Thursday, May 2, 2024

ఈ ఏటి మేటి వ్యక్తులు బైడెన్-హారిస్

- Advertisement -
- Advertisement -

Joe Biden Kamala Harris Named Time Magazine's 'Person of the Year'

 

టైమ్ పత్రిక గుర్తింపు.. ముఖచిత్ర కథనం

న్యూయార్క్ : అమెరికా భావి అధ్యక్షులు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ ఏటి (2020) విశిష్ట వ్యక్తులుగా నిలిచారు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ వీరిని పర్సన్ ఆఫ్‌ది ఇయర్‌గా ప్రకటించింది. ముఖ్యచిత్ర కథనంగా వీరి ఫోటోలతో తాజా మ్యాగజైన్ వెలువడింది. అమెరికా చరిత్రను మార్చే ద్వయం అనే శీర్షికతో వీరిని ప్రశంసించారు. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో జో బైడెన్ విజయం దక్కించుకున్నారు. వచ్చే నెలలో దేశాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పర్సన్ ఆఫ్ ది ఇయర్ తుది రేసులో పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు. క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు , డాక్టర్ ఆంథోనీ ఫౌచీ, ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇతరులు తుది పోటీలో ఉన్నారు. అయితే వీరిని అధిగమిస్తూ చివరికి బైడెన్, హారిస్‌లు ఈ ఏటి మేటి వ్యక్తులుగా ఎంపిక అయినట్లు పత్రికా నిర్వాహకులు తెలిపారు. కొందరు విభజన శక్తులు తమ సత్తా చాటాలనుకున్నారు, అయితే ఇవి ఫలించలేదు. విభజన శక్తుల కంటే వ్యక్తుల పట్ల ఉండే ప్రజానీకపు సానుభూతి కీలకం అని టైమ్ పత్రిక తెలిపింది.

అమెరికాకు ముప్పుగా పరిణమించిన కరోనా వైరస్ విపత్కర పరిస్థితులలో అవసరం అయిన వైద్యంపై దృష్టి పెట్టినందుకు వీరిని విశిష్ట వ్యక్తులుగా ఎంపికచేసినట్లు పత్రిక తెలిపింది. 1927 నుంచి ఏటా ఈ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ప్రకటిస్తోంది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో వివిధ అంశాలలో వ్యక్తుల కృషి , వాటి వల్ల తలెత్తిన సామాజిక పరిణామాలు వారు సాధించిన ప్రగతి, ప్రజల నుంచి అందుకున్న మన్ననలను పరిగణనలోకి తీసుకుని పర్సన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలను, ఈ విధంగా ఎంపికైన వారిని టైమ్ పత్రికపై ముఖ చిత్ర ఫోటోలుగా ప్రచురించడం ఆనవాయితీగా ఉంది. గత ఏడాది యువ పర్యావరణ కార్యకర్త, స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్‌ను , 2016లో ట్రంప్‌ను ఈ పత్రిక పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలుపొంది, ఇప్పుడు టైమ్ మ్యాగజీన్ పోటీలోనూ ట్రంప్‌పై విజయం సాధించిన బైడెన్ కమలా హారిస్‌లు తమ పదవీ బాధ్యతల స్వీకరణల దశలో ఈ ఏటి మేటి వ్యక్తుల గుర్తింపుతో మరింత బలం చేకూర్చుకోనున్నారు. అయితే ఇప్పటికీ ప్రెసిడెంట్ ట్రంప్ తాను ఓడిపోలేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి , ఎంతకూ అందుబాటులోకి రాని నివారణ ప్రక్రియలు, మందగించిన ఆర్థిక వ్యవస్థల నేపథ్యంలో 2020 సంవత్సరం కరకు సంవత్సరంగా మారి, ప్రపంచ చరిత్రలో తన సంక్లిష్టతను ఖరారు చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News