కాంగ్రెస్ అగ్రనేతలు డిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు
అసమర్థ, అవినీతి కాంగ్రెస్ పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి
రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 20 నెలల అసమర్థ, అరాచక, అవినీతి పాలనకు ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని అన్నీ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు రానున్న ఉపఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు. ఎన్నికల ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్ర నేతలు తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను డిక్లరేషన్ల పేరుతో మోసం చేశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.ఇలాంటి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని కెటిఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి, కుంభకోణాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాపాడుతోందని, అందుకే మోడీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శించారు. ఈ రెండు పార్టీల ఏకైక అజెండా తెలంగాణ పార్టీని ఓడించడమేనని పేర్కొన్నారు.
పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చుతున్నారు
హైదరాబాద్ నగరంలో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కెటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు ప్రభుత్వ స్థలంలో చిన్న గూడు కట్టుకుంటే దాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారని, కానీ..ధనికుల ఇళ్లకు మాత్రం హైడ్రా పోదు అని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అయన సోదరుడు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెరువుల్లో ఇండ్లు కట్టుకుంటే హైడ్రా వారిపైపు కనెత్తి చూడదని, పేద వాళ్ల ఇండ్లను మాత్రం ఎలాంటి నోటీసులు లేకుండా సెలవు దినాల్లో కూల్చి వేస్తుందని అన్నారు. కూకట్‌పల్లిలో ఇల్లు కూలుస్తారని భయంతో ఒక వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను ఒక అగ్రగామి నగరంగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. లక్ష మంది పేద ప్రజలకు జీవో నెం. 58 ద్వారా పట్టాలు ఇచ్చి, వారి జీవితాలను నిలబెట్టిన నాయకుడు కెసిఆర్ అని పేర్కొన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాలను అందించామని వివరించారు. కెసిఆర్ ఎప్పుడూ మతం పేరుతో రాజకీయాలు చేయలేదని, అందుకే పదేళ్లలో హిందూ -ముస్లిం, అంద్రా తెలంగాణ గొడవలు జరగలేదని అన్నారు.
జూబ్లీహిల్స్‌లో మరోసారి గులాబీ జెండా ఎగురవేద్ధాం
జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ, దివంగత మాగంటి గోపీనాథ్ సేవలను కొనియాడారు. ఆయన అకాల మరణం కారణంగా వచ్చిన ఉపఎన్నికను మనం సీరియస్‌గా తీసుకొని గెలుపు కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్‌కు నివాళిగా, మరోసారి జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగురవేద్దామని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త 100 ఓట్లకు ఒకరు, 25 ఇళ్లకు ఒకరు చొప్పున పనిచేసి, కెసిఆర్ పాలన, ప్రస్తుత కాంగ్రెస్ పాలన మధ్య తేడాను ప్రజలకు వివరించాలని కెటిఆర్ సూచించారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దాసోజు శ్రవణ్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు రావుల శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.