశనం చేసి వెళ్ళాడు.

తానొక విశిష్ట మనిషిని, తనకు లక్షలాదిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే భావన తలకెక్కకుండా నటన నా వృత్తి, అందరిలో నేనొకడ్ని అనే గీతపై నిలబడితే తప్ప నటుడు మనలో ఒకడు కాలేడు. నటుడిగా సంపాదించిన సొమ్ములో కొంతైన సమాజ సేవకు, పేదలను ఆదుకొనేందుకు వినియోగించకపోతే సంఘజీవి కాలేడు. నటుడికి సంఘజీవిగా ఉండే బాధ్యతను విప్పి చెప్పిన అమరుడు పునీత్.

తనకున్న ప్రజాదరణను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షణగా పునీత్ వాడుకున్నాడు. బెంగళూరు రవాణా సంస్థ తరఫున ప్రజలంతా ప్రభుత్వ రవాణా వ్యవస్థను వాడుకోవాలని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేశాడు. 2013 నుండి సర్వశిక్ష అభియాన్ కోసం బాలబాలికల ఉచిత, నిర్బంధ విద్యా హక్కును జనంలోకి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాల ప్రచారమంతా ఉచితంగానే చేపట్టాడు. కరోనా సహాయ కార్యక్రమాలకు తనవంతుగా రూ.50 లక్షలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చాడు. 2019లో ఉత్తర కర్ణాటకలో వచ్చిన వరదల్లో బాధితులను ఆదుకునేందుకు ముందు నిలిచాడు. ఆయన అస్తమయం తర్వాత దేశవ్యాప్తంగా ఆయన దాతృత్వ సంస్థల గురించి విశేష ప్రస్తావన వస్తోంది. నటుడి కన్నా ఉన్నత వ్యక్తిగా ఆయన్ని అవి నిలబెడుతున్నాయి. వీటి గురించి పోస్టింగులు లేని సోషల్ మీడియా లేదు.

45 ఉచిత పాఠశాలలు, 26 అనాధాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు, ఇంకా 1800 మంది విద్యార్థులకు ఉచిత విద్యాకల్పన. చూస్తుంటే ఇవన్నీ ఒక వ్యక్తితో అదీ 46 ఏళ్ల వ్యక్తితో సాధ్యమయే పనేనా అనిపిస్తుంది. దీనికి తోడు తన తండ్రి రాజ్‌కుమార్ నెలకొల్పిన శక్తిధామం బాధ్యతలు కూడా నిర్వహించాడు. అది మైసూరులో ఉంది. మహిళాభ్యదయం కోసం ప్రత్యేకంగా దాన్ని 1997 లో ఏర్పరచారు. అందులో వేలాది మంది పేద బాలికలు చదువు నేర్చుకుంటున్నారు. కోరుకున్న ఉన్నతవిద్యను అందుకుంటున్నారు. అత్యాచారానికి బలైనవారు, వేశ్యావృత్తి నుండి బయటపడ్డవారు, గృహ హింస బాధితులు, అక్రమ రవాణాలో దొరికిన బాలికలు ఇలా ఎందరో దిక్కు మొక్కులేని స్త్రీలకు ఈ ఆశ్రమం ఆసరా అవుతోంది.

నేత్రదానాన్ని వరసపెట్టి చేస్తున్న కుటుంబం వారిది. 2006 లో రాజ్ కుమార్, 2017 లో తల్లి పార్వతమ్మ ఇప్పుడు పునీత్ తమ కళ్ళను చూపులేని వారికిచ్చి లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పునీత్ రెండు కళ్ల ద్వారా నలుగురికి చూపు రావడం మరో విశేషం. పునీత్ మంచి గాయకుడు కూడా. తనకే కాక ఇతరుల కోసం కూడా ఆయన ప్లేబ్యాక్ సింగర్‌గా పని చేశారు. ఇలా వచ్చిన సొమ్మును పూర్తిగా దానధర్మాలకు కేటాయించేవాడు. రాజకీయాల్లోకి రమ్మని ఎవరు పిలిచినా తిరస్కరించాడు. కాంగ్రెస్‌లో చేరామని ఎన్నిసార్లు అడిగినా ముందుకు రాలేదని కర్ణాటక కాంగ్రెస్ నేత డికె శివకుమార్ గుర్తు చేసుకున్నారు. పునీత్ వదిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కూతురు. ఆమె షిమోగాలో ఎంపి స్థానానికి నిలబడ్డా పునీత్ ప్రచారానికి వెళ్ళలేదు. కన్నడ కౌన్ బనేగా కరోడ్ పతికి యాంకర్‌గా పని చేసిన పునీత్ మత సంబంధమైన కొన్ని ప్రశ్నలు అడిగేందుకు ఒప్పుకోలేదు. ఆ ప్రశ్నలు తొలగిస్తేనే కొనసాగుతానని చెప్పారట.

1998లో పునీత్ వివాహం అశ్వినితో జరిగింది. అశ్విని ఆయనకు సదాశివనగర్‌లోని జిమ్‌లో పరిచయమైంది. ఒక కూతురు పుట్టినాక పునీత్ 2002 లో సినీ హీరోగా తిరిగి రంగప్రవేశం చేశారు. వరుసగా పది హిట్ సినిమాలు గల ఏకైక కథానాయకుడు ఆయన. సినిమావాళ్లు అనే తేలిక పదానికి మానవత్వ పరిమళం అద్దిన రియల్ హీరో పునీత్. ‘ఏమిటి బిడ్డా.. ఇంత తొందర పడ్డావ్..’ అని పునీత్‌తో రాజ్ కుమార్ అంటున్నట్లు సతీష్ ఆచార్య వేసిన కార్టూన్ అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఆయన ఇంకో నలభై ఆరేళ్ళు బతికితే ఎంత బాగుండేది అని ఎవరికైనా అనిపిస్తోంది. నటుడి సార్థకతకి మానవీయత ఎంత సొగసులద్దుతుందో, జనం గుండెల్లో చిరస్థాయి చోటు ఎలా లభిస్తుందో దారి చూపి ఎగిరిపోయిన తార పునీత్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News