Saturday, July 27, 2024

ఒప్పించండి.. తప్పించండి

- Advertisement -
- Advertisement -

KTR

 

టిఆర్‌ఎస్ అదనపు నామినేషన్ల సమస్య పరిష్కారంలో కెటిఆర్ తలమునకలు

వైదొలిగితే నామినేటెడ్ పదవులు
లేకపోతే కఠిన చర్యలు, బిఫాం పొందే వారే పోటీలో ఉండాలి
పండగల్లోనూ ప్రచారం చేయాలి
అంతటా గెలుపు ఖాయం, అధిక మెజారిటీల కోసమే కృషి

హైదరాబాద్ : మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలకు దాఖలైన టి ఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్లపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ శనివారం నాడు కూలంకషంగా సమీక్షించారు. పార్టీ అధిష్ఠానం దిశానిర్దేశించిన దానికి మించి నామినేషన్లు దాఖలు చేయడం ప ట్ల నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఫాం పొందిన అభ్యర్థులకు అదనంగా నా మినేషన్లు వేసిన వారు పోటీ నుంచి తప్పుకునేలా చూడాలని అలా తప్పుకుని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేసే వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. మితిమించి నామినేషన్ల దాఖలైన రంగారెడ్డి, మల్కాజ్‌గిరి, మెదక్, నిజమాబాద్ తదితర జిల్లాల ఇన్‌ఛార్జీ మంత్రులు, శాసనసభ్యులతో ఆంతరంగికంగా ముఖాముఖీ సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. నామినేన్ల ఉపసంహరణ ముగిసేనాటికి టిఆర్‌ఎస్ అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థులు మినహా టిఆర్‌ఎస్ ఆశావహులు పోటీలో ఉంటే పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

గెలుపు ఓటమిలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో పాటు మంత్రులు కూడా బాధ్యతవహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గెలుపే లక్షంగా, పార్టీ అధిష్ఠానం ఆదేశాలను పాటిస్తూ ఎన్నికలప్రచారంలో దూసుకుపోవాలని కెటిఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిర్వహించిన ఆంతరంగిక సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఫిర్జాదిగూడలో మంత్రి మల్లారెడ్డి, మాజీ శాసన సభ్యుడు సుధీర్ రెడ్డి మధ్య విభేదాలతో పార్టీ వీడిన దయాకర్‌రావు ఉద ంతంపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వార్డులో టిఆర్‌ఎస్ గెలుపు అతిముఖ్యమని పదేపదే చెపుతున్నప్పటికీ నాయకుల అంతర్గత విభేదాలు విడనాడక పోవడం పై మంత్రి మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డిని మందలించినట్లుగా తెలుస్తోంది. అలాగే కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పార్టీ కార్యాలయానికి పిలిచి మాట్లాడారు.

కెటిఆర్ జరిపిన చర్చలు విజయ వంతంకావడంతో జూపల్లి రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారంలోకి నిమగ్నమయ్యారు. అలాగే అన్ని జిల్లాలు, నియోజకవర్గాలనుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారిగా దాఖలైన నామినేషన్ల వివరాలను కూడా ఈసందర్భంగా సమీక్షించారు. నామినేషన్ల గడువు ముగిసే సరికి పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థులే పోటీలో ఉండాలని కెటిఆర్ ఆదేశించారు. రెబల్స్‌ను ఉపేక్షించే ప్రసక్తే లే దని ఆయన హెచ్చరించారు. పార్టీ ఆదేశాలమేరకు పోటీ నుంచి తప్పుకునే ఆశావాహులను పార్టీ అధిష్ఠానం అనేక అవకాశాలు కల్పించనుందని వివరించారు. అనేక నామినేటెడ్ పోస్టుల్లో ఆశావాహులను నియమించేందుకు జాబితాలను కూడా సిద్ధం చేయాని నాయకులకు చెప్పారు.

ముఖాముఖి సమావేశాలు
నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో కెటిఆర్ విడివిగా సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గాల్లో నెలకొని ఉన్న రాజకీయ వాతావరణాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. నియోజకవర్గాల వారిగా రెబల్స్ వివరాలను తెలుసుకున్నారు. ప్రత్యేకంగా రెబల్స్ జాబితాను రూపొందించాలని కెటిఆర్ ఆదేశించారు. ప్రచార సామాగ్రి చేరవేతపై రాష్ట్ర కార్యాలయంతో నియోజకవర్గాల నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని చెప్పారు. పురపాలికలకు దగ్గరగా ఉన్న గ్రామీణ ప్రాంతాల టిఆర్‌ఎస్ శ్రేణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని చెప్పారు. పార్టీ ఇన్‌ఛార్జీలుఎన్నికల ప్రచారంలో మంత్రుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

మెజారిటీ కోసమే ప్రయత్నం
పట్టణ ప్రజలనుంచి మంచి స్పందనవస్తోంది. అనేక నివేదికలు టిఆర్‌ఎస్ గెలుపును ఖాయం చేశాయి. అయితే మెజారిటీసాధిస్తూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే విధంగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు నిరంతరం శ్రమించాలని చెప్పారు. మరో పదిరోజులు కష్టపడి పనిచేస్తే టిఆర్‌ఎస్ సంపూర్ణ విజయం సాధిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికలైనా టిఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇదే నేపథ్యంలో పురపోరులోకూడా టిఆర్‌ఎస్ విజయ పతాకం ఎగరవేస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రజలంతా సిఎం కెసిఆర్, టిఆర్‌ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వారందరిని అభ్యర్థులు కలుసుకోగలిగితే అత్యధిక మెజారిటీతో విజయం సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని టిఆర్‌ఎస్ నాయకులతో కెటిఆర్ చెప్పారు.

