ఐర్లాండ్లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి జరిగింది. ఇక్కడి వాటర్ఫోర్డ్లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా బాలలు కొందరు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్ వీడి, ఇండియాకు వెళ్లు అంటూ ఈ పాప మర్మాయవ ప్రాంతంలో సైకిళ్లతో బలంగా మోదారు. ఐర్లాండ్లో భారతీయ సంతతి పసివారిపై ఇటువంటి జాత్యాహంకార దాడి కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు పలుచోట్ల భారతీయులపై అనేక రకాల దాడులు జరిగాయి. తన స్నేహితులతో కలిసి ఇంటి ముందే ఆడుకుంటూ ఉండగా పాపపై అక్కడి బాలలు సోమవారం సాయంత్రం పైశాచికానికి దిగారు.
తమ పాపపై దాడికి దిగిన వారిలో ఓ బాలిక, పలువురు అబ్బాయిలు ఉన్నారని తల్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో తన పదినెలల కొడుకుకు ఆహారం పెడుతూ ఉండగా , బయట ఉన్న తన కూతురిపై దాడి జరిగిందని, ఆమె కేకలు, ఏడుపుతో విషయం తెలిసిందని వివరించారు. ఆమె ముఖంపై కూడా కొట్టారని బాధతో విలవిలలాడుతూ ఇంటికి వచ్చిందని చెప్పారు. తన జుట్టుపట్టి లాగారని, వెనుక నుంచి కింది భాగంలోకి సైకిల్ తోశారని బాలిక తెలిపింది. రెండు రోజులుగా బాలిక భయంతో వణికిపోతోంది. ఎక్కువగా మాట్లాడలేకపోతోంది. ఇల్లు గుమ్మం దాటి వెళ్లలేకపోతోందని తల్లి వాపోయింది.