Saturday, May 18, 2024

ప్రాంతీయ శక్తులదే పవర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రాంతీయ పార్టీల కూట మి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. కేంద్రంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏ ర్పాటు చేసే కూటమికే జాతీయ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని, తెలంగాణ లో బిఆర్‌ఎస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలుస్తుందని ధీ మా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 14 సీట్లు గెలిపిస్తే.. తెలంగాణ తడాఖా ఏందో దేశ రాజకీయాల్లో చూపిస్తానని పేర్కొన్నారు. ఇది మా తెలంగాణ అని తలెత్తుకునే విధంగా దేశ
రాజకీయాలను శాసిస్తామని వ్యాఖ్యానించారు. ఒక ఒరవడిలో కాకుండా.. స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని బిఆర్‌ఎస్‌నే గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. గోదావరి జలాలు తెలంగాణకు దక్కించుకోవాలంటే, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే

ఈ కీలక సమయంలో కేంద్రంలో మనం కీలకంగా మారాలని పేర్కొన్నారు.తన బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, బస్సు యాత్రను విజయవంతం చేసిన ప్రజలకు ఈ సందర్భంగా కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని, బిజెపి గెలిచే అవకాశాలు లేవని అన్నారు. తన బస్సుయాత్ర సందర్భంగా కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పుడు విధానాలను ప్రజలకు వివరించామన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, మహమూద్ అలీ, ఎంపి సురేష్‌రెడ్డి,ఎంఎల్‌సి సురభి వాణీదేవి, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి కెసిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, రేవంత్ రెడ్డి సర్కారు పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తన బస్సుయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, బస్సుయాత్ర సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు తనను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తెచ్చారని చెప్పారు.

వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను
అవకాశం వస్తే వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను అని కెసిఆర్ స్పష్టం చేశారు. “అవకాశం వస్తే ఎవరైనా ఉండరా..? నేను అంత అమాయకుడినా..? అవకాశం రావాల్నే కానీ.. తప్పకుండా రేసులో ఉంటానని” పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సెషన్‌లో కెసిఆర్ ప్రళయ గర్జన చూస్తారని పేర్కొన్నారు.పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేశ్ రెడ్డి కాబోతున్నారని అన్నారు. సురేశ్ రెడ్డి ఢిల్లీలో కీలకనేత అవుతారని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గానే ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కనీసం 9 స్థానాల్లో మూడో స్థానంలో ఉందని చెప్పారు. బిజెపి రెండో స్థానంలో ఉన్నా తమతో దూరంగా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఒకటి లేదా సున్నా(వన్ ఆర్ నన్) సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బిజెపికి ఓటేస్తే అశాంతి అజడి తప్ప ఏం రాదు అని అన్నారు. ఢిల్లీ గులాములు గెలిచి సాధించేది ఏం లేదని, కాంగ్రెసోళ్లు కూడా ఏం చేయరని చెప్పారు. ఢిల్లీ గులాముల కంటే తెలంగాణోళ్లు గెలిస్తేనే బెటర్ అని పేర్కొన్నారు. తమిళనాడు మనకు ఆదర్శం అని, తమిళనాడు ద్రవిడ పార్టీలను గెలిపిస్తరు కానీ బయటి పార్టీలను గెలపించరు అని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలను ఖతం చేయాలని కోరారు.

మా పార్టీలోకే కాంగ్రెసోళ్లు రాబోతున్నారు..
రేవంత్ రెడ్డినే బిజెపిలోని జంపు కొడుతారని కాంగ్రెస్ పార్టీలో అనుమానాలు ఉన్నాయని కెసిఆర్ పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో ఆయన తప్పించుకోలేరని, కాబట్టి కిందమీద అయితే కేసులు తప్పించుకునేందుకు బిజెపిలోకి వెళ్తాడని అనుకుంటున్నారని అన్నారు. తమ పార్టీ నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లడం కాదు, తమ పార్టీలోకే కాంగ్రెసోళ్లు రాబోతున్నారని చెప్పారు. తనను ఎవరూ డైరెక్ట్‌గా అడగలేదని, తమ పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యులు సంప్రదించారని అన్నారు. 26 నుంచి 33 మంది ఎంఎల్‌ఎలం రెడీగా ఉన్నాం..ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని తెలిపారు.

