Sunday, April 28, 2024

తొలి రోజు బౌలర్ల హవా

- Advertisement -
- Advertisement -

India lead in Day night practice match between India A and Australia A

 

భారత్‌కు ఆధిక్యం, ఆస్ట్రేలియాఎతో ప్రాక్టీస్ మ్యాచ్

సిడ్నీ: తొలి టెస్టుకు సన్నాహకంగా భారత్‌ఎ, ఆస్ట్రేలియాఎ జట్ల మధ్య జరుగుతున్న డేనైట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలర్ల హవా కొనసాగింది. పింక్‌బాల్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శుక్రవారం తొలి రోజే 20 వికెట్లు పడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియాఎ కూడా 108 పరుగులకే కుప్పకూలింది. షమి, సైని, బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు.

ఆరంభంలోనే..

ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియాకు కూడా ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జోయ్ బర్న్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మాడిన్సన్‌తో కలిసి మరో ఓపెనర్ మార్కస్ హారిస్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. అయితే 4 ఫోర్లతో 26 పరుగులు చేసిన హారిస్‌ను షమి వెనక్కి పంపాడు. అదే ఓవర్‌లో బెన్ మెక్‌డెర్మాట్‌ను కూడా షమి ఔట్ చేశాడు. అతను సున్నాకే వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా మళ్లీ కోలుకోలేక పోయింది. భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కు కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. మాడిసన్ 3 ఫోర్లతో 19 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మరోవైపు సీన్ అబార్ట్ (౦) ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు.

అతన్ని షమి ఔట్ చేశాడు. ఇదిలావుండగా ఈ దశలో కెప్టెన్ అలెక్స్ కారె కొద్ది సేపు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ధాటిగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆరు ఫోర్లతో 32 పరుగులు చేసిన కారెను నవ్‌దీప్ సైని ఔట్ చేశాడు. కాగా, జాక్ వైల్డర్‌ముత్ (12)ను బుమ్రా పెవిలియన్ బాట పట్టించాడు. సదర్లాండ్ (౦)ను సైని వెనక్కి పంపించాడు. స్వెప్సన్ (1) కూడా సైని బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. హారి కాన్వె (7) రనౌట్ కావడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 32.2 ఓవర్లలో 108 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్లలో షమి, సైని మూడేసి వికెట్లు పడగొట్టారు. బుమ్రాకు రెండు, సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది. కాగా ఇండియాఎకు 86 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

పృథ్వీషా, గిల్ జోరు

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (2)ను సీన్ అబార్ట్ వెనక్కి పంపాడు. అయితే తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ పృథ్వీషా ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే మరోవైపు చెత్త బంతులను బౌండరీలుగా మలచడంలో సఫలమయ్యారు. చెలరేగి ఆడిన పృథ్వీషా 29 బంతుల్లోనే 40 పరుగులు సాధించాడు. అయితే జోరుమీద కనిపించిన షాను సదర్లాండ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే హనుమ విహారి (15) కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీశారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ ఆరు ఫోర్లు, సిక్స్‌తో 43 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

బుమ్రా మెరుపులు

ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించడంతో ఒక దశలో ఇండియాఎ 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో జస్‌ప్రిత్ బుమ్రా అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. అతనికి మహ్మద్ సిరాజ్ అండగా నిలిచాడు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బుమ్రా ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. సిరాజ్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో ఔటయ్యాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో జాక్ వైల్డర్‌ముత్, సీన్ అబార్డ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News