Thursday, May 2, 2024

హైదరాబాద్‌కు మహర్దశ

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు మరిన్ని వచ్చే అవకాశం
అంతర్జాతీయ గుర్తింపునకు అవకాశాలు
సిజెఐ ప్రతిపాదనకు సిఎం సానుకూలం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ చేసిన ప్రకటన భవిష్యత్తులో తెలంగాణకు మరింత మహర్దశ పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. లండన్, హాంగ్‌కాంగ్, సింగపూర్ తరహాలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ ధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం తన జీవిత కాలపు కల అని తన పదవీ కాలం పూర్తి అయ్యేలోపు దీన్ని సాకారం చేస్తానని రమణ చేసిన ప్రకటన హైదరాబాద్‌కు మరింతగా అంతర్జాతీయ ప్రాధాన్యం లభించే అవకాశం ఏర్పడింది.

సిజె రమణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా ఉన్నారని, ఈ ప్రయత్నాలు మరి కొద్ది రోజుల్లో మరింతగా విస్తృతమవుతాయని రమణ విలేకరులతో వెల్లడించడంతో ఇప్పటి దాకా హైదరాబాద్ అంటే విముఖంగా ఉన్న కంపెనీలు మరిన్ని తమ కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేసే అవకాశాలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటి దాకా కార్పొరేట్ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడి కంపెనీలు సింగపూర్‌కు వెళుతున్నాయి. అక్కడ మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించు కోవడం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. అక్కడ హోటళ్ల బసతో పాటు ఇతర ఖర్చులు కూడా భరించలేని విధంగా ఉండడంతో అంతకన్నా సానుకూలంగా ఉన్న ప్రాంతాల్లో కార్పొరేట్ కంపెనీలు పెట్టడానికి పెట్టుబడిదార్లు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్‌లో సానుకూల వాతావరణం, విమానాల అనుసంధానం, కార్పొరేట్లకు కావలసిన వసతులతో తక్కువ ధరతో అతిథ్యపు హోటళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అంతకు మించి ఐటి పారిశ్రామిక ఫార్మా కంపెనీలు కూడా వేలాదిగా వస్తు న్నాయి. హైదరాబాద్ నలు దిక్కులా వంద కిలో మీటర్ల వరకు విస్తరిస్తున్నది. భూమి లభ్యతతో పాటు ప్రభుత్వం కూడా సానుకూల పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడంతో పలు కంపెనీలు ఇక్కడికి రావడానికి అసక్తి చూపుతున్నాయి.

అయితే వివాదాలు పరిష్కరించుకునే కేంద్రం సింగపూర్‌లో ఉండడం కొన్ని కంపెనీలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇవి గమనించే తాను సింగపూర్ న్యాయమూర్తితో సంప్రదించి హైదరాబాద్‌కు ఈ కేంద్రం తేవడానికి ప్రయత్నిస్తున్నానని దీనికి అన్ని రకాలుగా సహకరిస్తానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారని రమణ తనను కలిసిన విలేకరులతో తెలియజేశారు.నిజానికి కోర్టు లిటిజేషన్‌కు ఆర్బిట్రేషన్ భిన్నంగా ఉంటుంది. ఆర్బిట్రేషన్‌లో ప్రైవేటుగా రెండు పక్షాల మధ్య వాదనలు, ప్రతివాదనలు కొనసాగుతాయి. కోర్టుల మాదిరిగా ఏళ్లకు ఏళ్లు వివాదాలు సాగవు. దేశంలోని 2016 నాటి ఆర్బిట్రేషన్ చట్టం ప్రకారం మధ్యవర్తిత్వ కేంద్రం ఎలాంటి వివాదాన్నైనా 18 నెలల్లోపు పరిష్కరించాలి. ఇలాంటి అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటైతే ప్రపంచ వ్యాప్తంగా మరింతగా గుర్తింపు వస్తుంది. కంపెనీలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది.

ఇప్పటి దాకా లండన్, హాంగ్‌కాంగ్, సింగపూర్‌లలో మాత్రమే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాలున్నాయి. లండన్‌కు ఢిల్లీలో, సింగపూర్‌కు ముంబైలో లైజన్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. అయితే వీటి ద్వారా కార్పొరేట్లు ఆశించిన రీతిలో వివాదాలు పరిష్కారం కావడం లేదు. హైదరాబాద్‌లోనే ఈ కేంద్రం ఉంటే ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు అనేకం ఇక్కడ ఉన్న అనేక సానుకూలతలతో ఇక్కడికే వచ్చే అవకాశాలు భవిష్యత్తులో పెరుగుతాయి. ఇదే జరిగితే హైదరాబాద్ అభివృద్ధి ఆకాశమే హద్దుగా మరింత ముందుకు వెళుతుంది.

International Arbitration Center in Hyderabad?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News