Sunday, April 28, 2024

తగ్గుతోన్న ఫారెక్స్ నిల్వలు

- Advertisement -
- Advertisement -

16 నెలల్లో 80 బిలియన్ డాలర్లు క్షీణత
మొత్తం విదేశీ మారక నిల్వలు 567 బి.డాలర్లకు డౌన్
రూపాయి పతనాన్ని ఆపేందుకు వినియోగిస్తోన్న ఆర్‌బిఐ

న్యూఢిల్లీ : భారతదేశంలో విదేశీ మారక నిల్వలు(ఫారెక్స్) భారీగా క్షీణిస్తున్నాయి. 16 నెలల కాలంలో ఫారెక్స్ నిల్వలు దాదాపు 80 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫిబ్రవరి 17 నాటికి మొత్తం నిల్వలు 566.65 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. అయితే 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరాయి. కానీ ఇప్పుడు క్షీణిస్తూ వస్తున్నాయి. దీనికి ప్రధానం కారణం రూపాయి పతనాన్ని ఆపేందుకు గాను ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) నిధులను ఎక్కువగా వినియోగించడమే.

మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీల్లో సంక్షోభం కారణంగా దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ పెరిగింది. ఇది కూడా ఫారెక్స్ నిల్వలపై ప్రభావం చూపిస్తోంది. ఫిబ్రవరి 17 నాటి వారాంతంలో విదేశీ మారక నిల్వలు 8.3 బిలియన్ డాలర్లు క్షీణించి 566.95 బిలియన్ డాలర్లకు చేరాయి. 2022 ఏప్రిల్ తర్వాత ఇదే అత్యంత భారీ క్షీణత, అంటే 11 నెలల్లో భారీ తగ్గుదల నమోదైంది. అంతకుముందు ఫిబ్రవరి మొదటి వారంలో 575.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే రెండో వారంలో 1.5 శాతం తగ్గాయి.

రూపాయి పతనం నియంత్రణ కోసం..
అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.84 కు పడిపోయింది. రోజు రోజుకూ రూపాయి విలువ క్షీణిస్తూ ఉండడం, మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గుల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ జోక్యం చేసుకుంటోంది. ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి, ఇతర కారణాల నేపథ్యంలో రూపాయి పతనాన్ని ఆపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగానే ఆర్‌బిఐ ఫారెక్స్ నిధులను ఎక్కువగా వినియోగిస్తోంది. ఈ కారణంగా దేశీయ ఫారెక్స్ నిల్వలు పడిపోతున్నాయి. వాల్యుయేషన్ లాభాలు, నష్టాల వల్ల కూడా నిల్వల్లో మార్పులు వస్తాయని గతంలో ఆర్‌బిఐ వెల్లడించింది. దేశీయ ఎఫ్‌సిఎ(ఫారిన్ కరెన్సీ అసెట్) 7.11 బిలియన్ డాలర్లు తగ్గి 500.59 బిలియన్ డాలర్లకు చేరింది. బంగారం నిల్వలు 919 మిలియన్ డాలర్లు తగ్గి 42.86 బిలియన్ డాలర్లకు చేరగా, ఎస్‌డిఆర్ 190 మిలియన్ డాలర్లు తగ్గి 18.35 బిలియన్ డాలర్లకు చేరాయి.

గతవారం రూపాయి 0.8% డౌన్
గతవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.8 శాతం పడిపోయింది. గత రెండు నెలల్లో ఇది అతిపెద్ద క్షీణత. రూపాయి విలువ 82.34 నుంచి 82.79కి పడిపోయింది. గత వారంలో రూపాయి 82.57 నుంచి 82.89కి పడిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News