సంజ్ఞ లేదా సంకేత భాష చెవిటి వారికి చదువు నేర్చుకోవడానికి, సమాచార వితరణకు, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి, మన ప్రత్యేకతను చాటు కోవడానికి, సమ్మిళిత అభివృద్ధికి మహా వరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 వరకు సంజ్ఞ భాషలు లేదా సైన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సంజ్ఞ భాషలకు ప్రత్యేక పదకోశం, విలక్షణ వ్యాకరణం ఉంటాయి. సంజ్ఞ భాషలకు ప్రధాన ఉదాహరణలుగా భారతీయ, అమెరికన్, బ్రిటీష్ సంకేత భాషలు వస్తాయి. సంజ్ఞ భాష వ్యక్తీకరణ కు ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్లు ప్రధానమైనవిగా గుర్తించబడ్డాయి. సంజ్ఞ భాషను నేర్చుకోవడం ద్వారా వినికిడి లోపం కలిగిన అభాగ్య దివ్యాంగుల సమస్యలు అర్థం చేసుకోవడంతో పాటు వారి పట్ల సహానుభూతి పెరుగుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 72 మిలియన్ల చెవిటి దివ్యాంగులు ఉన్నారు. సహజ సిద్ధమైన సంజ్ఞ భాషల పట్ల సాధారణ ప్రజల్లో అవగాహన చాలా తక్కువగా కనిపిస్తుంది. చెవిటి వారు ప్రజలతో మమేకం కావడం, ప్రయాణాలు చేయడం, విద్యాభ్యాసం, కమ్యూనికేషన్ చేయడం, సమావేశాలకు హాజరు కావడం లాంటి సందర్భాలకు సంకేత భాష ప్రయోగించబడుతుంది. చెవిటి తనకంతో బాధ పడుతున్న ప్రజలు ప్రజలతో మమేకం కావడానికి సంజ్ఞ భాష ఓ అద్భుత వరంగా మారింది. సంజ్ఞ భాష ప్రాధాన్యం గుర్తించిన ఐరాస 2017లో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏట 23 సెప్టెంబర్ రోజున అంతర్జాతీయ సంజ్ఞ భాష దినం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్)ను పాటించడం జరుగుతున్నది.
Also Read : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
చెవిటి వ్యక్తులు, ముఖ్యంగా వినికిడిలోపం కలిగిన యువతకు సంజ్ఞ భాష ప్రాధాన్యం వివరిస్తూ, వారికి ఈ భాషను నేర్పడం విధిగా జరగాలి. స్థానిక స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు చెవిటి ప్రజల సమస్యలను చర్చిస్తున్న వేదికల సమన్వయంతో సంజ్ఞ భాషను ఉపయోగించడం, అభివృద్ధి చేయడం, ప్రచారం చేయడం కొనసాగుతున్నది. వినికిడిలోపం కలిగిన ప్రజలను సాధారణ జనజీవన స్రవంతిలో కలిసి పోవడానికి సంజ్ఞ భాష ఉపకరిస్తున్నది. అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినం-2025 ఇతివృత్తంగా ప్రజలకు ఐక్యం చేస్తున్న సంజ్ఞ భాష(సైన్ లాంగ్వేజ్ యునైట్స్ అజ్) అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహి స్తున్నా రు. ఈ దినోత్సవ వేదికల్లో అవగాహన కలిపించడం, చెవిటి నిపుణుల ప్రసంగాలు ఏర్పాటు చేయడం, సంజ్ఞ భాష గూర్చి తెలుసుకోవడం, సైన్ లాంగ్వేజ్ క్లబ్బులు ఏర్పాటు చేయడం లాంటివి నిర్వహిస్తారు.
సాధారణ పౌర సమాజంతో చెవిటి వారిని అనుసంధానించడానికి సంజ్ఞ భాషలు చక్కగా ఉపయోగపడుతున్నాయి. మాటల్లో చెప్పలేని అద్భుత భావాలను సంజ్ఞలతో వ్యక్తం చేయడం ఓ అపురూప సందర్భం. సంజ్ఞ భాష ఒక కమ్యూనికేషన్ సాధనమే కాదు, అది రెండు హృదయాల కలయిక అవి తెలుసుకోవాలి. అందరితో సమానం గా విద్యను అభ్యసించడానికి సంజ్ఞ భాష దోహదపడుతున్నది. వినికిడా లోప దివ్యాంగుల మానవ హక్కుల పరిరక్షణలో సంజ్ఞ భాషలు సదా ఉపయోగపడుతున్నాయి. అన్ని అవయవాలు చక్కగా ఉన్న సంజ్ఞ భాషలోని మౌళిక అంశాలను చేర్చుతొని, ఆ వర్గం ప్రజలతో సరదాగా మాట్లాడుదాం, మేం ఉన్నామన్న ధైర్యాన్ని అందిద్దాం.
- డాక్టర్. బుర్ర మధుసూదన్ రెడ్డి, 99497 00037
- 23 సెప్టెంబర్ అంతర్జాతీయ సంజ్ఞ లేదా సంకేత భాషల దినోత్సవం సందర్భంగా