ఖతార్ రాజధాని దోహాపై ఈ నెల 9న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడి మొత్తం అరబ్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అరబ్బులు కాని ఇతర ముస్లిం దేశాలను, ఇతరత్రా అన్ని దేశాలను కూడా. ఎందుకో తెలిసిందే. ఖతార్ అమెరికాకు ఒక నమ్మిన బంటువలే వ్యవహరిస్తున్నది. గల్ఫ్ ప్రాంతం లో అన్నింటికన్న పెద్ద అమెరికన్ సైనిక స్థావరం ఖతార్‌లోనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఖతార్‌ను సందర్శించగా ఆయనకు ఆ దేశాధిపతి చాలా ఖరీదైన బోయింగ్ విమానాన్ని వ్యక్తిగతంగా బహూకరించారు. అదిగాక అమెరికాలో పెట్టుబడులకోసం ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టగలమని ప్రకటించి ట్రంప్‌ను అమితంగా సంతోషపెట్టారు. అటువంటి ఖతార్‌పై, అమెరికాకు మరొక నమ్మిన బంటు అయిన ఇజ్రాయెల్ దాడి జరపటమా! అదే ఒక నమ్మశక్యం కాని విషయం కాగా, మరి కొద్ది వివరాలను గమనించండి. అమెరికాకు ఖతార్, ఇజ్రాయెల్ రెండూ వ్యూహాత్మక భాగస్వాములు.
దాడి జరిగింది, ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్, ఈజిప్టుల మధ్యవర్తిత్వంతో చర్చలు జరుపుతున్న హమాస్ రాయబారులపై. కాల్పుల విరమణ ఒప్పందపు ముసాయిదాను రూపొందించింది స్వయంగా అమెరికా. దాడుల సమయంలో హమాస్ ప్రతినిధులు సరిగా ఆ ముసాయిదాపైనే మాట్లాడుకుంటున్నారు. దాడులలో ఆ ప్రతినిధులు ఐదుగురు చనిపోయారు. హమాస్ ప్రతినిధి బృందానికి ఒక ప్రభుత్వ భవనంలో కార్యాలయాన్ని, ఆశ్రయాన్ని స్వయంగా ఖతార్ ప్రభుత్వం సుమారు పదేళ్ల క్రితమే అమెరికా అనుమతితోనే కల్పించింది. అమెరికా ముసాయిదాను హమాస్ సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఇక చర్చలు జరగవచ్చని కొద్ది రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి కూడా. సరిగా ఆ దశలో ఇజ్రాయెల్ దాడికి పూనుకొన్నిది.
యథాతథంగానే ఆ దాడి ఆశ్చర్యకరమైనది కాగా, పైన పేర్కొన్న వివిధ పరిస్థితుల దృష్టా మరింత ఆశ్చర్యకరంగా తీవ్రమైన విషయంగా మారింది. అందువల్లనే తీవ్ర నిరసనలు, ఖండనలు బయటినుంచి సరేసరి కాగా, ఇజ్రాయెల్‌లోనూ వినిపించాయి. ఇంతకూ ఇజ్రాయెల్ ఈ విధంగా ఎందుకు వ్యవహరించిందనేది ఒక ప్రశ్న కాగా, అమెరికా చేసిందేమిటన్నది రెండవ ప్రశ్నగా మారింది. ఆ రెండింటి తర్వాత ప్రశ్న ఖతార్‌తో పాటు అరబ్బు దేశాలు, ముస్లిం దేశాలకు సంబంధించినది. చివరగా చర్చకు వచ్చేది భవిష్యత్తు ఏమిటన్నది. మొదటి ప్రశ్న చూస్తే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు మౌలికంగానే చర్చలు, కాల్పుల విరమణలు, ఒప్పందాలు వంటివి ఇష్టం లేదని, అందువల్లనే అటువంటి అవకాశాన్ని భంగపరిచేందుకు దాడి చేస్తారన్నది పలువురి అనుమానం. ఆయన లక్షం గాజాను, వెస్ట్ బ్యాంక్‌ను పూర్తిగా ఆక్రమించుకుని గ్రేటర్ ఇజ్రాయెల్‌ను స్థాపించటం.
ఈ మాట ఆయన పలుమార్లు బాహాటంగానే ప్రకటించారు. ట్రంప్ కుటుంబంతో కలిసి గాజాలో ఆధునికి రిసార్ట్‌ను అభివృద్ధి చేసేందుకు వీలుగా అక్కడి పాలస్తీనా ప్రజలను ఒక జాతిగానే నిర్మూలించటమో, ఇతర దేశాలకు పారదోలటమో చేసేందుకు ప్రయత్నించటం కనిపిస్తూనే ఉంది. అందుకు ట్రంప్ పూర్తిగా సహకరిస్తున్నారు. హమాస్‌ను సాకుగా చేసుకుని ఇప్పటికే 65,000 మంది ప్రాణాలు తీసి, అదే మారణ కాండ కొనసాగిస్తూ, అక్కడి నిర్మాణాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. ప్రస్తుతం గాజా సిటీపై ఆక్రమణ మొదలైంది. ఈ చర్యలు వేటికీ అమెరికా అభ్యంతరం చెప్పటం లేదు. పైగా దాడులకు కావలసిన ఆయుధాలను సరఫరా చేస్తున్నది.ఇజ్రాయెల్, అమెరికాల ఉమ్మడి లక్షం ఇది అయినపుడు, దోహా కేంద్రంగా సాగుతున్న చర్చల ప్రయత్నాలు నెతన్యాహూకు సరిపడేవి ఎంత మాత్రం కాదు. అమెరికావి కూడా పైకి చూపించే నటనలు మాత్రమే.
