Tuesday, October 15, 2024

బుమ్రాకు అగ్రస్థానం

- Advertisement -
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన ఐసిసి టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్‌కే చెందిన రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బుమ్రా అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో బుమ్రా 11 వికెట్లను పడగొట్టాడు. అశ్విన్ కూడా 11 వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇది బుమ్రాకు కలిసి వచ్చింది. తాజా ర్యాంకింగ్స్‌లో బుమ్రా 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

మరోవైపు అశ్విన్ 869 పాయింట్లతో రెండో ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలా కాలంగా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కానీ ఈసారి టాప్ ర్యాంక్‌ను సహచరుడు బుమ్రాకు సమర్పించుకోక తప్పలేదు. భారత్‌కు చెందిన మరో సటార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. బంగ్లా సిరీస్‌లో జడేజా కూడా బాగానే బౌలింగ్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్లు జోష్ హాజిల్‌వుడ్ మూడో, పాట్ కమిన్స్ నాలుగో ర్యాంక్‌లో నిలిచారు. సౌతాఫ్రికా స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ఐదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

మూడో ర్యాంక్‌కు యశస్వి..
బంగ్లాదేశ్ సిరీస్‌లో మెరుగైన బ్యాటింగ్‌తో అదరగొట్టిన భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇప్పటి వరకు ఐదో ర్యాంక్‌లో ఉన్న యశస్వి రెండు స్ఠానాలను మెరుగు పరుచుకుని టాప్3లో చోటు సంపాదించాడు. బంగ్లాతో జరిగిన రెండు టెస్టుల్లో కూడా యశస్వి అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. కాన్పూర్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. దీంతో అతని ర్యాంకింగ్ మెరుగుపడింది. మరోవైపు టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి మళ్లీ టాప్10 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. బంగ్లాతో జరిగిన రెండో టెస్టులో కోహ్లి మెరుగ్గా రాణించాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్స్‌పై పడింది.

కిందటి ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో నిలిచిన కోహ్లి ఈసారి ఏకంగా ఆరు స్థానాలు మెరుగు పరుచుకుని ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ర్యాంక్‌లు కోల్పోయి 9వ స్థానానికి పడిపోయాడు. ఇదిలావుంటే బంగ్లా సిరీస్‌లో ఘోరంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా ఐదు స్థానాలు దిగజారాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ 15వ స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు. కాగా, ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 899 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) 829 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖాజా (ఆస్ట్రేలియా) నాలుగు, ఐదు ర్యాంకింగ్స్‌లో నిలిచారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. టీమిండియా రెండో ర్యాంక్‌ను కాపాడుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News