Tuesday, April 30, 2024

‘అంగడి బడి’-అద్భుత ప్రయోగం

- Advertisement -
- Advertisement -

‘Literacy Combats Poverty, Improves Health and Promotes Social Development’ READ educational trust, South Africa ‘విద్యా ధనం శ్రేష్ఠధనం’ అని ఆర్యోక్తి. వేదకాలం నాటికే చదువు గొప్పతనాన్ని చాటుతూ మన పండితులు పలికిన మహిత వాక్యం ఇది. అయినప్పటికీ నేటికీ విద్య మన సమాజంలో అందరికీ చేరువకాలేకపోయింది. కారణం: సమాజ విభజన, కావాలనే మెజారిటీ ప్రజలను విద్యకు దూరం పెట్టిన చరిత్రలోని కుట్రలు కుతంత్రాలు. యూరపులో పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల్లో వెలుగు చూసిన వైజ్ఞానిక ఆవిష్కరణలు, తత్ప్రభావంతో తలెత్తిన కళా సాంస్కృతిక పరిణామాలు అన్ని దేశాల్లో వలెనే మన సామాజిక పరిస్థితులనూ కదిలించాయి. సంస్కర్తలు, మేధావుల కృషి మూలంగా మన పారతంత్య్రం వైదొలగి స్వాతంత్య్రం లభించింది. 1951లో మన అక్షరాస్యత 21%. 70 ఏండ్ల తరువాత చూస్తే 77%. పద్నాలుగురు ప్రధానుల ప్రభుత్వాలు పెంచిన అక్షరాస్యత 56% అంటే చెప్పుకోదగిన ముందడుగేం కాదు. ఇంకా 23% మంది ప్రజలు అక్షరాలకు దూరంగా ఉన్నారు. చదువుకు దూరంగా ఉన్నవాళ్లంతా అవకాశం కల్పిస్తే నేర్చుకోవడానికి ఇప్పటికీ సంసిద్ధులై ఉన్నారు. 77 శాతం అక్షరాస్యుల్లో పట్టభద్రులకు తమ డిగ్రీల పట్ల నిరుద్యోగం కారణంగా చిన్నచూపు ఉంటే ఉండవచ్చునేమో కానీ, ప్రాంతాల, కుటుంబాల పేదరికం కారణంగా, సామాజిక వెనుకబాటుతనం వల్ల బడి బాల్యానికి నోచుకోని నిరక్షరాస్యులు వర్ణమాల కనిపిస్తే అబ్బురపడతారు. అక్షరాలు దిద్దుతున్నప్పడు, పదాలు రాస్తున్నప్పుడు, వాక్యాలు చదువుతున్నప్పుడు వాళ్లు పొందుతున్న ఆనందం, అనుభూతి వర్ణనాతీతం. మొన్న మార్చి 13 ఆదివారం నాడు ఈ దృశ్యాన్ని హన్మకొండ పట్టణం బాల సముద్రం ‘అంగడి బడి’ లో నేను కళ్లారా చూశాను.
ప్రపంచీకరణానంతర ప్రస్తుత పరిస్థితుల్లో స్కీములకీ, స్వాములకే గిరాకీ. పలకలు, బలపాలు, పెన్నులు, పెన్సిల్లు, నోటుబుక్స్, కథల పుస్తకాలు అందించే విద్యాదాతలను, స్ఫూర్తివంతులను పట్టించుకునే జనాలు చాలా అరుదు. స్కీములు ధనార్జనకు తోవ కావచ్చు, స్వాములు ఆధ్యాత్మికతను ప్రసరించనూవచ్చు. అయితే పలకలు, బలపాలు, పెన్నులు, పెన్సిల్లు, పఠన సామాగ్రి, అభ్యాసనం ప్రసాదించే వెలుగు మరే ఇతర శక్తులూ ఇవ్వలేవని బోధపడిన మనుషుల అంతఃచేతనే వేరు. ఇదిగో ఈ సన్నివేశమే సాక్ష్యం. “సంధ్య, యమున, కమల, సమ్మక్క, బుచ్చమ్మ, విజయలక్ష్మి అందరూ రావాలె. టైం రెండున్నర అవుతుంది. అంగడి బడి వేళయ్యింది. 5 నిముషాల్లో మీరంతా ఇదిగో ఈ నీలమ్మ దుకాణం దగ్గర నీడ కిందికి రావాలె’ అని కాలర్ మైక్‌లో ఎనౌన్స్‌మెంట్ వినపడగానే అప్పటికే పూర్తిగా సంసిద్ధమై ఉన్న హన్మకొండలోని బాలసముద్రం కాకతీయ కూరగాయల మార్కెట్‌లోని వయోజన మహిళలంతా ఆ రోజు పాఠం కోసం వచ్చికూర్చున్నారు. అక్షరం ఆలోచన ఇస్తదనేది వాళ్ల మెదళ్లకు తట్టిన కాలిక సత్యం.ఈ సత్యమే వాళ్ళను సాక్షరతా వైపుకు మళ్లించింది.