Saturday, September 14, 2024

‘హైడ్రా’కు స్వాగతం

- Advertisement -
- Advertisement -

హైడ్రా (-హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హెచ్‌వైడిఆర్‌ఎఎ) ఏర్పాటు (జులై 19 2024) చేయడం ఒక సంచలనం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా చెరువుల పరిరక్షణే ధ్యేయంగా వాటి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రకృతి, పర్యావరణ వనరుల రక్షణ, వర్షాకాలంలో వరదల నివారణ కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం వెనువెంటనే కార్యాచరణను ప్రారంభించడం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (కాంగ్రెస్ ప్రభుత్వం) తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పవచ్చు.అక్రమంగా భూమి పత్రాలు సృష్టించి, నిర్మాణ అనుమతులు పొంది చెరువులను, ప్రభుత్వ భూములను, నాలాలను ఆక్రమించి నిర్మించిన పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లను, ఫామ్ హౌస్‌లను, అపార్ట్‌మెంట్లను కూల్చడం ఆహ్వానించదగ్గ పరిణామం.

N Convention demolished without giving single notice

ఈ నిర్మాణాలను బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నప్పటికీ అన్ని ఒత్తిడిలను అధిగమించి వాటిని కూల్చివేశారు. గతంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఇవి అండ్ డిఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్) వ్యవస్థ ఉన్నప్పటికీ దాని పరిధి, పరిమితులు చాలా తక్కువ. దాని స్థానంలో జూలై 19, 2024 న జిఒ నెంబర్ 99 ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి గల ‘హైడ్రా’ ను ఏర్పాటు చేయడం జరిగింది. ‘హైడ్రా’ అనగానే హైడ్రోజోవాన్ జాతికి చెందిన మంచినీటి మొక్క గుర్తుకొస్తుంది. దీని శరీరంలో ఏ భాగం తెగిపోయినా తిరిగి పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యం కారణంగా దీనికి మరణం ఉండదు. బహుశా అందుకనేమో ‘హైడ్రా’ అనే పేరును ఎంపిక చేసుకున్నారు కావచ్చు. ఏదేమైనా భవిష్యత్తులో ఇది అన్ని జిల్లాలకు విస్తరించి తను సజీవంగా ఉంటూ అందరికీ మంచి నీటిని, పర్యావరణాన్ని అందిస్తూ అందర్నీ సజీవంగా ఉంచాలని కోరుకుందాం. ‘హైడ్రా’ విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ ప్రజలకు మంచినీటినందించే ప్రధాన చెరువులైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లతోపాటు ప్రధాన నీటి వనరుల ఆక్రమణలపై దృష్టి సారించి అక్కడి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్న క్రమంలో దాని పరిసర కాలనీ ప్రజలే కాకుండా, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ‘హైడ్రా’కు మద్దతు తెలపడం, అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై తమ వ్యతిరేకతను ప్రదర్శించడం జరుగుతున్నది.

అయితే ఇక్కడ ప్రజల భావోద్వేగాలను, ఆవేశాలను ‘హైడ్రా’ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంలోతైన విశ్లేషణ చేస్తే గాని అర్థం చేసుకోలేము. దశాబ్దాల తరబడి ప్రజల తమ కళ్ళముందే విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలు పరపతి ఉన్న వ్యక్తులు ఆక్రమించుకున్నప్పుడు బాధ్యత కలిగిన పౌరులు, ఆ ఆక్రమణల వల్ల ఇబ్బందిపడ్డ సామాన్య ప్రజలు, సంఘాలు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా విన్న పాపానపోలేదు. పైగా ఆక్రమణ చేసిన భూముల్లో గంటల వ్యవధిలో నిర్మాణానికి అనుమతులు తెచ్చుకోవడం, పైసాపైసా కూడబెట్టుకుని కొన్న సరియైన ప్లాట్‌లలో నిర్మాణానికి అనుమతులు నెలల తరబడి ఆలస్యం కావడం (అది కూడా మామూళ్ళు ముట్ట చెప్పితేనే). అంటే పరపతి గలిగిన వారికి నిబంధనలకు నీళ్ళొదిలి ఉన్నపలంగా అనుమతులు ఇవ్వడం, సామాన్య ప్రజలను నిబంధనల పేరుతో వేధించడం వల్ల ప్రజల్లో అవినీతి అధికారుల పట్ల, అక్రమణదారుల పట్ల, జవాబుదారీతనంలేని వ్యవస్థల పట్ల ఉన్న ఆక్రోషం వ్యతిరేకతగా మారి అక్రమ కట్టడాలను కూలుస్తున్న ‘హైడ్రా’ పట్ల మద్దతు రావడానికి ప్రధాన కారణంగా అర్థం చేసుకోవచ్చు.

Hydra demolished on illegal constructions

హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన పట్టణాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో డ్రైనేజీ వ్యవస్థను పదుల సార్లు కూలగొట్టి కట్టినప్పటికీ ముంపు ప్రమాదాన్ని నివారించలేకపోయారు. ప్రధాన రహదారులు సైతం ప్రతి వర్షాకాలంలో కొట్టుకుపోతుందంటే మన ఇంజనీరింగ్, ఆర్ అండ్‌బి శాఖల తప్పిదంగానే భావించాలి. చిన్నతప్పిదాల వలన కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నది. ఇన్ని తప్పిదాలను, లోటుపాట్లను సరి చేయకుండా ఇండ్లను, కాలనీలను, గ్రామాలను, కూల్చేస్తామంటే అభివృద్ధి నిరోధకమే అవుతుంది. కోర్టు స్టే ఇచ్చినా పరిగణనలోకి తీసుకోము. భగవద్గీత, రంగనాథ్, బుల్డోజర్ ప్రకారమే ముందుకెళ్దాం అంటే సంబంధిత శాఖలు, అధికారులు చేసిన తప్పిదాలకు అంతిమంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజల నుండి వస్తున్న మద్దతు స్థానంలో తొందరలోనే అదే ప్రజల నుండి వ్యతిరేకత భావం వచ్చే ప్రమాదమూ పొంచి ఉంది.

ప్రస్తుత నగరాలు అన్నీ కూడా 50 శాతానికి పైగా చెరువులు, కుంటలల్లో వెలిసినవి. హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో పేరెన్నికగన్న రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రముఖులు నివసించే కాలనీలు ఒకప్పటి చెరువులే. వాటిని పునరుద్ధరించాలంటే 50% నగరాన్ని నేలమట్టంచేసి పునరుద్ధరించాల్సిందే. ఇది అయ్యే పనేనా? కావున ఇప్పటికైనా పాలకులు ప్రజలను కాకుండా వ్యవస్థను, అధికారులను బాధ్యుల్ని చేసినప్పుడు మాత్రమే. ఇకనైనా భూఆక్రమణాల్ని, అక్రమ నిర్మాణపు అనుమతుల్ని నివారించగలుగుతాం. ఉన్న చెరువులను కాపాడుకోగలుగుతాం. ఆక్రమణలు చేసి వేలాది కోట్ల రూపాయలు దండుకొని లాభపడ్డవాళ్లు నేరస్థులు. వాళ్లు అమ్మిన ప్లాట్లు, ఇల్లు లక్షల కొద్దీ వెచ్చించి ఉంటున్న సామాన్య ప్రజలు కాదని గ్రహించాలి. అదే సర్వామోదానికి నిలుస్తుంది. ప్రజా పాలనగా నిలకడగా నిలబడి కొనసాగుతుంది.

డా. బాదావత్ రాజు
9490393038

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News