Wednesday, May 8, 2024

బంజారుల జీవితాల్లో వెలుగులు

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపుతూ పోడు భూములకు పట్టాలను ఇప్పించిన సీఎం కేసిఆర్‌కు బంజారుల తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలని, అడవులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గంలోని బంజారులకు పోడు భూములకు పట్టాలను పంపిణీ చేశారు. ముందుగా గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతికి సంతాపం తెలుపుతూ సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. బంజారా బాల, బాలికలు చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపుతూ పోడు భూములకు పట్టాలను ఇప్పించిన సీఎం కేసిఆర్‌కు బంజారాల తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలన్నారు. గతంలో వానాకాలం వచ్చిందంటే భూమి దున్నడానికి వెళ్లే రైతులు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ప్రతి నిత్యం గొడవలు జరిగేవన్నారు.

వాటన్నింటికి పుల్ స్టాప్ పెడుతూ నేటితో ఈ పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. నేటి నుంచి మీరు భూమికి హక్కు దారులని, ధైర్యంగా సాగు చేసుకుని పంటలు పండించుకోవచ్చన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో గత మూడు సంవత్సరాలుగా నిత్యం అనేక సమావేశాలు ఏర్పాటు చేసి, సర్వేలు చేయించి, అర్హులైన బంజారాల లిస్టు తయారు చేయించామన్నారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో 2100 మంది బంజారులకు సుమారు 4 వేల పోడు భూముల పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఇంకా ఎవరికైనా పట్టాలు రాకపోతే సర్వేలు చేయించి అర్హులైన వారికి పట్టాలు అందజేస్తామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల మంది గిరిజన రైతులకు మొత్తం 4 లక్షల 5 వేల ఎకరాలకు పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఎటువంటి పైరవీలు, సిఫారసులు లేకుండా అర్హులైన బంజారులకు పట్టాలు అందుతున్నాయన్నారు. ఈ భూములకు ఇతర రైతులకు లాగానే రైతుబంధు వస్తుందని, రైతుబీమా అమలు చేస్తారన్నారు. పండిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి పాస్‌బుక్ ద్వారా అర్హత లభిస్తుందన్నారు. బోర్లు వేసుకుని కరెంట్ కనెక్షన్ తీసుకోవచ్చన్నారు.

బంజారులు కష్టించే రైతులని, చెమటోడ్చి మంచి పంటలు పండిస్తారన్నారు. నియోజకవర్గంలో 4 వేల ఎకరాల భూముల విలువ సుమారు వెయ్యి కోట్లు ఉంటుందన్నారు. పర్యావరణం బాగుండి, వర్షాలు మంచిగా కురవాలంటే వృక్షాలు ఉండాలన్నారు. ఇక నుంచి కొత్తగా చెట్లు నరుకకుండా అడవులను కాపాడుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గిరిజనులకు రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారన్నారు. ఇప్పటి వరకు రూ. 1306 కోట్లతో 155000 మందికి కళ్యాణ లక్ష్మీ అందజేశారన్నారు. 2014 తర్వాత 3.5 లక్షల మంది గిరిజన లబ్దిదారులకు 4,500 కోట్ల ఆసరా పెన్షన్లు అందాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో 30 తాండాలలో బంజారులకు లబ్ది చేకూరుతుందన్నారు. సమిష్టి కృషితో పోడు భూములకు సీఎం కేసిఆర్ సహకారంతో పట్టాలు లభించాయని, ఇది ఎంతో మంచి శుభపరిణామం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News