Thursday, May 2, 2024

గత ఏడాది దేశంలో1.53 లక్షల ఆత్మహత్యలు

- Advertisement -
- Advertisement -
India Recorded 1.53 Lakh Suicides in 2020
సగటున రోజుకు 418 మంది ఆత్మహత్య
అందులో 10 వేలకు పైగా వ్యవసాయ రంగానికి చెందినవే
క్రితం ఏడాదికన్నా 2020లో పెరిగిన ఆత్మహత్యలు
రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్

న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో దేశంలో మొత్తం 1,53,052 ఆత్మహత్యలు సంభవించాయి. అంటే సగటున రోజుకు 418 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో 10,677 మంది వ్యవసాయ రంగానికి చెందిన వారున్నారని కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2019 సంవత్సరంతో పోలిస్తే 2020 సంవత్సరంలో ఆత్మహత్యలు పెరిగాయని, ఆ ఏడాది 1,39,123 మంది ఆత్మ హత్య చేసుకున్నారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద పని చేసే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్‌సిఆర్‌బి) తన వార్షిక నివేదికలో తెలియజేసింది. ప్రతి లక్ష జనాభాకు అత్మహత్యలు రేటు కూడా 2019లో ఉన్న 10.4నుంచి గత ఏడాది 11.3 శాతానికి పెరిగినట్లు కూడా ఆ నివేదిక వెల్లడించింది.

2020 సంవత్సరంలో మొత్త 10,677 మంది వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న వారు మృతి చెందగా వీరిలో 5,579 మంది రైతులు, లేదా పంటలు పండించే వారు ఉండగా 5,098 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. దేశంలో మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 7 శాతం ఈ రంగానికి చెందిన వారున్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. ఆత్మహత్యలు చేసుకున్న 5,579 మందిలో మగవారు 5,335 మంది కాగా, 244 మంది స్త్రీలున్నారు. అలాగే 2020లో ఆత్మహత్యలు చేసుకున్న 5,098 మంది వ్యవసాయ కార్మికుల్లో మగవారు 4,621 మంది ఉండగా మహిళలు 477 మంది ఉన్నారు.

కాగా అత్యధిక ఆత్మహత్యలతో మహారాష్ట్ర జాబితాలో టాప్‌లో ఉంది. అక్కడ గత ఏడాది 19,909 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆతర్వాతి స్థానాల్లో తమిళనాడు( 16,883), మధ్యప్రదేశ్(14,578), పశ్చిమ బెంగాల్(13,103), కర్నాటక( 12,259) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో సంభవించిన మొత్తం ఆత్మహత్యల్లో 50.1 శాతం ఈ అయిదు రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. కాగా దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆత్మహత్యల శాతం తక్కువగా ఉండడం గమనార్హం. దేశం మొత్తం మీద జరిగిన ఆత్మహత్యల్లో ఈ రాష్టం వాటా 3.1 శాతమే. కాగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో దేశ రాజధాని ఢిల్లీ ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ గత ఏడాది మొత్తం 3,142 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. జాతీయ స్థాయి ఆత్మహత్యలు రేటుతో పోలిస్తే నగరాల్లో ఆత్మహత్యలు రేటు ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఆత్మహత్యల్లో కుటుంబ సమస్యలు(33.6 శాతం), వివాహ సంబంధిత సమస్యలు (5 శాతం), అనారోగ్య కారణాలు(18 శాతం) ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని, మొత్తం ఆత్మహత్యల్లో ఈ కారణాల వల్ల చనిపోయిన వారు 56.7 శాతం ఉన్నారని ఎన్‌సిఆర్‌బి తన నివేదికలో తెలిపింది.

ప్రమాదాల్లో మృతులు 3.75 లక్షల మంది

కాగా 2020 సంవత్సరంలో మొత్తం 3,74,397 మంది మృతి చెందగా, రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారు అందులో 35 శాతం మందికి పైగా ఉన్నారు. అయితే 2019లో సంభవించిన 4,21,104 మరణాలతో పోలిస్తే 2020లో ప్రమాదాల కారణంగా చనిపోయిన వారు తక్కువగా ఉండడం గమనార్హమని ఎన్‌సిఆర్‌బి నివేదిక పేర్కొంది. ప్రమాదాల మరణాల రేటు ప్రతి లక్ష జనాభాకు 2019లో 31.4 కాగా 2020లో అది 27.7గా ఉంది. దేశంలో గత ఏడాది 3,54,796 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వీటిలో మొత్తం 1,33,201 మంది మృతి చెందగా, 3,35,201 మంది గాయపడ్డారు. రోడ్డుప్రమాదాల్లో 60 శాతానికి పైగా ఓవర్‌స్పీడ్ వల్లే సంభవించాయని. ఈ కారణంగా 75,333 మంది చనిపోగా, 2,09,736 మంది గాయపడినట్లు ఆ నివేదిక తెలిపింది. రోడ్డుప్రమాదాల్లో మృతి చెందిన లేదా గాయపడిన బాధితుల్లో 43.6 శాతం మంది ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారేనని, కార్లు, ట్రక్కులు, బస్సులు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. రోడ్డు ప్రమాదాల్లో 24.3 శాతం ప్రమాదాలు ప్రమాదకరమైన లేదా నిర్లక్ష డ్రైవింగ్ లేదా ఓవర్‌టేకింగ్ వల్ల సంభవించినవేనని కూడా ఎన్‌సిఆర్‌బి తన వార్షిక నివేదికలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News