Wednesday, April 24, 2024

కాంగ్రెస్ విధానం కూల్చుడు… ‘పేల్చుడేనా?’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణిని రద్దు చేయడం.. ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్ విధానమా..? అని మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. శాసనసభ లో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా గురువారం ధరణి పోర్ట్‌ల్‌పై కాంగ్రెస్ ఎంఎల్‌ఎ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ధరణి పోర్టల్ రైతులకు శాపంగా మారిందని, ధరణిలో లోపాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని పేర్కొన్నా రు. ధరణిలో తొలగించిన కాలమ్‌లను మళ్లీ పొందుపరచాలని డిమాండ్ చేశారు. శ్రీధర్‌బాబు చేసిన ఆరోపణల ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత లంచాలు లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, దాంతో రై తులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే, ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. అన్నిసవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరని, ఎక్కడో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మండిపడ్డారు.

ఒకటి రెండు లోపాలు జరిగితే రాష్ట్రమంతా గందరగోళం నెలకొందని చెప్పడం సరికాదని అన్నారు. ధరణిని రద్దు చే స్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెబుతున్నారని, ధరణిని రద్దు చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే.. పార్టీ పరంగా చెప్పాలని అడిగారు. ధరణి వల్ల రైతులకు ఏ లాభం లేదు.. రద్దు చేస్తామని చెప్పండి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో లంచం లేకుండా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేయకుండా రైతులను రాక్షసంగా ఇబ్బంది పెట్టినట్లే ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నామని శ్రీధర్ బాబు చెప్పదలుచుకున్నారా..? అని కెటిఆర్ నిలదీశారు. రైతులను పీడించడం, వారి పట్ల కర్కశకంగా వ్యవహరించడమే మీ విధానం అని ఆయన చెప్పదలుచుకున్నారా..?, రెవెన్యూ వ్యవస్థలో లంచగొండితనం ఉండాలనేది వారి విధానం అయితే చెప్పాలని అడిగారు. ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సరికాదని చెప్పారు. శాసనసభను, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దని కెటిఆర్ సూచించారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో ధరణి రద్దు చేస్తా అని ప్రకటనలు చేస్తాడని, తమ అధ్యక్షుడు అలా మాట్లాడలేదని శ్రీధర్‌బాబు చెబుతున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులను ప్రజలు పట్టించుకోవడం లేదని, ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా వారికి డిపాజిట్లు కూడా రావడం లేదని అన్నారు. ప్రగతి భవన్‌ను పేల్చేయాలని వారి అధ్యక్షుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ ఇక్కడ వారి సభ్యురాలు మాట్లాడుతారని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక వైఖరి అంటూ ఉందా..? లేదా..? స్పష్టం చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. అధ్యక్షుడికి, నాయకులకు సమన్వయం లేకపోతే తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ధరణిని ఎత్తివేయడం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమా..? ప్రగతి భవన్‌ను బాంబులతో పేల్చేయాలనడం ఒక సిద్ధాంతమా..? ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరా..? ఇంత అరాచకంగా, అడ్డగోలుగా మాట్లాడొచ్చా..? అధ్యక్షుడి మాటలను సమర్థిస్తూ వారి సభ్యురాలు మాట్లాడొచ్చా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుందని చురకలించారు. ఇకనైన వారి వైఖరి మార్చుకోవాలి అని కెటిఆర్ సూచించారు.

కెసిఆర్ పాలనలో దళితులు సంక్షేమంలో ఉన్నారు : రసమయి

దేశంలో దళితులు సంక్షోభంలో ఉంటే కెసిఆర్ పాలనలో తెలంగాణలో రైతులు సంక్షేమంలో ఉన్నారని ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ గురుకుల విద్య పట్ల విప్లవం సృష్టించారని అన్నారు. దళితులు అన్ని విధాలుగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. బిజెపి ప్రభుత్వం దేశంలో అతిపెద్ద స్టేడియంకు మోడీ పేరు పెట్టారు గానీ అంబేద్కర్ పేరు పెట్టలేదని, అలాగే పార్లమెంట్‌కూ అంబేద్కర్ పేట్టలేదని విమర్శించారు. కానీ సిఎం కెసిఆర్ తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని పేర్కొన్నారు. మానవీయ కోణంలో ఆలోచించి సిఎం కెసిఆర్ దళిత బహుజనుల సంక్షేమం కోసం పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News