బిజెపికి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు
బిజెపికి 200 సీట్లు దాటే పరిస్థితి లేదు అని, అందుకే మోదీ చొక్కాలు చింపుకుంటున్నారని కెసిఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా బిజెపి గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయిందని, ఈ ఇండియా కూటమికి దిక్కు లేదని పేర్కొన్నారు. కచ్చితంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఈ దేశాన్ని శాసించే స్థాయికి పోతుందని అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీలం కలిసి బలమైన కూటమిగా ఏర్పడుతామని కెసిఆర్ వెల్లడించారు. తాము జాతీయ పార్టీలకు మద్దతు ఇచ్చే రోజులు పోయాయని, తమకే కాంగ్రెస్, బిజెపి సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుందని అన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో స్కాండినేవియన్ దేశంలో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై వీళ్ల కూటమే పెద్దగా అవతరించబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలే తమతో కలిసి వస్తాయని అన్నారు. తాను ఎక్కడో కూర్చుని జోస్యం చెప్పట్లేదని, రాష్ట్రంలో తిరిగొచ్చి చెబుతున్నానని పేర్కొన్నారు. దక్షిణాదిలో బిజెపికి 10 సీట్లు దాటే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఎపి సున్నా.. ప్రజ్వల్ రేవణ్ణ కేసు తర్వాత కర్ణాటకలో బిజెపి ఆరేడు సీట్లకే పరిమితమైందని చెప్పారు. 130 సీట్లు ఉన్నా దక్షిణాదిలో బిజెపి 10 సీట్లు దాటే పరిస్థితి లేదని, ఉత్తర భారతంలో కూడా బిజెపి చాలా ఘోరంగా దెబ్బతింటుంది తెలిపారు.
కాంగ్రెస్ వైఫల్యమే ఆ పార్టీని కాటు వేయబోతోంది

కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యం, ప్రజాభివృద్ధికి ఇవ్వలేదని కెసిఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిపై కాంగ్రెస్ తక్కువ దృష్టి పెట్టిందని, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌పై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పులే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీని కాటేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని మండిపడ్డారు.అద్భుతంగా ఉన్న విద్యుత్ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధ్వానస్థితికి తెచ్చిందని విమర్శించారు. బిఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ చేశారని పేర్కొన్నారు. న్యూయార్క్, లండన్‌లో విద్యుత్ పోయినా హైదరాబాద్‌లో పోదు అనే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. కరెంట్ కోతలు రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదరకమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ వెన్నెముకగా పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో తెలంగాణకు పరిశ్రమలు తరలివచ్చాయని, కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలు తరలిపోతున్నాయనే వార్తలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా రక్షిత తాగునీరు అందించారమని, హైదరాబాద్‌లో రూపాయికే నళ్లా కనెక్షన్ ఇచ్చామని కెసిఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ వచ్చాక అధికారుల్లో విచ్చలవిడితనం వచ్చిందని చెబుతున్నారని, కాంగ్రెస్ చేసిన నేరాలు క్షమార్హమైనవి కాదని అద్నరు. వ్యవసాయ కోసం వేల కోట్లు ఖర్చు చేశామని, కాంగ్రెస్ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సిఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకాలను తాను కొనసాగించినట్లు కెసిఆర్ తెలిపారు. ప్రస్తుత సిఎం రేవంత్‌రెడ్డి బేషజాలకు పోయి బిఆర్‌ఎస్ చేసిన కార్యక్రమాలను నిలిపేశారని దుయ్యబట్టారు. విద్యుత్‌రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఏ ఊరు పోతే అక్కడి దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారని, డిసెంబర్ 9 పోయి పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తాం అంటున్నారని గుర్తు చేశారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామంటున్నారని, ఏ సంవత్సరమో చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెప్పిన బోనస్ సాయం బోగస్ అయ్యిందని, కాంగ్రెస్ దుష్పరిపాలన ఆ పార్టీకి శాపంగా మారిందన్నారు. దళితబంధుకు బిఆర్‌ఎస్ విడుదల చేసిన నిధులను ఫ్రీజ్ చేశారని మండిపడ్డారు. జిల్లాలు తీసేస్తామంటే యుద్ధానికి సిద్ధమని ప్రజలు అంటున్నారని,ఇది కూడా కాంగ్రెస్‌కు ఎఫెక్ట్ అవుతోంది అని పేర్కొన్నారు.

