Saturday, April 27, 2024

భారత్‌కు అంత ఈజీ కాదు!

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/క్రీడా విభాగం: టెస్టుల్లో వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియాకు న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ సవాలు వంటిదేనని చెప్పక తప్పదు. టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచిన విషయం తెలిసిందే. అయితే కివీస్‌ను వారి సొంత గడ్డపై ఓడించడం మాత్రం టీమిండియాకు అంత తేలిక కాదని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే కివీస్ పిచ్‌లపై భారీ స్కోరు సాధించడం భారత బ్యాట్స్‌మెన్ అంత సులువు కాక పోవచ్చు. అంతేగాక బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శనతో చెలరేగడం అనుకున్నంత తేలిక కాదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో భారత బౌలర్లు పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచారు. ముఖ్యంగా ప్రధాన బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా వైఫల్యం జట్టును వెంటాడుతోంది. వన్డే సిరీస్‌లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేక పోయాడు. ఇది జట్టును ఎంతో కలవరానికి గురి చేస్తోంది. దీనికి తోడు మరో సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయం బారీన పడడం కూడా భారత్ కష్టాలను రెట్టింపు చేసింది. ఇలాంటి తరుణంలో బలమైన న్యూజిలాండ్‌ను ఎదుర్కొవడం భారత్‌కు సవాలుగా తయారైంది. మరోవైపు వన్డే సిరీస్‌లో ఓపెనర్లుగా దిగిన మయాంక్ అగర్వాల్, పృథ్వీషాలు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. మయాంక్ అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ నిరాశే మిగిల్చాడు. టెస్టుల్లో అద్భుత ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న మయాంక్ ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. అతను ఫామ్‌ను అందుకోక పోతే భారత్‌కు ఇబ్బందులు తప్పక పోవచ్చు. దీనికి తోడు రోహిత్ శర్మ గాయం వల్ల సిరీస్‌కు దూరం కావడం కూడా భారత్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లలో మయాంక్, రోహిత్‌లు కలిసి పలు మ్యాచుల్లో శుభారంభం అందించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మరో యువ ఓపెనర్ పృథ్వీషాపై జట్టు భారీ ఆశలు పెట్టుకొంది. నిషేధం వల్ల షా కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే వన్డే సిరీస్ ద్వారా మళ్లీ క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఇక, వన్డే సిరీస్‌లో షా కాస్తా బాగానే ఆడాడు. ఇక, తనకు ఎంతో కలిసి వచ్చే టెస్టు ఫార్మాట్‌లో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇదిలావుండగా సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, వృద్ధిమాన్ సాహా తదితరులు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్ కోహ్లిపై నెలకొంది. టెస్టుల్లో అసాధారణ రీతిలో చెలరేగి పోతున్న కోహ్లి కివీస్‌పై కూడా తన జోరును కొనసాగించక తప్పదు. అప్పుడే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తగ్గుతాయి.

IND vs NZ Test Series 2020 start from Feb 21

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News