Sunday, April 28, 2024

చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది

- Advertisement -
- Advertisement -

జగిత్యాల : చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందనే నానుడికి అనుగుణంగా సిఎం కెసిఆర్ చెరువులు, కుంటలు అభివృద్ది చేయ డం వల్లే జలకళ సంతరించుకుని బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామ చెరువు మత్తడి మరమ్మతు పనులకు ఎంఎల్‌సి ఎల్.రమణతో కలిసి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్షం వల్ల చెరువులు, కుంటలు పూడికతో నిండిపోయి, పిచ్చి చెట్లు పెరిగిపోయి తాంబాలంలా మారిపోయాయని, ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యారన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలను అభివృద్ధి చేయడం వల్ల మండు వేసవిలో సైతం జలకళ సంతరించుకోవడంతో పాటు మత్తళ్లు పారుతున్నాయన్నారు.

మిషన్ కాకతీయలో జగిత్యాల నియోజకవర్గంలోని 172 చెరువులను రూ. 47 కోట్లు వె చ్చించి బాగు చేసుకున్నామని వివరించారు. మోతె చెరువుకు గతంలో రూ.36 లక్షలు మంజూరు చేసి అభివృద్ధి చింతకుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్ది సాయంకాలం పూట పట్టణ వాసులు అక్కడ సేదతీరేలా సుందరీకరించామన్నారు. రాష్ట్రంలో గంగపుత్రుల కోసం ఉచితంగా చేప పిల్లలను అందించడంతో పాటు చేపలను పట్టుకునేందుకు, విక్రయించుకునేందుకు అవసరమైన సామాగ్రి, మోపెడ్‌లను అందించడంతో పాటు అన్ని వసతులతో కూడిన చేపల మార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేవలం తొమ్మిదేళ్లలోనే దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో చెరువుల కట్టలు, మత్తడులు దెబ్బతినగా ఇరిగేషన్ ఇఎన్‌సిని కలిసి పరిస్థితిని వివరించి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో సాగు నీటి కోసం చెరువుల తూములు, కాల్వల వద్ద రైతులు కొట్లాడుకునే వారని, అయినా నీరందక ఎకరాల కొద్దీ పంటలు ఎండిపోయేవన్నారు.

సాగు నీటి కష్టాలను దూరం చేసేందుకు సిఎం కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల నేడు రైతుల కొట్లాటలు లేవని, గుంట భూమి ఎండింది లేదన్నారు. కుల మత బేదం లేకుండా అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత 60 ఏళ్లలో జరగని అభివృద్దిని కేవలం 9 ఏళ్లలోనే చేసి చూపించడం జరిగిందని, అందుకే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు.

ఎంఎల్‌సి ఎల్. రమణ మాట్లాడుతూ, మోతె చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు మంజూరు జరిగేలా చూస్తానన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని, దేశమంతా తెలంగాణ వైపు చూసేలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని అన్నారు. చెరువులు, కుం టలు నిండు కుండలా ఉండటంతో చేపల ఉత్పత్తి చాల పెరిగిందని, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి ములాసపు లక్ష్మి, జెడ్పీటీసీ మహేశ్, సర్పంచ్ స్వప్న, ఎంపిటిసి రాజశేఖర్‌రెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేశ్, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్‌రావు, మండల రైతుబంధు కన్వీనర్ శంకర్, ఎస్‌ఇ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News