బిజెపికి 400 సీట్లు ఇస్తే పెట్రోల్ ధర రూ.400 దాటుతుంది
లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 400 సీట్లు ఇస్తే పెట్రోల్, డీజిల్ ధర రూ.400 దాటుతుందని కెసిఆర్ జోస్యం చెప్పారు. బిజెపి మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తోందని ఆరోపించారు. బిజెపి ఎంజెడాలో రైతులు, పేదలు, సామాన్య ప్రజలు, దళితులు ఉండరు అని, ఈ పదేండ్లలో పేదల గురించి మోదీ పట్టించుకోలేదని విమిర్శించారు. ఆ పార్టీ నేతలు పేదల సంక్షేమం గురించి ఎప్పుడూ మాట్లాడరని దుయ్యబట్టారు. మోడీ 2014 నుంచి 150 నినాదాలు ఇచ్చారని, ఏ ఒక్క నినాదం కూడా ఆచరణలోకి రాలేదని అన్నారు. ఢిల్లీలో 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. అర్బన్ నక్సలైట్లు అని వారిని హత్య చేశారని, యుపి ఎన్నికల నేపథ్యంలో నల్ల చట్టాలు వాపస్ తీసుకుని క్షమాపణ వేడుకున్న అతి దుర్మార్గమైన ప్రధాని మోదీ అని పేర్కొన్నారు. మోడీ సబ్ కా సాత్..సబ్ కా వికాస్, మేకిన్ ఇండియా లేదు.. డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీలు ఒక్కటి కూడా కాలేదని, ఊకదంపుడు మచ్చట్లు తప్ప ఏం లేదని విమర్శించారు. సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఎక్కడ..? అని ప్రశ్నించారు. ఈ దేశంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని గుర్తు చేశారు.

మోడీ హయాంలో దేశంలో భయంకరంగా నిరుద్యోగిత పెరిగిందని పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం వస్తే విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తానన్నారని, ఎవరికైనా వచ్చాయా..? అని ప్రశ్నించారు. నరేంద్ర డిజిటల్ ఇండియా, బుల్లెట్ ట్రైన్, 2 కోట్ల ఉద్యోగాలు వంటి ఎన్నో హామీ ఇచ్చారని, అందులో ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. గోబెల్స్ అనేటోడు బతికి ఉంటే పాప వాడు సిగ్గుతో చనిపోతుండే.. అంత గోబెల్స్ ప్రచారం చేస్తది బిజెపి అని పేర్కొన్నారు. ఈ పదేండ్ల కాలంలో ట్రాష్, గ్యాస్ తప్ప.. మోదీ చేసిందేమీ లేదు అని, ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా మేలు జరగలేదని స్పష్టం చేశారు. 2004 నుంచి -14 మధ్య జిడిపి 6.8 శాతం ఉంటే.. ఈ దేశానికి ఘనత వహించిన విశ్వ గురు కాలంలో 5.8 శాతానికి వచ్చిందని విమర్శించారు. దేశం వెనుకకు పోయినట్టా..? ముందుకు పోయినట్టా..? అని నిలదీశారు. తెలంగాణ ప్రజల్లో బిజెపి పట్ల కూడా విముఖత ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.

