Friday, August 8, 2025

న్యాయవ్యవస్థపై హిందూత్వ నీడలు

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభం లాంటి భారత న్యాయవ్యవస్థపై మోడీ ప్రభుత్వ హిందూ జాతీయవాద భావజాలం ప్రభావం పెరుగుతున్న తీరు చర్చనీయాంశమైంది. ఇటీవల తలెత్తిన వివాదాలు ముఖ్యంగా జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ప్రవర్తన, గాజా వంటి ప్రపంచ మానవతా సమస్యలపై న్యాయవ్యవస్థ ప్రతిస్పందన, అవినీతి ఆరోపణలు, ఇతర వివాదాలు న్యాయవ్యవస్థ తటస్థత, లౌకికవాదం, నిష్పాక్షికతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ పరిణామాలు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం తగ్గిపోవడాన్ని సూచిస్తున్నాయి. తక్షణం ఆత్మపరిశీలన, సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. న్యాయవ్యవస్థ నిష్పాక్షికత, సైద్ధాంతిక క్రియాశీలత మధ్య హద్దులను చెరిపేసే తన చర్యలు మద్రాస్ హైకోర్టు జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్ వివాదానికి దారితీసింది. 2025 జులై 24న జస్టిస్ కె. రాజశేఖర్‌తోపాటు తాను అధ్యక్షత వహించిన సభలో స్వామినాథన్ న్యాయవాది ఎస్. వాంచినాథన్‌ను పిరికివాడు, కామెడీ పీస్ అంటూ అభివర్ణించారు.

అంతకుముందు స్వామినాథన్ న్యాయపరమైన ప్రవర్తనలో కులతత్వం, మతపరమైన పక్షపాతం ఉందని ఆరోపిస్తూ 2025 జూన్ 14న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వాంచినాథన్ 14 పేజీల లేఖ రాసిన నేపథ్యంలో ఈ ఆగ్రహం వ్యక్తం అయింది. వాంచినాథన్ ఆ లేఖలో (Vanchinathan letter) బిజెపి రాజకీయ నాయకుడు హెచ్. రాజా, మితవాద వ్యాఖ్యాత రంగరాజ్ పాండేలతో కలిసి ఒక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో స్వామినాథన్ పాల్గొన్నారని, తమిళనాడు ద్రవిడ పాలన మూలాలను ఆయన ఎగతాళి చేశారని పేర్కొన్నారు. లావణ్య ఆత్మహత్య కేసును ఆయన విచారించడం, మత మార్పిడి కోణాన్ని నొక్కి చెప్పడం, దానిని సిబిఐకి బదిలీ చేయడాన్ని కూడా ఆ లేఖలో వాంచినాథన్ విమర్శించారు. సిజెఐ అంతర్గత విచారణ లేకుండానే వాంచినాథన్‌పై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించాలన్న బెంచ్ చర్యను 8 మంది రిటైర్డ్ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు విమర్శించారు. వారు సి. రవిచంద్రన్ అయ్యర్ వర్సెస్ జస్టిస్ ఎఎం భట్టాచార్జీ (1995) కేసులో సుప్రీంకోర్టు తీర్పు, పూర్వాపరాలను అకాల చర్యగా పేర్కొన్నారు.

2025 జులైలో జరిగిన వార్షిక వేద పండితుల ప్రతిభా కార్యక్రమంలో స్వామినాథన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళలను రేకెత్తించాయి. స్వామినాథన్ తన ప్రసంగంలో గత చట్టపరమైన ఫలితాన్ని సమర్థించడానికి వేదాలను ప్రయోగించాలని, దానికి దైవికపరమైన రక్షణగా రూపొందించాలని సూచించారు. తిలకం వంటి మతపరమైన చిహ్నాలను ఆయన బహిరంగంగా ప్రదర్శించడంతో ఆయన న్యాయమూర్తా లేక మతాధికారిగా వ్యవహరిస్తున్నారా అని ప్రశ్నించేలా చేసింది. స్వామినాథన్ వివాదం భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రోత్సహిస్తున్న హిందూత్వ భావజాలంతో న్యాయవ్యవస్థ చిక్కుకునే ధోరణలను ప్రతిబింబిస్తోంది. మరో స్పష్టమైన ఉదాహరణ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ 2024 డిసెంబర్‌లో విశ్వహిందూ పరిషత్ సమావేశంలో పాల్గొనడం, తన ప్రసంగంలో ముస్లింల గురించిన అవమానకరమైన వ్యాఖ్యలు, మెజారిటీ పాలనకు ఆమోదం వంటివి ఉన్నాయి.

ఈ దేశం మెజారిటీ ప్రజల ఇష్టానుసారం నడుస్తుందని ఆయన చేసిన వాదన, అభిశంసన తీర్మానానికి సుప్రీం కోర్టు అంతర్గత విచారణ జరిపించేందుకు ప్రేరణ కలిగిస్తోంది. అదే విధంగా, గాజా నిరసనలకు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు “మీ స్వంత దేశాన్ని చూడండి’ అనే వ్యాఖ్యతో కొట్టివేసింది, అంతర్జాతీయ నివేదికలు, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను నమోదు చేసిన చర్యలు. గాజాలో ప్రపంచ మానవతా సంక్షోభాన్ని పక్కకు పెట్టేశాయి. ఈ జాతీయవాద వైఖరి అంతర్జాతీయ మానవ హక్కుల సమస్యలపై మోడీ ప్రభుత్వ అయిష్టతను ప్రతిబింబిస్తుంది, రాజకీయ ప్రాధాన్యతలతో న్యాయవ్యవస్థ అనుబంధంపై ఆందోళనలను లేవనెత్తుతున్నది. 2024 ది కారవాన్ నివేదిక ప్రకారం, 33 మంది సిట్టింగ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో 9 మంది ఆర్‌ఎస్‌ఎస్- అనుబంధ న్యాయవాదుల సంస్థకు సంబంధించినట్లు వెల్లడికావడం ముఖ్యాంశాలుగా నిలిచాయి.

