హైదరాబాద్: ఖైరతాబాద్ నిమజ్జనం అంగరంగా వైభవంగా జరిగింది. ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మంగళవారం ఒంటిగంటన్నరకు పూర్తయ్యింది. ట్యాంకుబండ్‌పై నాలుగో నెంబర్ క్రేన్ ద్వారా బడా గణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి కోసం హైదరాబాద్ నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తాయి. మహా గణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. బడా గణపతికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర అట్టహాసంగా, కన్నుల పండుగలా జరిగింది. గత సంవత్సరం నుంచి ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమం ముందుగానే జరుపుతున్నారు.