తెలంగాణపై కేంద్ర పెత్తనం చెలాయిస్తే ఎదురించాం..
గోదావరిని ఎత్తుకుపోతా అని మోదీ అంటుంటు అని, ఎన్‌బ్ల్యూడీ ఏజెన్సీ ద్వారా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాకు నోటీసులు పంపారని కెసిఆర్ తెలిపారు. గోదావరి జలాల తరలింపుపై రాష్ట్రాల అభిప్రాయాలు చెప్పకున్నా తీసుకెళ్తాం అంటున్నారని పేర్కొన్నారు. మనకు ప్రధాన వనరు గోదావరి అని, అప్పుడప్పుడు కృష్ణా ఎండిపోతదని చెప్పారు. గోదావరిని తీసుకెళ్తామంటే తాను సిఎంగా ఉన్నప్పుడు అంగీకరించలేదని, తెలుగు రాష్ట్రాల వాటా తేల్చిన తర్వాత సర్ ప్లస్ ఉంటే చెప్తాం అని చెప్పారని గుర్తు చేశారు. మా వాటా తేల్చకుండా తీసుకెళ్తే.. మేం సాగు తాగునీళ్లకు చావాల్నా అని ఒప్పుకోలేదని అన్నారు. కెఆర్‌ఎంబి తమ మీద పెత్తనం చెలాయిస్తే ఎదురించామని, కెఆర్‌ఎంబి కేవలం సమన్వయ కర్తనే హెచ్చరించానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కెఆర్‌ఎంబికి మన ప్రాజెక్టులు అప్పగించారని, ప్రస్తుతం నాగార్జునసాగర్ కట్టపైకి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ
నా గుండెల్లో తెలంగాణ ఉంటది.. తెలంగాణ ప్రజల గుండెల్లో కెసిఆర్ ఉంటడు అని కెసిఆర్ స్పష్టం చేశారు. కెసిఆర్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, కెసిఆర్ ఈజ్ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ అని వ్యాఖ్యానించారు. కెసిఆర్ తెలంగాణకు ఉన్న బంధం అది అని, దిక్కు దివానా లేనప్పుడు తన పదవులు తన రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. కెసిఆర్‌ను గిల్లి పడేస్తాం అనుకుంటే వాడు పిచ్చోడు అయితడు తప్ప తెలంగాణ ప్రజలు కారు అని తేల్చిచెప్పారు. హైదరాబాద్ రెండో రాజధాని అయితే బాగుంటుందని ఎఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే లాంటి వ్యక్తి మాట్లాడం అంటే.. అంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదని పేర్కొన్నారు. ఇన్ని రోజులు ఢిల్లీకి పోయిన, నాకు హైదరాబాద్ దగ్గరైతదని ఖర్గే చెప్పి హైదరాబాద్ గొంతు కోస్తమంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలని అంటుండంటే వీళ్లు ఎవరు వచ్చినా హైదరాబాద్‌ను దెబ్బ కొడుతారు అని అర్థమైతుందని చెప్పారు. హైదరాబాద్ మనది మన సొంతం అని, దాన్ని అట్ల పోనివ్వమని స్పష్టం చేశారు. అటువంటి పిచ్చివాళ్లకు ఇక్కడ స్థానం ఇవ్వకూడదు అని కెసిఆర్ అన్నారు.

జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తా..
జాతీయ రాజకీయాల్లోకి రావాలని చెప్పి బిఆర్‌ఎస్ పార్టీ పేరు మార్చామని కెసిఆర్ చెప్పారు. తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత అందరితో చర్చించి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తన తెలివితేటలను రంగరించి అన్ని ప్రయత్నాలు చేస్తానని అన్నారు. ఇప్పటికే చాలా మందితో మాట్లాడుతున్నానని, అందరం కలిసి ప్రత్యామ్నాయం రూపొందింస్తామని తెలిపారు.
సన్ ఫ్లవర్ మాదిరి వారంతా పవర్ ఫ్లవర్స్..
నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయని కెసిఆర్ విమర్శించారు. ఈ సన్ ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువగా తయారైందని ఎద్దేవా చేశారు. పార్టీలు మారేవాళ్లు అందరూ పొద్దు తిరుగుడు పువ్వు తిరిగినట్టు తిరుగుతారు అని,… ఇవన్నీ పవర్ ఫ్లవర్స్ అని పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి వెళ్లిన వాళ్లు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కాదు అని, వాళ్ల స్వార్థం కోసం వాళ్ల పైరవీల కోసం వాళ్ల స్వలాభం కోసం పోతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ అందరూ పోలేదని, కొంతమంది మాత్రమే వెళ్లారని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ ఒక మహాసముద్రం అని, తమ పార్టీకి 60 లక్షల సభ్యత్వం ఉందని వెల్లడించారు. బిఆర్‌ఎస్‌ను ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారమే అని, లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బిఆర్‌ఎస్ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం మోదీ సృష్టించిన ఒక రాజకీయ కుంభకోణం
ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది నరేంద్ర మోదీ సృష్టించిన ఒక రాజకీయ కుంభకోణం అని కెసిఆర్ ఆరోపించారు. ఈ కేసులో తన కుమార్తె కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని స్పష్టం చేశారు. అది రివర్స్ పొలిటికల్ స్కాం అని, అందులో ఏం లేదు అంత వట్టిదే గ్యాస్ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆ కేసులో ఒక రూపాయి కూడా రికవరీ చేయలేదని, ఎవరి నుంచి ఎవరికి మనీ ల్యాండరింగ్ అయిందో ఎవరికీ తెలియదని అన్నారు. ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కాం కింద చిత్రీకరించారని విమర్శించారు. తాను, అరవింద్ కేజ్రీవాల్ మోడీకి కంటిలో నలుసులాగా… ముక్కులో కొయ్యలాగా ఉన్నామని, అందుకే కేంద్రంలోని బిజెపి సర్కార్ ఢిల్లీ లిక్కర్ స్కాం పేరిట లేని స్కాంను బయటకు తెచ్చారని ఆరోపించారు. తమ ఎంఎల్‌ఎల సంఖ్య 104 ఉండటంతోపాటు మజ్లిస్ ఎంఎల్‌ఎలు ఏడుగురు తమకు సపోర్ట్ ఉన్న సమయంలోనే తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మోడీ రాష్ట్రానికి ఏజెంట్లను పంపించారని, వాళ్లను పట్టి నిర్బంధించి వారిని జైల్లో వేశానని పేర్కొన్నారు.

ఆ ఏజెంట్లను పంపించిన మూలసూత్రధారి బీఎల్ సంతోష్ ప్రధాని మోదీకి రైట్ హ్యాండ్ అని, ఆయన బిజెపి జాతీయ కార్యదర్శి అని, ఆయనను పట్టుకురమ్మని చెప్పి ఢిల్లీలోని బిజెపి ంట్రల్ ఆఫీసుకు మన పోలీసులను పంపించానని చెప్పారు. ఆయనను పట్టుకురావడానికి తెలంగాణ పోలీసులు వెళ్లితే తప్పించుకున్నారని తెలిపారు. అది మోడీకి తమ మీద కోపం అని, ఆ కక్షను మనసులో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్‌ను, తన కూమార్తెను అరెస్టు చేశారని ఆరోపించారు. కవిత బతుకమ్మ ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎంతో కంట్రిబ్యూట్ చేశారని, అమెరికా నుంచి వచ్చి తన జీవితాన్ని వదులుకొని తెలంగాణ కోసం పని చేసిన బిడ్డ అని పేర్కొన్నారు. ఆమె మాట్లాడే విధానం, ప్రవర్తన అందరికి తెలుసు అని అన్నారు. నిర్దోషిని పట్టుకుపోయి ఒక మహిళ అని చూడకుండా.. కేవలం తన కూతురు అనే రాజకీయ కక్షతోని మోదీ అరెస్టు చేశారని మండిపడ్డారు. తమది రాజకీయ కుటుంబం కాబట్టి తాము కేసులకు భయపడం అని, కేసులను ఎదర్కొంటామని చెప్పారు. జైళ్లు తమకు కొత్త కాదు అని, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కెసిఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News