Wednesday, August 6, 2025

ఇవిఎంలు వద్దు.. బ్యాలెట్ పేపరే బెస్ట్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

బీహార్ ఎన్నికల నుంచే వాడాలి
ఎన్నికల హామీలను అమలు చేయని పార్టీలపై చర్యలు తీసుకోవాలి 
ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్ నేతల విజ్ఞప్తి
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కెటిఆర్ సారథ్యంలోని ప్రతినిధుల బృందం భేటీ
కాళేశ్వరం నివేదిక మొత్తం గ్యాసే 
మైకులు కట్ చేయకుండా మాట్లాడనిస్తే అసెంబ్లీలో కాంగ్రెస్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటాం 
ఇసితో భేటీ అనంతరం కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: బ్యాలెట్ పద్దతిలోనే అన్ని ఎన్నికలను నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్‌ను కోరామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పారు. అభివృద్ది చెందిన ఎన్నో దేశాలు ఇవిఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేసి తిరిగి పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతిని గుర్తు చేశామన్నారు. అమెరికా, యుకె, జర్మనీ, ఇటలీతో పాటు ఇంకా చాలా దేశాలు ఇవిఎంలతో కొన్ని ప్రయోగాలు చేసి, ఆ తరువాత ప్రజలకు అనుమానాలు రావడంతో ఓటింగ్ మెషిన్లను వద్దనుకుని తిరిగి పేపర్ బ్యాలెట్‌కే వెళ్లాయని తెలిపారు. నవంబర్‌లో జరిగే బీహార్ ఎన్నికలతోనే పేపర్ బ్యాలెట్‌ను ప్రవేశపెట్టి, ఆ తర్వాత వచ్చే పార్లమెంట్ సాధారణ ఎన్నికలను కచ్చితంగా పేపర్ బ్యాలెట్‌తో నిర్వహించాలని నిర్వహించాలని ఇసిఐకి స్పష్టం చేశామన్నారు. ఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హాజరైంది. ఈ సమావేశంలో కెటిఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్ పాల్గొన్నారు.

అనంతరం ఢిల్లీలో కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంస్కరణలు, ప్రతిపాదనలు, ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చించాలన్న భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు వారితో సమావేశమయ్యామని చెప్పారు. బీహార్‌లో జరుగుతున్న ఓటర్ జాబితా సవరణ మీద వస్తున్న అనుమానాలు, దాదాపు 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, అక్కడి రాజకీయ పార్టీలు చేస్తున్న ఆందోళనపై ఎన్నికల కమిషన్‌తో మాట్లాడామని అన్నారు. చనిపోయిన వారి ఓట్లు, వలస కార్మికులు, స్పందించని వారి ఓట్లను తీసేశామని కమిషన్ చెప్పిందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకుని ఓటరు జాబితా సవరణ చేయాలని తాము చెప్పామని పేర్కొన్నారు. అర్హుడైన ఒక్క వ్యక్తికి కూడా ఓటు పోవద్దని కమిషన్‌కు తాము స్పష్టం చేశామని అన్నారు.

కారును పోలిన గుర్తుల వల్లనే ఓటములు
కారు గుర్తును పోలిన గుర్తులతో బిఆర్‌ఎస్‌కు జరుగుతున్న నష్టాన్ని వివరించి తక్షణమే వాటిని తొలగించాలని కోరినట్టు కెటిఆర్ తెలిపారు. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానంలో కారు గుర్తును పోలిన రోడ్ రోలర్ గుర్తు వల్ల అసలు ప్రచారమే చేయని ఇండిపెండెంట్ అభ్యర్థికి 27 వేల ఓట్లు వచ్చిన విషయాన్ని కమిషన్‌కు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఆ ఎన్నికలో కేవలం 5 వేల ఓట్ల తేడాతో బిఆర్‌ఎస్ ఓడిపోయిందని, అందుకు రోడ్ రోలర్ గుర్తు కారణమని గణాంకాలతో వివరించామన్నారు.

