మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి ః ఉప్పునుంతల మండల పరిధిలోని లకా్ష్మపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల సమయపాలనపై గ్రామస్తుల నుంచి తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. బుధవారం మన తెలంగాణ ప్రతినిధి పాఠశాలను సందర్శించగా 36 మంది విద్యార్థులు ఉండే ఈ పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే బోధన చేస్తున్న దృశ్యం కనిపించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విధుల్లో లేకపోవడం, మరో ఉపాధ్యాయురాలు పది రోజులుగా సెలవులో ఉండడాన్ని స్థానిక ఉపాధ్యాయులే తెలిపారు. ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు విద్యనందించే ఈ పాఠశాలలో టీచర్ల హాజరు లోపం, పిల్లలపై ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మధ్యాహ్నం తర్వాత హెచ్‌ఎం తన సహోద్యోగి రిటైర్మెంట్ కార్యక్రమానికి వెళ్లినట్లు ఉపాధ్యాయులు వివరించారు.
అయితే ఈ అంశంపై మండల విద్యాధికారిని ఫోన్ ద్వారా సంప్రదించగా, అందరు ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారని సమాధానమిచ్చారు. మరల స్పష్టత కోరినప్పుడు మాత్రమే హెచ్‌ఎం మధ్యాహ్నం తర్వాత వెళ్లినట్లు, టీచర్ సెలవులో ఉన్నట్లు వెల్లడించారు. దీంతో మండల విద్యాధికారికి ఉపాధ్యాయుల హాజరు సమాచారం స్పష్టంగా లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గ్రామస్తులు, బడి పిల్లల తల్లిదండ్రులు ఈ పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్న టీచర్లపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మండల ప్రజలు విఙ్ఞప్తి చేస్తున్నారు.
21ఎన్‌జిపిహెచ్‌ః ఖాళీగా ఉన్న హెచ్‌ఎం కుర్చీ