Thursday, May 2, 2024

బిజేపే వరి వద్దంటోంది: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రాజన్నసిరిసిల్ల: దిక్కు మాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిరిసిల్ల రైతు ధర్నాలో కెటిఆర్ ప్రసంగించారు.  తెలంగాణ వచ్చాక ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పిందన్నారు.  గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం 101 అని అక్టోబర్ లో విడుదలైన ఓ నివేదిక చెబుతోందని,  ఆకలి రాజ్యాల లిస్టు లో భారత్ ర్యాంక్ 101 అని చెప్పడం మనకు సిగ్గు చేటు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్ ల ర్యాంకులు వందలోపే ఉన్నాయని, కాంగ్రెస్, బిజెపిలు దిక్కు మాలిన పాలన దుస్థితికి ఈ ర్యాంక్ అద్దం పడుతోందన్నారు. బండి సంజయ్ తొండి సంజయ్ లాగా మారారని దుయ్యబట్టారు.  బండి సంజయ్ తన పాదయాత్ర లో మనం నిర్మించిన రైతు వేదికల్లో పడుకున్నారని, బిజెపి వాళ్ళు ఎందుకు ధర్నా చేశారో చెప్పాలని నిలదీశారు. మోడీ ధాన్యం కొంటామంటే తాము వద్దంటున్నామా? అని అడిగారు. వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉందని,  రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు.

ఏ పంట వేయాలన్నది కేంద్రం చెప్పాలని,  ఆరేళ్లుగా అంతా బాగానే నడిచిందని, తెలంగాణలో ప్రాజెక్టుల ఫలితంగా ధాన్యం ఉత్పత్తి పెరగగానే కేంద్రం కొర్రీలు పెడుతోందని కెటిఆర్ మండిపడ్డారు. మాకు వరి పంట వేయడం తప్ప వేరేది రాదని మన రైతులు అంటున్నారని, కేంద్రం మాత్రం వరి వద్దు అంటోందని, పంజాబ్ కు ఓ న్యాయం తెలంగాణ కు ఓ న్యాయమా అని కెటిఆర్ కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో ఒక్క విధానం ఉండనవసరం లేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ బిజెపి వరి వద్దంటే ఇక్కడి బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ వరి కావాలంటున్నాడని ఎద్దేవా చేశారు.

ఈ బండి సంజయ్ ను పార్లమెంట్ కు ఎందుకు పంపారో అర్థం కావడంలేదన్నారు. ఓట్ల కోసం బిజెపి రాజకీయాలు చేస్తోందని, ఎంపి అయ్యాక సిరిసిల్లకు సంజయ్ ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని అడిగారు. చిల్లర ఓట్ల కోసం రైతుల జీవితాలతో బిజెపి చలి మంటలు కాచుకుంటోందని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాజకీయాలకు ధీటుగా బదులిస్తామని, ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రైతు సమితిగా రైతుల కోసం పోరాటం చేస్తోందన్నారు. మోడీ, పీయూష్ గోయల్ వరి వేయాలంటే తాము కాదంటున్నామని బండి సంజయ్ చెప్పాలన్నారు. ఎందుకు ధర్నా చేశారో బిజెపి నేతలకే తెలియడం లేదని, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కేంద్రమంత్రి కొడుకు కారుతో తొక్కించారని, ఎనిమిది మంది రైతులను చంపేశారన్నారు. బిజెపి డ్రామాలు ఎల్ల కాలం నడవవని, రైతు కన్నెర్ర జేస్తే ఎడ్ల బండి కింద బిజెపి నలిగిపోక తప్పదని కెటిఆర్ హెచ్చరించారు.

బిజెపి నీతి మాలిన పార్టీ అని, మిషన్ భగీరథకు డబ్బులు ఇవ్వరని, మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని నిలదీశారు. జాతీయ పార్టీకి జాతీయ విధానం లేదని, ఈ రోజు పడింది మొదటి అడుగు మాత్రమేనని, కేంద్రం యాసంగి వడ్లు కొంటామనేదాకా బిజెపిని విడిచి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ మెడలు వంచామని, రైతుల కోసం వరి పై బిజెపి మెడలు వంచలేమా? అని అన్నారు. రైతుల వెంటే ఉంటామని, రైతులు తమకు అండగా ఉండాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News