Thursday, May 2, 2024

జంప్ జిలానీలతో కలిసొచ్చేనా!

- Advertisement -
- Advertisement -

చేరికల ఓట్లు పడేదెటు?,  చేరికలపై తలెత్తుతున్న సందేహాలు,  జంపింగ్ ప్రభావంపైనే చర్చ

ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల్లో నేతలు, కార్యకర్తల చేరికలు జోరుగా సాగుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ, అన్ని ప్రాంతాల నుంచి చేరికలు జరుగుతుండటంతో ఆయా నియోజకవర్గాలలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లతో పాటు బిజెపిలోనూ చేరికల పర్వం కొనసాగుతోంది. ఇలా అన్ని పార్టీల్లో చేరికలు చోటు చేసుకుంటుంటే ఆయా నియోజకవర్గాలలో సదరు నేత వర్గం ఓట్లు ఎవరికి కలిసొస్తాయో, ఎవరి ఓట్లు చీలుతాయో అభ్యర్థులకే అంతుచిక్కడం లేదు. పార్టీల్లో చేరికలపై తలెత్తుతున్న సందేహాలు ఎక్కడకు వెళ్లినా చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీలో చేరిన వాళ్లంతా తమ పార్టీకి ఓట్లు వేస్తారా..? లేక తమ పాత పార్టీ వైపు మొగ్గు చూపుతారా..? అని అభ్యర్థులే సందేహిస్తున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌కు 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలలో చేరికలతో పాటు అన్ని రకాలుగా పోలింగ్‌కు సిద్దమయ్యేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు బల సమీకరణలో నిమగ్నమయ్యారు.

జంపింగ్‌లతో అభ్యర్థుల ఆందోళన…
ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడిన అభ్యర్థులు, తమ నేతకు టికెట్ రాలేదని అసంతృప్తిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. అయితే పార్టీలు మారుతున్న నేతలు, కార్యకర్తల ఓట్లు ఎటువైపు పడతాయో అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇలాంటి నాయకుల తీరు తలనొప్పిగా మారింది. వారిని కాపాడుకునేందుకు చేస్తున్న చర్యలు సత్ఫలితాలను అన్ని సందర్భాలలో ఇవ్వడం లేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ పార్టీ నాయకులు ఇతర పార్టీలోకి చేరితే, ఇతర పార్టీల నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఇప్పటివరకు ఒక పార్టీలో ఉండి, ఎన్నికల సమయంలో ఇతర పార్టీల్లో చేరుతున్న ఆయా వర్గాల నేతలకు సంబంధించిన ఓట్లు నియోజకవర్గంలో ఏ పార్టీకి పట్టం కడతాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

పాల్వాయి స్రవంతి, తుల ఉమ తమకు టికెట్ లభించకపోవడంతో గులాబీ గూటికి చేరారు. ప్రస్తుతం బిఆర్‌ఎస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటివరకు వారి వెంట ఉన్న ఆయా పార్టీల కేడర్ తమ వెంటే ఉంటుందా..? లేక తాము ఇప్పటివరకు ఉన్న పార్టీల అభ్యర్థులకు మద్దతుగా వెంట నిలుస్తుందా..? అని నేతలు సందేహిస్తున్నారు. భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఇటీవలనే బిఆర్‌ఎస్‌లో చేరి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆయనకు నియోజకవర్గంలో కాంగ్రెస్ కేడర్ ఏ మేరకు సహకరిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇతర పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి కేడర్‌కు గాలం వేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలలో సొంత పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలను తమ వైపు తిప్పుకుంటున్నారు. డివిజన్లు, మండలాలు, గ్రామాలలో నేతలు, కార్యకర్తలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారుతున్నారు.

వీరితోపాటు కుల సంఘాల ప్రతినిధులు, పలు యూనియన్ల నేతలు కూడా అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో పార్టీలు మారుతున్న నాయకులు, కార్యకర్తలు, సంఘాల ఓట్లు ఏ పార్టీకి అండగా కలిసొస్తాయి..? ఏ పార్టీకి నష్టం చేస్తాయో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకున్నారు. సాధారణంగా రాజకీయ పార్టీల విధానాలు, సిద్ధాంతాలకు ఆకర్షితులై నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలలో సభ్యులుగా చేరి వివిధ హోదాలలో కొనసాగుతుంటారు. ఎన్నికల సమయంలో జరిగే చేరికల ప్రభావం ఏ మేరకు ఉంటుంది..? ఇంతకాలం ఆయా పార్టీల విధానాలు, సిద్ధాంతాల పట్ల నేతలు, కార్యకర్తలకు ఉన్న అనుబంధం తాత్కాలిక ప్రయోజనాలకు తలొగ్గుతుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

(ఎం.భుజేందర్/మనతెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News