వంద కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో మిషన్‌లతో నష్టమే
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో దాదాపు వంద కోట్ల ఓటర్లు మన దేశంలో ఉన్నారని కెటిఆర్ తెలిపారు. ఇలాంటి దేశంలో మిషన్‌లతో నష్టం జరుగుతుందని, తమ ఓటు అనుకున్న వ్యక్తికి పోవడం లేదని ప్రజలకు అనుమానాలు వస్తే అది ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. అందుకే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను పక్కనపెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ తీసుకోవాలని తమ పార్టీ తరపున కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరామన్నారు.

పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలపై ఇసిఐతో చర్చించాం
ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు,అడ్డగోలు వాగ్దానాలపై కూడా ఎన్నికల కమిషన్‌తో చర్చించామని కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి 420 హామీలు ఇచ్చి, ఒక వేలంపాట లాగా నోటికొచ్చిన వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎలా తప్పించుకుంటుందో ఎన్నికల సంఘానికి వివరించామని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోకి కట్టుబడి ఉండకపోతే వారిని శిక్షించే బాధ్యత, అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలను వంచించే ఏ పార్టీ అయినా మోసం చేస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎన్నికల్లో పాల్గొనడానికి వీలు లేకుండా అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు.

దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలి
భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు రావాలని కెటిఆర్ ఆకాంక్షించారు. ఎన్నికల ఖర్చు విషయంలో, దొంగ హామీలు ఇచ్చి ప్రలోభ పెడుతున్న పార్టీల విషయంలో, ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్న పార్టీలు, నేతల విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని తెలిపారు. చాలా విషయాలను తమ పార్టీ నుంచి రాతపూర్వకంగా సమర్పించామని చెప్పారు. ఎప్పటికప్పుడు తమకు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కమిషన్ కోరిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాటకాలను బిసిలు అర్థం చేసుకున్నారు
బిసిలతో కాంగ్రెస్ పార్టీ క్రూరమైన పరిహాసం ఆడుతుందని శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే తాము చెప్పామని కెటిఆర్ అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిసి డిక్లరేషన్‌లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే లేవు అని, ఇంకా వేరే హామీలు కూడా ఉన్నాయని, వాటిని అమలు చేయకుండా ఆ పార్టీ నాటకాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చేతుల్లో ఉన్న ఈ పనులు చేయకుండా తమ చేతుల్లో లేని రాజకీయ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ నానా యాగీ చేస్తున్నదని విమర్శించారు. ఊహాజనిత శత్రువులను చూపించి తప్పించుకుంటే కుదరదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బిసిలు అర్థం చేసుకున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మైకులు కట్ చేయకుండా మాట్లాడనిస్తే ఫుట్‌బాల్ ఆడుకుంటాం
కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్, ట్రాష్ మాత్రమే తప్ప అందులో ఏమీ లేదని కెటిఆర్ మండిపడ్డారు. 655 పేజీల కమిషన్ నివేదికను 60 పేజీలకు కుదించడంలోనే కాంగ్రెస్ భాగోతం అర్థమైందని విమర్శించారు. 600 పేజీల్లో వారికి ఇష్టమైనవి లేవు అని, ఆ 60 పేజీల్లో మాత్రమే వారికి ఇష్టమైనవి ఉన్నాయని, అందుకే వాటిని మాత్రమే బయటపెడుతున్నారని ఆరోపించారు. దమ్ముంటే మొత్తం 655 పేజీల నివేదికను ప్రజల ముందు పెట్లాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా కెసిఆర్‌పై, బిఆర్‌ఎస్‌పై కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని, అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా తమను అసెంబ్లీలో మాట్లాడనిస్తే ప్రభుత్వంతో ఫుట్‌బాల్ ఆడుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకీ దమ్ముందా..? అంటూ కెటిఆర్ సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News