Friday, March 29, 2024

మౌనీ బాబా ఎందుకయ్యారు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌పై వచ్చిన తీవ్రస్థాయి ఆరోపణలపై ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఆయన మౌనీ బాబా అయ్యారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)తో దర్యాప్తు జరిపించాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్ బుధవారం స్పష్టం చేసింది. ఆ వివాదాస్పద పారిశ్రామికవేత్త ఎదుగుదల ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహితత్వంతోనే సాధ్యమైందా? అయితే ఇది అసాధారణం అవుతుందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. అదానీపై తీవ్రస్థాయి విమర్శలు తలెత్తితే ప్రధాని మౌనాన్ని ఏమనుకోవాలని ఖర్గే ప్రశ్నించారు. అయితే ప్రధానిపై అనుచిత నిందలు సహించేది లేదని, నిరాధారమైన ఆరోపణలు చెల్లనేరవని అధికార పక్షం బిజెపి ఖర్గేపై ఎదురుదాడికి దిగింది.సభాధ్యక్షులు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కలుగచేసుకుని , ప్రధానిపై ఇటువంటి మాటలకు దిగరాదని, ఇది ఖర్గే స్థాయికి తగవని వ్యాఖ్యానించారు.

అయినా విదేశీ నివేదికలు, వార్తలను ఆధారంగా చేసుకుని జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు విపక్షం పార్లమెంట్‌ను వేదిక చేసుకోరాదని హితవు పలికారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ దేశభక్తిని సభాధ్యక్షులు కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సభలో ఖర్గే చేసిన వ్యాఖ్యలతో దీనితో పరస్పర విమర్శల నడుమ సభలో వ్యాగ్యుద్ధం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ పార్లమెంట్‌లో పలు రకాలుగా విమర్శలకు దారితీస్తున్న విషయం తెలిసిందే. ఖర్గే తమ ప్రసంగంలో ప్రధాని మోడీ అదానీపై ఎందుకు స్పందించడం లేదని, ఆయన ఈ విషయంలో ఎందుకు మౌనీబాబాగా మారారని ప్రశ్నించారు. ఈ దశలో ప్రధాని మోడీ సభలోనే ఉన్నారు. 2014లోనే ప్రధాని మోడీ ఒకానొక సందర్భంలో తాను కొన్నింటిపై మాట్లాడను, ఇతరులను మాట్లాడనివ్వను అన్నారని, ఇదేమి నియంతృత్వం, ఈ పద్ధతిని ఇప్పటికీ తన వారిని వెనుకేసుకురావడానికి పాటిస్తున్నారా? అని ప్రశ్నించారు.

సాధారణంగా ప్రధాని ఇతర వ్యక్తులందరిని భయపెడుతుంటారని, మరి ఈ పారిశ్రామికవేత్త విషయంలో ఎందుకు పెదవి విప్పలేదని ఇది అనుమానాలకు దారితీయదా? అని నిలదీశారు. రెండున్నర ఏళ్లలో ఓ పారిశ్రామికవేత్త, ప్రధానికి దగ్గరి స్నేహితుడి ఆస్తులు సంపద 13 రెట్లు పెరిగాయని ఇదేం విడ్డూరం అని కాంగ్రెస్ ఇతర విపక్షాలు విమర్శించాయి. అయితే విపక్షాలు ప్రధానిపై లేనిపోని ఆరోపణలకు దిగుతున్నాయని కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, నిర్మలా సీతారామన్ విమర్శించారు. ఈ దశలోనే ఖర్గే తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఓ వ్యాపారవేత్త సంపద 2014లో రూ 50,000 కోట్లు ఉండగా, ఇది 2019 నాటికి రూ 1 లక్ష కోటికి చేరిందని, ఇంతగా ఎదుగుదల ఉండటానికి ఏం అద్భుతం జరిగిందని ప్రశ్నించారు. సొంతంగా ఆయన ఈ అభివృద్థిని సాధించారా? లేక ప్రధాని మోడీ సహకారం ఉందా? తెలుసుకోగల్గుతున్నానని తెలిపారు. అయితే ఉత్తుత్తి మాటలతో ఆరోపణలకు దిగడం సరికాదని , ఎవరిపైనా సరైన ప్రాతిపదిక లేకుండా దురుద్ధేశపూరిత మాటలకు దిగరాదని ధన్‌కర్ ఖర్గేకు తెలిపారు.

