పాక్ పౌరులకు భారత్‌లోకి నో ఎంట్రీ సార్క్ వీసాలన్నీ రద్దు
48గంటల్లోగా పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం వాఘా
సరిహద్దు చెక్‌పోస్టు మూసివేత దౌత్యకార్యాలయ సిబ్బంది 55
నుంచి 30కి కుదింపు నేడు అఖిలపక్ష సమావేశం పహల్‌గామ్
ఉగ్రదాడి పాక్ పన్నాగమేనని భారత విదేశాంగశాఖ ప్రకటన
ఉగ్రదాడి అనంతరం హుటాహుటిన ఢిల్లీకి చేరిన ప్రధాని
విమానాశ్రయంలోనే ఉన్నతాధికారులతో సమీక్ష సాయంత్రం
ప్రధాని మోడీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ
ఉగ్రవాదులకు అండగా నిలిచిన దాయాదిపై పాంచజన్యం పూరించిన
ఎన్‌డిఎ ప్రభుత్వం ఐదు కీలక నిర్ణయాలతో పాకిస్థాన్‌కు షాక్
పహల్‌గామ్ రక్తపుటేరుల్లో కన్నీటి జలధారలు కొత్త జంటల్లో
అంతులేని విషాదం నింపిన ఘటన పర్యాటకులను
రక్షించబోయి బలైన హార్స్ రైడర్ పహల్‌గామ్ చేరుకున్న
ఎన్‌ఐఎ బృందం ఉగ్రవాదుల దాడితో కశ్మీర్‌ను వీడుతున్న
పర్యాటలకులు భారత్‌కు అండగా నిలిచిన ప్రపంచ దేశాలు
జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో మంగళవారం 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చడమే కాకుండా ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన వారు లేదా, ఆ దేశంతో సంబంధాలున్న స్థానిక ఉగ్రవాదులుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో భారత్ ఈ దాడిని తీవ్రంగా పరిగణించింది. సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా కుదించుకుని బుధవారం ఉదయం భారత్ తిరిగివచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఉదయంనుంచి కశ్మీర్‌లో పరిస్థితిపైన ఎడతెరిపి లేకుండా కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 5 సంచలన నిర్ణయాలు తీసుకొంది. సార్క్ ఒడంబడికలో భాగంగా సభ్యదేశమైన పాకిస్థాన్ పౌరులకు జారీచేసిన వీసాలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు, ఈ వీసాలున్న పాకిస్థాన్ పౌరులు 48గంటల్లోగా భారత్‌ను వదిలి వెళ్లాలని, ఆ దేశ పౌరులను దేశంలోకి అనుమతించేది లేదని విదేశాంగ శాఖ ప్రకటించింది.
కాగా ఇప్పటికే సరిహద్దు దాటిన పాక్ పౌరులు మే 1లోగా తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ వాఘా వద్ద ఇరుదేశాల సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టునుసైతం తక్షణం మూసి వేయాలని నిర్ణయించింది. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతును నిలిపివేసే దాకా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపి వేయాలని కూడా సమావేశం నిర్ణయించింది. 1960లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సింధు నదితో పాటుగా దాని ఉపనదుల ద్వారా పాక్‌లోని లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు పలు ప్రాంతాలకు తాగు నీరు లభిస్తుంది. మన దేశంలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఉన్న రక్షణ లేదా, మిలిటరీ సలహాదారులను వెనక్కి పంపించి వేయాలని నిర్ణయించింది. అలాగే పాక్‌లోని మన దౌత్యకార్యాలయంలో ఉన్న ఈ సలహాదారులను కూడా వెనక్కి పిలిపిస్తారు. మే 1నుంచి మొత్తంమీద ఇరు దేశాల హైకమిషన్ కార్యాలయాల్లో సిబ్బందిని ఇప్పుడున్న 55నుంచి 30 కి కుదించాలని నిర్ణయించారు.క్యాబినెట్ కమిటీలో చర్చించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేఖరులకు వెల్లడించారు.
పహల్‌గామ్ ఉగ్రదాడిలో పాక్ హస్తం ఉందని ఆయన స్పష్టం చేశారు. క్యాబినెట్ కమిటీ మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించిందని,్తంత అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించిందని ఆయన తెలిపారు.పహల్‌గామ్ దాడికి పాల్పడిన వారిని చట్ట ముందు నిలబెట్టి తీరుతామని, వారిని దాడికి ప్రోత్సహించిన బాధ్యులుగా నిలబెట్టి తీరుతామని సమావేశం తీర్మానించినట్లు మిస్రీ తెలిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.