Saturday, April 27, 2024

కదం తొక్కిన రోహిత్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. కదం తొక్కిన రోహిత్
రాణించిన రహనె, భారత్ 300/6

చెన్నై: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సీనియన్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీ శతకంతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 33 (నాటౌట్), తొలి టెస్టు ఆడుతున్న అక్షర్ పటేల్ 5 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగింది. తొలి టెస్టులో విఫలమైన వాషింగ్టన్ సుందర్, షైబాజ్ నదీమ్‌లకు ఉద్వాసన పలికింది. వీరి బదులు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లను తుది జట్టులోకి తీసుకొంది. అంతేగాక సీనియర్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి హైదరాబాది యువ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించింది. ఇంగ్లండ్ కూడా భారీ మార్పులతో మ్యాచ్‌లో దిగింది.
ఆరంభంలోనే..
టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (౦)ను ఒల్లి స్టోన్ ఔట్ చేశాడు. అప్పటికీ భారత్ ఖాతానే తెరవలేదు. దీంతో మరోసారి టీమిండియాకు శుభారంభం దక్కలేదు.
పుజారాతో కలిసి
అయితే తర్వాత వచ్చిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు కలిసి ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. పుజారా తన మార్క్ డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మరోవైపు రోహిత్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును పరిగెత్తించాడు. అతన్ని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు ప్రయత్నాలు ఫలించలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. ఇదే క్రమంలో పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించాడు. కానీ ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జాక్ లీచ్ విడగొట్టాడు. కుదురుగా ఆడుతున్న పుజారా స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సమన్వయంతో ఆడిన పుజారా 58 బంతుల్లో 21 పరుగులు చేశాడు.
కోహ్లి డకౌట్
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్యంగా ఔటయ్యాడు. స్పిన్నర్ మోయిన్ అలీ వేసిన బంతిని అంచన వేయడంలో విఫలమైన కోహ్లి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అతను ఎలా ఔటయ్యాడనే దానిపై చాలా సేపటి వరకు ఉత్కంఠ నెలకొంది. చివరికి అతను బౌల్డ్ అయినట్టు రిప్లేలో స్పష్టమైంది. దీంతో కోహ్లి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.
ఆదుకున్న రోహిత్, రహానె
ఒకే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఆదుకున్నారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. లంచ్ విరామానికి భారత్ 106/3తో ఉంది. ఆ తర్వాత రోహిత్, రహానె అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లుగా మలుస్తూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోహిత్ తన మార్క్ షాట్లతో అలరించాడు. రహానె సమన్వయంతో ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ మళ్లీ పుంజుకుంది. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన రోహిత్ 130 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేయడం విశేషం. గింగిరాలు తిరుగుతున్న బంతులను బౌండరీలుగా మలుస్తూ అతను ఇన్నింగ్స్‌ను కొనసాగించిన తీరును ఎంత పొగిడినా తక్కువే. టివిరామ సమయానికి టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులకు చేరింది.

ఆ తర్వాత కూడా రోహిత్, రహానె జోరును కొనసాగించారు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరుగెత్తించారు. ఇదే క్రమంలో రోహిత్ 150 మార్క్‌ను అందుకున్నాడు. అయితే 161 బంతుల్లో 18 ఫోర్లు, రెండు సిక్సర్లతో 161 పరుగులు చేసిన రోహిత్‌ను జాక్ లీచ్ ఔట్ చేశాడు. దీంతో 162 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే రహానె కూడా ఔటయ్యాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానె 149 బంతుల్లో 9 ఫోర్లతో 67 పరుగులు చేసి మోయిన్ అలీ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రోహిత్, రహానె ఒక్క పరుగు తేడాతో పెవిలియన్ చేరడం విశేషం. తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అక్షర్ పటేల్‌తో కలిసి వికెట్ కీపర్ రిషబ్ పంత్ భారత్ స్కోరును మరో వికెట్ పడకుండా 300 పరుగులకు చేర్చాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్, మోయిన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్టోన్, రూట్‌లకు తలో వికెట్ లభించింది.

India 300/6 at Stumps on Day 1 against Eng

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News