Tuesday, September 23, 2025

జూరాల 45 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో అదే స్థాయిలో వరద నీటిని దిగువన ఉన్న జూరాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జూరాల క్రస్ట్ గేట్లను పెంచుతూ వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ప్రాజెక్టు దిగువన ఉన్న జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. మంగళవారం జూరాల ప్రాజెక్టుకు 3 లక్షల 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 45 క్రస్ట్ గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 3 లక్షల 14 వేల 595 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్ట్‌గేట్ల ముదు నుంచి దిగువన ఉన్న శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులెడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 318.020 మీటర్ల స్థాయిలో 8.651 టిఎంసిలను నిల్వ చేసుకుని విద్యుత్ ఉత్పత్తి కోసం 25,676 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 750, భీమా లిఫ్ట్‌కు 650 క్యూసెక్కులు, జూరాల ఎడమ కాలువకు 1030 క్యూసెక్కులు, కుడి కాలువకు 580 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నీట మునిగిన పంట పొలాలు :
జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో దిగువన ఉన్న లోయర్ జూరాల వెనుక భాగంలో వరద నీటికి భీంపురం, రేకులపల్లి గ్రామ శివారులో ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. వరద నీటి కారణంగా ప్రతి సంవత్సరం రైతుల పొలాలు మునిగిపోయి పంట నష్టం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఈ విషయాన్ని జెన్‌కో, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆయకట్టు రైతులు ఆరోపించారు. జెన్‌కో వారు కొంత భాగానికి నష్టపరిహారం ఇస్తామంటూ చెప్పి ఇప్పటిదాకా ఈ రైతులకు న్యాయం చేయకపోవడం విచారకరం. రైతులు మాత్రం మునిగిన పంట పొలాలను చూస్తూ దుఖిస్తూ మా కష్టాలు తమ గాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అంటూ వాపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి, జెన్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా రైతులు వేడుకొంటున్నారు.

Also Read: స్థానిక ఎన్నికల ముందే కులగణన వివరాలు ప్రకటించాలి: కల్వకుంట్ల కవిత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News