చర్చల పేరిట వారు ప్రయత్నిస్తున్నది హమాస్‌ను రాజీపడజేసి లొంగదీయటం కోసం. ఒకసారి అది జరిగితే ఇక ఎదురుండదు. వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా అథారిటీ (పిఎ) ప్రభుత్వం కేవలం కీలుబొమ్మ. అరబ్ దేశాలన్నీ ఎప్పుడో నయానో భయానో మచ్చిక అయిపోయాయి. ఒకప్పుడు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ నాసర్ నాయకత్వాన రూపుదిద్దుకున్న పాన్ అరబిజం ఆయనతోనే ముగిసిపోయింది. తర్వాత ఇజ్రాయెల్‌తో రాజీపడిన మొట్టమొదటి దేశమే ఈజిప్టు అయింది. ఆ తర్వాత కాలంలో, పాలస్తీనా సమస్య పరిష్కారం కాకున్నా, ఇజ్రాయెల్ మారణకాండ కొనసాగుతున్నా మరికొన్ని అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇటీవలి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వల్ల వెనుకాడుతున్నాయిగాని, లేనట్లయితే మరికొన్ని దేశాలు అదే పని చేసేవి.
ఇజ్రాయెల్ ఈ విధంగా వ్యవహరించటానికి మరొక కారణం కనిపిస్తున్నది. వారు గాజాలో సాగిస్తున్న హత్యాకాండపట్ల ఒక వైపు ప్రపంచమంతటా విమర్శలు తీవ్రమవుతుండగా, అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె), అంతర్జాతీయ నేరన్యాయస్థానం (ఐసిసి), ఐక్యరాజ సమితి, దాని అనుబంధ సంస్థలు తీసుకున్న వైఖరులు ఏమిటో తెలిసిందే. కాని ఇజ్రాయెల్, అమెరికాలు అవేవీ లెక్క చేయకపోవటమే గాక, ఆయా సంస్థలనే ఒత్తిడి చేయటం, న్యాయమూర్తులను బెదిరించటం మొదలు పెట్టారు. వీటి వేటికీ బెదరని ఇజ్రాయెల్, అమెరికా జంట దోషులపై కొత్త ఒత్తిడులు సృష్టించే పరిణామాలు కొన్ని ఇటీవల మొదలయ్యాయి. అమెరికా శిబిరానికే చెందిన యూరోపియన్ దేశాలు అనేకం, తామంతా ఈ నెలలోనే జరగనున్న ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా పాలస్తీనాను గుర్తించనున్నట్లు ప్రకటించాయి.
అంతకు ముందుగానే కొద్ది రోజుల క్రితం యూరోపియన్ పార్లమెంటులో ఆ మేరకు తీర్మానం ఆమోదించాయి. పలు యూరోపియన్ దేశాలు, అక్కడి వాణిజ్య సంస్థలు, బ్యాంకులు ఇజ్రాయెల్‌తో ఆర్థిక సంబంధాలను నిలిపివేయటం మొదలు పెట్టాయి. వాటిపై నెతన్యాహూ, వారు హమాస్ టెర్రరిజాన్ని సెమెటిక్ జాతుల పట్ల విద్వేషాన్ని విస్మరిస్తున్నారంటూ విమర్శలు చేస్తున్నారు గాని, తన మారణకాండను కొనసాగించటం పాలస్తీనా దేశం ఏర్పడే ప్రసక్తే లేదని ప్రకటించటం వల్ల, ఆయన వైఖరి ఎవరికీ సరిపడటం లేదు. మొత్తానికి ఈ యూరోపియన్ పరిణామాలు ఒత్తిడిని పెంచుతుండగా, ఐక్యరాజ్య సమితి నియమించిన ఒక విచారణ కమిషన్, గాజాలో జరగుతున్నది ‘తెలిసి, కావాలని చేస్తున్న’ మారణకాండ అని రెండు రోజుల క్రితం స్పష్టంగా ప్రకటించింది. ఒకవైపు పరిణామాలు ఈ విధంగా ఉండగా, ఖతార్‌పై ఇజ్రాయెల్ అనూహ్యమైన దాడితో, అమెరికా అధ్యక్షుని వైఖరి చర్చనీయంగా మారింది. దాడి మాట తనకు ముందుగా తెలుసునా లేదా అన్నది ప్రశ్న.