బిజెపి సభ్యులు సుశీల్ మోడీ మాట్లాడుతూ ప్రధానిపై ఆరోపణకు అభ్యంతరం వ్యక్తం చేశారు.సభలో ఒక సభ్యుడిపై వేరే సభ్యులు ఉన్నట్లుండి ఛైర్మన్ ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎటువంటి ఆరోపణలకు దిగరాదని రూల్ 238 ఎ చెపుతోందని, దీనిపై ఛైర్మన్ పరిశీలించాల్సి ఉందని కోరారు. దీనితో ధన్‌కర్ ఏకీభవించారు. సభ్యుడు తాను చేసే ఆరోపణలకు తగు సాక్షాధారాలు చూపాలని లేకపోతే ఇవి చెల్లనేరవని స్పష్టం చేశారు. ఈ దశలో ఖర్గేను ఉద్ధేశించి దేశవ్యతిరేక వ్యాఖ్యలకు దిగరాదని స్పష్టం చేయడంతో ఖర్గే తీవ్రనిరసన వ్యక్తం చేశారు. తాను నిజాలు చెపుతూ ఉంటే దీనిని దేశ వ్యతిరేకం అని చెపుతారా? మీలో ఎవరితో పోల్చినా తాను పెద్ద దేశ భక్తుడిని అని, తాను భూమిపుత్రుడిని అని , తన భావాలను అణచివేయడానికి యత్నించరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటూ ఇతరులకు నీతులు చెపుతోంది. మమ్మల్ని దేశ వ్యతిరేకులుఅంటోందని, ఇదేం ధర్మం అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంలో నిజాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా జెపిసి ఏర్పాటు కావల్సిందే అన్నారు. అదానీ అంశంపై జెపిసి లేదా సుప్రీంకోర్టు సారథ్య దర్యాప్తు జరిపించాల్సింది ఉందని ఇతర విపక్ష సభ్యులు కూడా డిమాండ్ చేశారు.

రాజధర్మం దెబ్బతిందని వాజ్‌పేయి చెప్పారు
ప్రధాని మోడీపై విమర్శల దశలో ఖర్గే

మోడీ సిఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో జరిగిన ఘర్షణల విషయాన్ని తమ ప్రసంగంలో ఖర్గే ప్రస్తావించారు. అప్పటి గుజరాత్ ఘర్షణలతో ప్రపంచంలో భారతదేశం ప్రతిష్ట దెబ్బతిందని, ఇది తాను చెప్పడం లేదని, అప్పటి ప్రధాని వాజ్‌పేయినే రాజధర్మం దెబ్బతిందని, ఈ దశలో తాను విదేశాల్లో పర్యటనకు వెళ్లితే ఎటువంటి స్థితి ఉంటుందని ప్రశ్నించారని పేర్కొంటూ అప్పట్లో పత్రికలలో సంబంధిత విషయాలపై వచ్చిన పత్రిక వార్త కటింగ్ సభలో చూపారు. దీనిపై ధన్‌కర్ స్పందిస్తూ పత్రికల్లో వచ్చిన వాటిని సాక్షంగా సంబంధిత ఆధార పత్రంగా భావించడం కుదరదని ధన్‌కర్ తెలిపారు. అయితే వాజ్‌పేయి చెప్పిన మాటలను విపక్షాలు తమకు అనుకూలంగా మల్చుకున్నాయని, నిజానికి అప్పట్లో ఆయన కాంగ్రెస్ హయాంలో జరిగిన మతకల్లోలాల గురించి ఆవేదన వ్యక్తం చేశారని సభలో అధికార పక్ష నేత, వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News