ఇది రైట్ -వింగ్ గ్రూపులతో న్యాయవ్యవస్థకు పెరుగుతున్న సంబంధాలను నొక్కి చెబుతోంది. భారత రాజ్యాంగం లౌకికవాదం, సమానత్వాన్ని నిర్దేశిస్తున్నది, న్యాయమూర్తులు నిష్పాక్షికంగా, మతపరమైన లేదా రాజకీయ ప్రభావం నుండి విముక్తి పొందాలని కోరుతుంది. అయితే, స్వామినాథన్ తిలకం ధరించడం, మతపరమైన గుర్తింపును బహిరంగంగా ప్రదర్శించడం, సైద్ధాంతిక వ్యాఖ్యలు, పక్షపాతాన్ని సూచించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మైనారిటీలు మతాంతర వివాదాలకు సంబంధించిన కేసుల్లో ఈ ప్రమాదం లేకపోలేదు. గాజా వంటి అంతర్జాతీయ సమస్యలపై న్యాయవ్యవస్థ తిరస్కరణ భావన, సార్వత్రిక మానవ హక్కుల కంటే జాతీయవాద భావాలకు ప్రాధాన్యత ఇస్తున్నది. ఇది న్యాయం పట్ల భారతదేశ రాజ్యాంగ నిబద్ధతను దెబ్బతీస్తున్నది. రాజకీయపరమైన ఒత్తిడులు, అవినీతి సైద్ధాంతిక ఆందోళనలకు అతీతంగా న్యాయవ్యవస్థ రాజకీయ ఒత్తిడి, అవినీతికి లొంగిపోతున్నదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నది.

కొలీజియం వ్యవస్థలో జాప్యం, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సంబంధాలు ఉన్న న్యాయమూర్తుల పట్ల పక్షపాతం చూపడం ద్వారా న్యాయ నియామకాలపై మోడీ ప్రభుత్వం ప్రభావంతో రాజకీయపరమైన న్యాయవ్యవస్థగా మారుతోందనే భావాలను రేకెత్తిస్తున్నది. అదనంగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద ఎత్తున నగదు దొరికిన ఘటన, అంతర్గత విచారణ జరిగిన విషయం జస్టిస్ వర్మ దుష్ప్రవర్తనను హైలైట్ చేస్తోంది. ఇలాంటి సంఘటనలు న్యాయ వ్యవస్థ సమగ్రతపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా తన పాత్ర సక్రమంగా నిర్వహించేందుకు తిరిగి నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు న్యాయవ్యవస్థ ఈ సవాళ్లను పరిష్కరించాలి.

శివకుమార్ యాదవ్, వర్మ కేసులో చూపించినట్లు పారదర్శకంగా అంతర్గత విచారణలు తప్పనిసరి. స్పష్టమైన మార్గదర్శకాలు జారీకావాలి, రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో న్యాయమూర్తుల భాగస్వామ్యాన్ని పరిమితం చేయాలి. న్యాయమూర్తులు సైద్ధాంతిక, మతపరమైన అనుబంధాన్ని బహిరంగంగా ప్రదర్శించకుండా చూడాలి. రాజ్యాంగ విలువలపై శిక్షణ పెంచడంతోపాటు తటస్థత వైఖరులను బలోపేతం చేయాలి. కొలీజియం వ్యవస్థలో సంస్కరణలు రాజకీయ ప్రభావం లేకుండా మెరిట్ ఆధారిత నియామకాలను నిర్ధారించగలవు. ప్రపంచ మానవ హక్కులలో పాలుపంచుకోవాలి. ప్రపంచ న్యాయాన్ని నిలబెట్టడానికి గాజా వంటి సంక్షోభాలపై స్పందించడం, పరిష్కరించడం ద్వారా న్యాయవ్యవస్థ భారతదేశానికి సంబంధించిన అంతర్జాతీయ బాధ్యతలను పంచుకోవాలి.

ఆర్థికపరమైన నేరాల పరిశోధించేందుకు, శిక్షించేందుకు బలమైన చర్యలు చేపట్టడం చాలా కీలకం. జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్‌కు సంబంధించిన వివాదాలు, గాజాపై న్యాయవ్యవస్థ ప్రతిస్పందన అవినీతి ఆరోపణలు భారత న్యాయవ్యవస్థలో తీవ్రమైన సంక్షోభాన్ని ప్రతిబింబిస్తాయి. హిందూత్వ భావజాలం, రాజకీయ ఒత్తిడి, ఆర్థిక దుష్ప్రవర్తన ప్రభావం న్యాయవ్యవస్థ తటస్థత, లౌకికవాదానికి సంబంధించి ముప్పుగా పరిణమించగలవు. న్యాయమూర్తులు మనుషులే. నిష్పాక్షిక న్యాయాన్ని నిర్ధారించుకోవడానికి, బాహ్య ప్రభావాలనుంచి తమను తమను రక్షించుకోవాలి. ఆత్మపరిశీలన, సంస్కణలు, రాజ్యాంగ విలువల పునరుద్ధరణ పట్ల నిబద్ధత ద్వారా భారత న్యాయవ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం పునరుద్ధరింపబడగలదు. భారతదేశం వైవిధ్యభరితమైన, ప్రజాస్వామ్యాన్ని నిర్వచించే సూత్రాలను నిలబెట్టగలదు.

  • గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
  • రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News