Saturday, May 3, 2025

ఆర్థికాభివృద్ధిలో అసమానతలెన్నో

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుంది అని ప్రగల్భాలు పలుకుతున్న ప్రస్తుత పాలకులు ఇకనైనా ప్రజల వాస్తవ పరిస్థితిని గమనించి, ఈ ఆర్థికాభివృద్ధి వాపా లేక బలుపా అని బేరీజు వేసుకుని ముందుకుసాగడం ఉత్తమం. ఎందుకంటే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సంస్థలు వివిధ అంశాలపై ప్రకటించిన అనేక ర్యాంకులు పరిశీలిస్తే భారతదేశ వాస్తవ అభివృద్ధి కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నది. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’ సాధనలో మన దేశం 109వ స్థానంలో నిలిచింది. మానవ అభివృద్ధి సూచిక (హెచ్‌డిఐ)లో 134వ స్థానం, సంతోష సూచికలో 126వ స్థానంలో, ఆకలి సూచిలో 105వ స్థానంలో, అవినీతిలో 96వ స్థానంలో, పోషకాహార లోపంలో 111వ స్థానంలో, మహిళా రక్షణ లో 128వ స్థానంలో, మల్టీ డైమెన్షనల్ పావర్టీలో 126వ స్థానంలో, లింగ సమానత్వంలో 129వ స్థానంలో, తలసరి ఆదాయంలో 124వ స్థానంలో, అక్షరాస్యత రేటు 80% శాతం లోపు, నిరుద్యోగం దాదాపు 5% శాతంతో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థగా మారటం వల్ల భారతదేశానికి ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకుకలిగిన ప్రయోజనం ఏమిటి? ఇది మన అందరినీ వెంటాడుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నలకు నేటి పాలకులు సమాధానం చెప్పాలి. నేటికి భారత దేశంలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రపంచంలోనే ప్రాముఖ్యత కలిగిన వంద విశ్వవిద్యాలయాల్లో మన దేశం నుంచి ఒకటి లేకపోవడం గమనార్హం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాల పూర్తి అవుతున్నా, నేటికీ వివిధ ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్లు సుమారు 70 కోట్ల మందికి పంచుతూ, కనీసం ఒక్క పూట భోజనం ఏర్పాటు చేయడం జరుగుతున్నదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు పరిశీలిస్తే, తేటతెల్లం అవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ, పేద మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మండుతున్నాయి.

ఎక్కడ చూసినా నిరుద్యోగం తాండవిస్తున్నది. ఉద్యోగ ఉపాధి అవకాశాలులేక వలసల భారతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా మారినా ఎవరికి లాభం? కేవలం ఈ అభివృద్ధి అంతా కొందరి బడా పారిశ్రామిక వేత్తలు, సంస్థలకు చెందినదిగా గుర్తించాలి. కార్పొరేట్ వ్యక్తుల అభివృద్ధే దేశాభివృద్ధిగా చెబుతూ పాలకులు ప్రజలను నమ్మించడం ఇకనైనా మానాలి. దేశానికి అన్నం అందించే అన్నదాతలు ఆర్తనాదాలు పాలకులకు వినబడడం లేదు. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు కనపడటం లేదు. కేవలం నాలుగు రహదారులు, ఆరు విమానాశ్రయాలు, పది పదంతస్థుల ఆకాశహర్మ్యాలు నిర్మించి, యాభై, డెభై అడుగుల విగ్రహాలు, సందర్శించే దేవాలయాలు, ఆకర్షించే కుంభమేళా వంటివి చేయడం ద్వారా దేశంలో పేదరికం తగ్గుతుందా! ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ద్వారా వాస్తవాలు ఎల్లకాలం దాచలేరు. గతంలో 8%, 9% ఉన్న జిడిపి, నేడు 5 నుంచి 6 మధ్య కదలాడుతున్నదని గ్రహించాలి.

ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలతో అనేక ఒడిదుడుకులు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇకనైనా పాలకులు పారిశ్రామిక రంగానికి, వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలి. గతంలో కంటే కొన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినా, కీలక రంగాల్లో మరింత అభివృద్ధి సాధించవలసిన అవసరం ఉంది. ‘చైనా’ వలే స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేయాలి. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేయాలి. నినాదాలు కాదు సరైన నిర్ణయాలు తీసుకోవడం జరగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు ఊబిలో కూరుకు పోకుండా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సన్నాహాలు చేయాలి. కుల, మత, వర్గ, భాష, లింగ వివక్షలు తొలగించడానికి కృషి చేయాలి. అంతేకాని కొందరు బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ వ్యక్తుల బిలియనీర్ల సంపదే దేశ అభివృద్ధి అని నమ్మి, దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా మారింది అని చెప్పి మురిసిపోవడం చాలా ప్రమాదకరం అని గ్రహించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ‘దేశ ప్రజలు అందరి అభివృద్ధే దేశాభివృద్ధి’ అని నమ్మి ముందుకు సాగడం ఉత్తమం.

– ఐ. ప్రసాద్ రావు, 63056 82733

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News