భయపడొద్దు.. ధైర్యంగా ఉండండి
బిఆర్‌ఎస్ శ్రేణులకు కెసిఆర్ పిలుపు
కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్
నివేదికపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్
అదే సమయంలో ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో కెసిఆర్ భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నివేదికను పవర్ పాయింట్ ద్వారా ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే సమయంలో మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన సమావేశంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఊహించినదేనని స్పష్టం చేశారు. ఈ నివేదిక వల్ల బిఆర్‌ఎస్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పారు, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కొంతమంది బిఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేయవచ్చు.. భయపడవద్దని,అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదన్నవాడు అజ్ఞాని అని కెసిఆర్ అభివర్ణించారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బిఆర్‌ఎస్ శ్రేణులకు కెసిఆర్ పిలుపునిచ్చారు. కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపరంగా ఎదుర్కొందామని చెప్పారు. కాళేశ్వరంతో ప్రజలు, రైతులకు కలిగిన ఉపయోగాన్ని మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
కెసిఆర్ చండీయాగం చేస్తున్నారంటూ ప్రచారం…ఖండించిన పార్టీ వర్గాలు
ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చండీయాగం చేయనున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కెసిఆర్ ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం స్పష్టం చేసింది. కెసిఆర్ కార్యాలయం నుంచి గానీ మరే విధమైన బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల నుండి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలిపారు. అయినా… కనీస సమాచారం తెలుసుకోకుండా వాస్తవాలను నిర్ధారించుకోకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో ..ఫామ్ హౌస్‌లో చండీయాగం అంటూ మీడియా సంస్థలు ఈ దుష్ప్రచారాన్ని కొనసాగించడం బాధ్యతారాహిత్యం అని కెసిఆర్ పిఆర్‌ఒ రమేష్ హజారే మండిపడ్డారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా, కెసిఆర్ ప్రతిష్ఠను భంగపరిచే విధంగా కొనసాగిస్తున్న ఇటువంటి అవాస్తవాలను, అసత్యాలను, వార్తల పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని అన్నారు. తమ తమ ఛానళ్ల నుంచి తొలగించాలని అన్ని పత్రికలు చానళ్ల యాజమాన్యాలను ఎడిటర్లను కోరారు. అధికారికంగా ప్రకటించబడని, కెసిఆర్‌కు సంబంధించిన ఎటువంటి వార్తలనైనా కెసిఆర్ ప్రజాసంబంధాల అధికారి కార్యాలయం నుంచి నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించాలని విజ్ఞప్తి చేశారు.