గుజరాత్ తీర ప్రాంతానికి సమీపంలో భారతీయ తీర ప్రాంత దళాలు సర్వం సమాయాత్తం అయ్యాయి. ముఖ్యంగా ఫార్వర్డ్ ఏరియాలలో నిఘా పెంచారు. కోస్ట్ గార్డు బలగాలు ఇప్పుడు నౌకాదళంతో పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. పర్యవేక్షక బాధ్యతలను పెంచారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల తీరుతెన్నులను రక్షణ శాఖ వర్గాలు అత్యంత జాగరూకతతో వెల్లడించాయి. అయితే ఇదంతా కూడా యుద్ధ సంకేతం అని స్పష్టం అవుతోంది. ఇటీవలే ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి మధ్యస్థ దూర ఛేదక ఎంఆర్ సామ్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఇది ఉపరితలం నుంచి గగనతలంలోని శత్రు టార్గెట్‌ను దెబ్బతీస్తుంది.
ఇక పాకిస్థాన్ సైనిక దళాలు ప్రత్యేకించి నౌకా వైమానిక బలగాలు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాలను ఎంచుకుని సైనిక విన్యాసాలను ఉధృతం చేశాయని భారతీయ నిఘా వర్గాలకు సమాచారం అందింది. కరాచీ కేంద్రీకృతంగా ఎక్కువగా ఈ డ్రిల్స్ నిర్వహించారు. సమీపంలోని భారతీయ స్థావరాలను ఎంచుకుని ఏ స్థాయిలో ఎటువంటి దాడులకు వీలుంటుందనే విషయంపై ఉన్నత స్థాయిలో బేరీజు వేసుకుంటున్నారని వెల్లడైంది.దీనికి సంబంధించి పూర్తి సమాచారం వెల్లడికాలేదు. అయితే పాక్ సైన్యం కదలికలను భారత ఇంటలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నాయి. ఇందుకు తగు విధంగా తీర ప్రాంతాల్లో నిఘా సమాచారం తీవ్రతరం అయింది.