Thursday, May 2, 2024

ఆప్తులకోసం అలుపెరగని వెతుకులాట..

- Advertisement -
- Advertisement -

గాజా: ఇజ్రాయెల్ బలగాల బాంబుల వర్షానికి గాజా నగరం శిథిలాల గుట్టగా మారిపోతోంది. ప్రతి రోజూ వందలాది మంది శిథిలాల కింద కేరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మృతదేహాలను వెలికి తీసే నాథుడు కూడా కరువవడంతో ఎక్కడ చూసినా దుర్గంధమే తాండవిస్తోంది. బరించలేని దుర్వాసన మధ్యే వందలాది మంది పారలు, పలుగులతో తమ వారికోసం శిథిలాల గుట్ల మధ్య వెతుకుతున్నారు. కొందరయితే వట్టి చేతులతోనే విఫల పోరాటం సాగిస్తున్నారు. తమ కన్న బిడ్డల కోసం వెతికే వారు కొందరయితే, కన్నవారి కోసం వెతికే వాళ్లు మరి కొందరు. తమ ఇరుగుపొరుగువారి కోసం వెతికే వాళ్లు కూడా వీరిలో ఉన్నారు. వీరంతా కూడా ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో చనిపోయిన వారే. వందల ఎకరాల విస్తీర్ణంలో చోటు చేసుకున్న విధంసానికి సాక్షీభూతంగా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయి ఉన్నాయి. గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులు మొదలై అయిదు వారాలకు పైగా అయింది. ఈ దాడులతో గాజా నగరంలోని కొన్ని వీధులయితే మరు భూములుగా మారిపోయాయి. బతికున్న వారి కోసం వెతికేందుకు తమ వద్ద సరయిన పరికరాలు కానీ, మనుషులు కానీ, ఇంధనం కానీ లేవని అధికారులు అంటున్నారు.

అందుకే శిథిలాల కింద ఉన్న వారు అలాగే ప్రాణాలు వదిలేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారు. గాజా సిటీ, శివారు ప్రాంతాల్లో జనావాసాల మధ్య హమాస్‌కు చాలా బేస్‌లు ఉన్నాయి. అలాంటి వాటినే లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుదాడులు చేస్తుండడంతో సామాన్యులు సైతం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. చనిపోయిన వారిలో చాలా మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదు. ఉదాహరణకు ఇజ్రాయెల్ దాడులు మొదలైన తొలినాళ్లలో కూలిపోయిన రెండు నాలుగంతస్థుల భవనాల్లో జాడ తెలియకుండా పోయిన వారి కోసం ఒమర్ అల్ దరావి, అతని ఇరుగుపొరుగు వాళ్లు ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు. ఈ రెండు భవనాల్లో నలభై అయిదు మంది నివసిస్తుండగా వాళ్లలో 32 మంది చనిపోయారు. 27మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించగా, ఇంకా అయిదుగురి జాడ ఇప్పటివరకు తెలియరాలేదు. వారి కోసం ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నారు. రోజురోజుకు పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, దుర్వాసన భరించలేనంతగా ఉంటోదని ఒకప్పుడు జర్నలిజం విద్యార్థి అయిన 23 ఏళ్ల దరావి అంటున్నాడు. అయినా చేయగలిగింది ఏమీ లేదని, మృతదేహాలు శిథిలాల కింద మట్టిలో కలిసి పోవడానికి ముందే తమ వాళ్లను గుర్తించి ఖననం చేయాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని అతను గద్గద స్వరంతో చెప్పాడు.

ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 11,200 మందికి పైగా చనిపోయారని, వారిలో మూడింట రెండువంతుల మంది పిల్లలు, మహిళలేనని గాజాలోని ఆరోగ్య శాఖ అంటోంది. ఐక్యరాజ్య సమితి మానవతా వ్యవహారాల కార్యాలయం అంచనా ప్రకారం 2,700 మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదు. వీరిలో 1500 మందికి పైగా పిల్లలున్నారు. వీరంతా శిథిలాలగుట్టల కిందే శవాలుగా మిగిలి పోయి ఉంటారని భావిస్తున్నారు. ఇవిగాక తెగిపోయిన శరీర భాగాలు, గుర్తించడానికి వీల్లేకుండా తయారయిన మృతదేహాలు .. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News