Thursday, May 2, 2024

జూలై 3న జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

JEE Advanced 2021 Exam On July 3

ఈసారి కూడా 2.50 లక్షల మందికే అనుమతి
నాలుగు విడతల జెఇఇ మెయిన్ తర్వాత
అడ్వాన్స్‌డ్‌కు టాప్ 2.50 లక్షల మంది ఎంపిక
ఒకటి రెండు రోజుల్లో తొలి జెఇఇ మెయిన్ ఫలితాలు..?

హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఇఇ) అడ్వాన్స్‌డ్- 2021 పరీక్షను జూలై 3న నిర్వహించనున్నారు. జూలై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్- 2 పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలతో ఐఐటి ఖరగ్‌పూర్ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంది. జెఇఇ మెయిన్‌ను ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఆన్‌లైన్ లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి సెషన్‌కు సంబంధించి ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. నాలుగు విడతల పరీక్షలు ముగిశాక నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల్లో టాప్ 2.50 లక్షల మందిని జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష అనంతరం ఐఐటీల్లో ఆర్కిటెక్చర్ కోర్సులకు.. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎఎటి)ని నిర్వహిస్తారు. ఈ పరీక్ష తేదీలు ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఫలితాలు కూడా విడుదలయ్యాక ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ చేపడుతుంది.

జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు పెరగని విద్యార్థుల సంఖ్య

జెఇఇ అడ్వాన్స్‌డ్ రాసే విద్యార్థుల సంఖ్య ఈసారి పెరుగుతుందని అందరూ భావించినప్పటికీ, గత ఏడాది ఉన్న సంఖ్యనే ఖరారు చేశారు. జెఇఇ అడ్వాన్స్‌డ్ సంఖ్యను కొన్నేళ్లుగా పెంచుతూ వస్తున్నారు. 2018లో 2.30 లక్షలు, 2019లో 2.45 లక్షలు, 2020లో 2.50 లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా గత ఏడాది ఉన్న విద్యార్థుల సంఖ్యనే ఐఐటి ఖరగ్‌పూర్ ఖరారు చేసింది. ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కొవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాది కూడా సడలించారు. సాధారణంగా జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు గాను అభ్యర్థులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75శాతం మార్కులు లేదా క్వాలిఫైయింగ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది.

అర్హత సాధించినా పరీక్షకు రాసేందుకు వెనుకడుగు

దేశంలో ఐఐటిల్లో ప్రవేశానికి నిర్వహించే జెఇఇ అడ్వాన్స్‌డ్ రాయడానికి సాధించినా పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరచడం లేదు.జెఇఇ అడ్వాన్స్‌డ్ అర్హత సాధించిన వారిలో సుమారు 25 శాతం దరఖాస్తు చేసుకోవడం లేదు.గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గత ఏడాది 2.50 లక్షల మందికి అవకాశం ఇచ్చినా పరీక్ష రాసేందుకు 1,60,838 మందే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 2018లో జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు 2.31 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించగా, అందులో 1.65 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు.

అలాగే 2017లో 2.21 లక్షల మంది జెఇఇ అడ్వాన్స్‌డ్ అర్హత సాధించగా, 1.72 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2016లో 1.98 లక్షల మంది అర్హత సాధించగా, 1.56 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జెఇఇ మెయిన్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచినా అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తున్నవారిలో సరా సరిన 70 నుంచి 75 శాతం మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేస్తున్నారు. జెఇఇ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన వారిలో సుమారు 25 నుంచి -30 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దరఖాస్తు చేసిన వారిలోనూ ఆయా కేటగిరీల్లో 50 శాతం మందే సీరియస్‌గా సన్నద్ధం అవుతారని నిపుణులు పేర్కొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 40 వేల మంది అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News