దీనిపై నెతన్యాహూ, స్వయంగా ట్రంప్, ఆయన అధికారులు రకరకాలుగా పరస్పర విరుద్ధంగా మాట్లాడారు. తాజాగా, దాడి జరిగిన వారం రోజులకు ఈ 16 నాడు ట్రంప్, తనకు ముందుగా తెలియదన్నారు. కాని వారందరి మాటలపై ఈ సరికి విశ్వాసం పోయింది. అది చాలదన్నట్లు, 15 వ తేదీన అమెరికా విదేశాంగ మంత్రి మార్కోరూబియో సమక్షంలోనే నెతన్యాహూ మీడియాతో, తాము దోహాపై తిరిగి దాడులు జరపగలమని ప్రకటించగా, అటువంటిదేమీ ఉండదని అమెరికాలో మాట్లాడుతూ భరోసా ఇవ్వజూపారు ట్రంప్. అంతే కాదు, దాడి పట్ల తీవ్ర ఆందోళనకు గురైన అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు 50 వరకు దోహాలో 15న సమావేశం కాగా, అదే రోజు అదే సమయంలో రూబియో టెల్‌అవీవ్‌కు వెళ్లి నెతన్యాహూతో సమావేశమై, ఆ దాడిని ఎంతమాత్రం ఖండించకపోగా ఇజ్రాయెల్‌కు “పూర్తి మద్దతు” ఉంటుందని ప్రకటించారు.
హమాస్ చేత పోరాట విరమణ, అస్త్ర విసర్జన చేయించే బాధ్యత ఖతార్‌దేనని, అందుకు వారికి కొద్ది కాలమే అవకాశం మిగిలి ఉందని హెచ్చరించారు. ఆ మరునాడు స్వయంగా దోహాకు వెళ్లి, మీరు ఆ పని చేయండన్నారు తప్ప దాడిని మాట మాత్రంగానైనా విమర్శించలేదు. అమెరికా, ఖతార్‌లు వ్యూహాత్మక మిత్ర దేశాలని మాత్రం ప్రకటించిపోయారు. దీనంతటినీ బట్టి బోధపడేది ఏమిటో ఎవరైనా అర్థం చేసుకోగలరు. చివరకు తేలుతున్న ముఖ్యమైన ప్రశ్నలు రెండున్నాయి. అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు 15న సమావేశమై చేసిందేమిటి? ఆర్భాటం తప్ప నికరంగా ఏమీ కన్పించదు. ఉమ్మడి రక్షణ, అందుకు వ్యవస్థాపరమైన ఏర్పాటు, సైన్య నిర్మాణం వంటి సూచన లేవో వచ్చాయి గాని, ఎటువంటి నిర్ణయాలూ జరగలేదు. ఆ సూచనలు కార్యరూపం తీసుకుంటాయనే నమ్మకమూ లేదు. వారు నిజంగా ఆగ్రహం కలిగి, సమర్థులైతే తక్షణ చర్యగా ఇజ్రాయెల్‌తో దౌత్య, వాణిజ్య సంబంధాలను తెంపుకోవలసింది.
ఇజ్రాయెల్‌ను పూర్తిగా బలపరుస్తున్న అమెరికాకు, ఆ విధానాన్ని వెంటనే మానుకోని పక్షంలో తమ వద్ద గల సైనిక స్థావరాలను మూసివేయగలమని, అమెరికాలో పెట్టుబడులు పెట్టబోమని, అంతర్జాతీయ వ్యవహారాలలో సహకరించబోమని స్పష్టం చేయవలసింది. వ్యూహాత్మక భాగస్వామ్యాల నుంచి వైదొలగుతామని చెప్పవలసింది. కనీసం ఇటీవల కొన్ని యూరోపియన్ దేశాలు తీసుకుంటున్న వైఖరినైనా వీరు చూపలేకపోయారు. గాజా మారణకాండపై ఇసిజెకు ఆఫ్రికన్ దక్షిణ అమెరికన్ దేశాలు వెళ్లినపుడు కూడా వీరు అమెరికాకు భయపడి ఆ పని చేయలేకపోయారు. వారి అసమర్థత, నిస్సహాయత, పిరికితనాలకు మూలం అరబ్ పాలకుల వ్యక్తిగత స్వార్థాలు, సుఖ జీవనాలు. డబ్బు లక్షల కోట్లలో మూలుగుతున్నది. అమెరికాకు ఊడిగం చేసినంతకాలం వీటికి భరోసా ఉంటుంది. కనుక, పాలస్తీనా పట్ల ప్రేమ ఏదో ఉన్నట్లు నటించటం మాత్రం చేస్తారు. అక్కడ ఎంతటి విలయం రెండేళ్లుగా సాగుతున్నా దిక్కులు చూస్తారు. ఇటువంటి స్థితిలో వారు భవిష్యత్తులోనూ ఏమీ చేయలేరని అమెరికా, ఇజ్రాయెల్‌లకు స్పష్టంగా తెలుసు.
Also Read : టీచర్లకు బ్రిటన్ శిక్షణ
- టంకశాల అశోక్ ( దూరదృష్టి)
- రచయిత సీనియర్ సంపాదకులు