Thursday, May 2, 2024

పుజారాపై విమర్శల వర్షం..

- Advertisement -
- Advertisement -

IND vs SA: Netizens criticise Pujara for poor batting

సెంచూరియన్: టీమిండియాలోనే అత్యంత కీలకమైన బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న మిస్టర్ డిపెండబుల్, నయా వాల్ చేటశ్వర్ పుజారా వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో అంతంత మాత్రంగానే రాణించిన పుజారా తాజాగా సౌతాఫ్రికా జరుగుతున్న మొదటి టెస్టులో కూడా తేలి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై నిరాశ పరిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనైనా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తాడని జట్టు యాజమాన్యం ఆశించింది. కానీ, పుజారా మాత్రం తన పేలవమైన ఆట తీరును ఈసారి కూడా కొనసాగించాడు. జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తే మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులు మాత్రమే చేసి ఎంగిడి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. బౌన్స్‌కు సహకరించే సౌతాఫ్రికా పిచ్‌లపై పుజారా మెరుగైన బ్యాటింగ్ కనబరుస్తాడనే నమ్మకంతో అతనికి మరో ఛాన్స్ ఇచ్చారు. పుజారా మాత్రం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడంలో విఫలమయ్యాడు. వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమై ఇటు కెప్టెన్‌ను అటు సెలెక్టర్లను నిరాశకు గురి చేశాడు.
విమర్శల వర్షం..
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పుజారాపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. అతన్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఒకప్పటి ప్రతిభను దృష్టిలో పెట్టుకుని వరుస అవకాశాలు కల్పించడాన్ని అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. అతనికి ఇప్పటికే ఎన్నో అవకాశలు ఇచ్చారని, అయినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడని, దీంతో అతని స్థానంలో యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలని వారు సూచిస్తున్నారు. కొన్నేళ్లుగా పుజారా ఒక్క మ్యాచ్‌లో కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నాడు. ప్రతిసారి ఘోర వైఫల్యం చవిచూస్తున్నాడు. అతని వైఫల్యం జట్టు బ్యాటింగ్‌పై బాగానే ప్రభావం చూపుతోంది. ఇదిలావుండగా రానున్న రెండు టెస్టుల్లో పుజారాకు తుది జట్టులో చోటు కష్టంగానే కనిపిస్తోంది. అతని స్థానంలో యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్ లేదా హనుమ విహారిలకు చోటు దక్కే అవకాశాలున్నాయి. ఇక తొలి టెస్టులో ఘోర వైఫల్యంతో పుజారా టెస్టు జట్టులో స్థానాన్ని కష్టం చేసుకున్నాడనే చెప్పాలి.

IND vs SA: Netizens criticise Pujara for poor batting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News