మంత్రులు బాధ్యతలు స్వీకరించాలి
పురపాలికల ఎన్నికల్లో మంత్రులు వ్యక్తిగతంగా ఎక్కడికక్కడ గెలుపుకోసం కృషిచేయాలని కెటిఆర్ ఆదేశించారు. ప్రచార సన్నాహాలు, ప్రచారం చేయడంలో మంత్రులు ముందువరుసలో నిలవాలని ఆయన చెప్పారు.నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో సన్నిహితంగా ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన చెప్పారు. కలిసికట్టుగా పనిచేస్తే అఖండవిజయం సాధించే అవకాశాలు టిఆర్‌ఎస్‌కు ఉన్నాయని చెప్పారు.

సంక్రాంత్రి సంబురాల్లో ప్రచారం
ఎన్నికల ప్రచారంకోసం మిగిలిన 10 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో పండుగ సంబురాల్లో పాల్గొంటూ నాయకులు ప్రజలతో మమేకం కావాలని సూచించారు. పండుగ నేపథ్యంలో నిర్వహించే కార్యక్రమాలు ,సమావేశాలు, సంబురాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని చెప్పారు. ప్రచారంలో ప్రతిక్షణం ఎంతో విలువైందని ఆయన గుర్తు చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాయకులు,పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని తెలిపారు. టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలమేరకు స్థానిక నాయకులు ఎక్కడికక్కడ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.

అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలవాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న ప్రతి ఓటరును అభ్యర్థులు వ్యక్తిగతంగా కలిసి ఎన్నికల ప్రచారం చేయాలని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి అభ్యర్థులు వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన అవనంతరం జరిగిన అభివృద్ధిని, భవిష్యత్‌లో చేయబోయో అభివృద్ధిని ఇంటింటికి వివరించాలని చెప్పారు.

పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం చేసే అభివృద్ధిని కూడా ప్రజలకు వివరించాలని కెటిఆర్ తెలిపారు. పల్లెప్రగతి మాదిరిగానే పట్టణ ప్రగతిని ప్రారంభించి పట్టణాల అభివృద్ధికోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను స్థానిక ఎన్నికల ప్రచారంలో సింహభాగంలో ఉండాన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుచేయని సంక్షేమపథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఆపథకాలను ప్రజలకు వివరించి మద్దతుకోరాలని చెప్పారు. రాబోయో నాలుగు ఏళ్లలో మరింత అభివృద్ధి సాధించనున్నట్లు చెప్పారు.

ఆశావాహుల నామినేషన్ల ఉపసంహరణ బాధ్యతమాదే
టిఆర్‌ఎస్ నుంచి అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేసిన జిల్లాల మంత్రులతో కెటిఆర్ విడివిగా సమావేశమయ్యారు. మంత్రులు తమజిల్లాలో ఉన్న విజయావకాశాలను కెటిఆర్‌కు తెలిపారు. అనేక మున్సిపాలిటీల్లో ఆశావాహులు అనేక మంది నామినేషన్లు వేసినప్పటికీ ఉపసంహరణ నాటికి వారు పోటీ నుంచి తప్పుకుని టిఆర్‌ఎస్ బిఫాం ఇచ్చిన అభ్యర్థి పక్షాన ఎన్నికల ప్రచారంలో నిలుస్తారని మంత్రులు కెటిఆర్‌కు హామీ ఇచ్చారు. కొన్ని మున్సిపాలిటీల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ ఉండటంతో సమావేశాలు నిర్వహించి బిఫారాలు ఇస్తామని మంత్రి మల్లారెడ్డి కెటిఆర్‌కు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రత్యేకంగా కెటిఆర్ సమావేశానికి ఆహ్వానించారు. రంగారెడ్డిజిల్లాలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, గెలిచే అవకాశాలపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ ఎప్పటికీ మా నాయకుడు సిఎం కెసిఆర్ ఆని స్పష్టం చేశారు. ఉద్ధేశపూర్వకంగా నాపై అసత్య ఆరోపణలు చేశారని స్పష్టం చేశారు. కెటిఆర్ ఆంతరంగికంగా నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, మలోతు కవిత, శాసనసభ్యలు గణేష్ గుప్తా, రెడ్యానాయక్, డాక్టర్ సంజయ్ కుమార్, కోనేరు కోనప్ప, దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య,రవిశంకర్,బొల్లం మల్లయ్య యాదవ్, గాదరి కిషోర్, గొంగిడి సునీత, విఠల్ రెడ్డి, సూధీర్ రెడ్డి, నోముల నర్సింహయ్య, జైపాల్‌యాదవ్, క్రాంతి కిరణ్, రవీంద్రకుమార్ పాల్గొన్నారు. అలాగే శాసన మండలి సభ్యుడు నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KTR solution to TRS additional Nominations Issue
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News