Thursday, October 10, 2024

నేడు కొలువుదీరనున్న మహాశక్తి గణపతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పంజాగుట్ట : ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణనాథుడు అన్ని హంగులను పూర్తిచేసుకుని ఈ యేడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. 1954 సంవత్సరంలో ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుడు ప్రతి సంవత్సరం ఒక్కో అడుగును పెంచుకుంటూ ఈ సంవత్సరం 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరాడు. విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన అయోధ్య బాల రాముడు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. గణపతికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమవైపున శివపార్వతుల కళ్యాణ ఘట్టాలను ఏర్పాటు చేశారు. శిల్పి చినస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు 90 రోజులు కష్టపడి అన్ని హంగులతో 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణనాథుని రూపొందించారు. గురువారం మధ్యాహ్నం శిల్పి రాజేంద్రన్ గణనాధునికి నేత్ర అలంకరణ చేసి ప్రాణం పోశారు.

మొదటిరోజు సిఎం, గవర్నర్ పూజలు
వినాయక చవితి మొదటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ సంవత్సరం వినాయక చవితి శనివారం వస్తున్నందు వలన మరుసటి రోజు ఆదివారంతో పాటు రెండు సెలవు దినాలు రావడంతో గణనాథుని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందువలన మూడు షిఫ్ట్ లలో 24 గంటలు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ముగ్గురు డిఎస్‌పిలు, 13 మంది ఇన్‌స్పెక్టర్లు, 33 మంది ఎస్‌ఐలతో పాటు ఇతర సిబ్బంది షిఫ్ట్ లలో పాల్గొంటారని తెలిపారు.

17న నిమజ్జనం…
తొమ్మిది రోజులపాటు ఎంతో నిష్టగా, వైభవంగా పూజలు అందుకునే గణనాథుడిని ఈనెల 17వ తేదీన నిమజ్జనం చేయబోతున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఖైరతాబాద్ గణనాధుని చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా తరలివచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిమజ్జనం రోజున ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మధ్యాహ్నం ఒంటిగంటలోపే నిమజ్జనం చేయడంతో ఈసారి కూడా ఒంటిగంటలోపే నిమజ్జనం చేయనున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News