Saturday, July 27, 2024

నేడు ఎలిమినేటర్ పోరు.. గెలిచి నిలిచేదెవరో?

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్17 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశ ముగిసింది. అంతేగాక సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్1 పోరు కూడా జరిగిపోయింది. ఇక బుధవారం అహ్మదాబాద్ వేదికగా ఎలిమినేటర్ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇందులో గెలిచే టీమ్ క్వాలిఫయర్2 అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది. లీగ్ దశ చివర్లో రాజస్థాన్ వరుస పరాజయాలను చవిచూసింది.

వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో పరాజయం చవిచూసింది. మరోవైపు బెంగళూరు చివరి దశలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఏకంగా ఆరు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించి నాకౌట్ రేసుకు చేరుకుంది. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రాజస్థాన్ వరుస ఓటములతో సతమతమవుతుండగా బెంగళూరు చివరగా ఆడిన ఆరు మ్యాచుల్లో గెలిచి ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సవాల్ వంటిదే..
ఇక బెంగళూరుతో జరిగే ఎలిమినేటర్ పోరు రాజస్థాన్‌కు సవాల్ వంటిదేనని చెప్పాలి. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడడంతో రాజస్థాన్ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఇలాంటి స్థితిలో బెంగళూరుతో జరిగే పోరు జట్టుకు చావోరేవోగా మారింది. అసాధారణ రీతిలో చెలరేగి పోతున్న ఛాలెంజర్స్‌ను ఓడించాలంటే రాజస్థాన్ సర్వం ఒడ్డి పోరాడక తప్పదు. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా ఆడిన జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్ తదితరులు చివరి దశ పోటీల్లో నిరాశ పరిచారు. కీలక ఆటగాళ్ల వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది.

బెంగళూరు వంటి బలమైన జట్టును ఓడించాలంటే రాజస్థాన్ తన ఆట తీరును గణనీయంగా మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కీలక ఆటగాళ్లు తమ బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న బట్లర్, శాంసన్, యశస్వి, హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, జురెల్, పొవెల్ తదితరులు తమ తమ బ్యాట్లకు పని చెప్పక తప్పదు. బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

జోరుమీదుంది..
మరోవైపు బెంగళూరు వరుస విజయాలతో జోరుమీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్ రేసులో నిలువాలని తహతహలాడుతోంది. వరుసగా ఆరు మ్యాచుల్లో గెలవడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లోనూ బెంగళూరుకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి, కెప్టెన్ డుప్లెసిస్, రజత్ పటిదార్, దినేశ్ కార్తీక్, గ్రీన్ తదితరులు ఫామ్‌లో ఉండడం బెంగళూరుకు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. బౌలింగ్ కూడా బెంగళూరు సమష్టిగా రాణిస్తోంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న బెంగళూరు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News