మధ్యాహ్నం విరామ సమయంలో రోజూ ఎంతో కొంత నేర్పిస్తే విద్య విజయవంతమవడమే కాదు, ఐక్యరాజ్య సమితి కాంక్షించిన సహస్రాబ్ది సుస్థరాభివృద్ధి 17 లక్ష్యాల్లో ఒకటైన ‘జెండర్ ఈక్వాలిటీ’ సాధనలో తామూ భాగస్వాములు కావొచ్చుననేది స్వచ్ఛంద అనియత విద్యా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ‘ప్రేరణ ఫౌండేషన్’ వారి గట్టి తలంపు. నేర్చుకునేటోళ్ల గ్రహింపుకొచ్చిన సత్యం, నేర్పేటోళ్లకుండే తపన రెండూ కలిస్తే వెలిసిందే ‘అంగడి బడి’. ప్రతి బస్తీలో ఇట్లాంటి అక్షరోద్యమానికి స్థానిక సౌజన్యమూర్తులు, సంస్కరణాభిలాషులు శ్రీకారం చుట్టాల్సి వుంది. కాకతీయ మార్కెట్లోని ఆడపడుచుల్లా మిగతా ఆవాసాల్లోని మహిళలూ అభ్యాసనం పట్ల ఉత్సాహం చూపాల్సి వుంది’. Curiosity and humility are essential for continuous learning and building relationships’ అంటారు కదా. ఉత్సుకత, నమ్రత అంగడి బడిలోని మహిళల్లో పుష్కలంగా ఉంది. ఉత్సుకత అనేది ఒక మనో సంబంధిత ప్రాథమిక ప్రేరణ.ఇది అభ్యాసం, జ్ఞాన సముపార్జన, జీవిత సాఫల్యతలను అమితంగా ప్రభావితం చేస్తుంది. కాకతీయ విజిటబుల్ మార్కెట్లోని మహిళల ఉత్సుకతను కొలవలేం. విద్య నేర్చి విదుషీమణులుగా కీర్తిగడించాల్సిన యుగం లో దురదృష్టం అంచున కాయగూరలమ్ముకొని పొట్ట పోసుకుంటున్న స్త్రీమూర్తుల పట్ల ప్రేరణ ఫౌండేషన్ చూపుతున్న నమ్రతా వెల లేనిది.
నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఒ) డేటా 2021 ప్రకారం మనదేశ సగటు అక్షరాస్యత రేటు 77.70%. ఇందులో పురుషుల అక్షరాస్యత 84.70% కాగా, స్త్రీల అక్షరాస్యత 70.30% గా నమోదైంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) -2019-21 ప్రకారం వయోజన స్త్రీలలో (15-49 సంవత్సరాలు) అక్షరాస్యత రేటు 71.5%, వయోజన పురుషులు (15-49 సంవత్సరాలు) 87.4% అని తెలుస్తుంది. అక్షరాస్యత రేటును 7 సంవత్సరాలు అంతకంటే పైబడిన వయస్సు గల అక్షరాస్యులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయిస్తారు. అక్షరాల పట్ల అవగాహనతో ఏ భాషలోనైనా సరళమైన సందేశాన్ని చదవగల, రాయగల వ్యక్తి అక్షరాస్యుడిగా పరిగణించబడతాడు. అఖిల భారత స్థాయిలో స్త్రీ పురుష అంతరం 12.9 శాతంతో పురుషుల అక్షరాస్యత 84.7%, స్త్రీ అక్షరాస్యత 70.3% ఉండగా, స్త్రీ పురుషుల అక్షరాస్యత మధ్య అంతరం కేవలం 2.2 శాతంతో కేరళలో అతి తక్కువగా ఉంది. మన తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత 80.5% కాగా, మహిళలు 65.1%, పురుషులు 72.8% మందికి రాయడం చదవడం వచ్చు. అంటే 20% మంది బడి ముఖం ఎరుగనివాళ్లు పోగా పురుషులతో పోల్చి చూసినప్పుడు స్త్రీలు 7% అక్షరాస్యతలో వెనుకంజలో ఉన్నారు. ఈ లెక్క ప్రకారం ప్రతి వందమందిలో 35 మంది నిరక్షరాస్య మహిళలుండటం ‘Where India Goes’ గ్రంథం ప్రస్తావించినట్టు కుంగదీసే అభివృద్ధి (Stunted Development)కి కారకం అవుతుంది. అయితే ఉత్త ఉబుసుపోని కబుర్లతో కాలక్షేపం చేస్తూ తార్పుడు విమర్శలకు పాల్పడే కార్యవిహీనుల కంటే కాళ్ళుచేతులాడినంతలో, బుద్ధి సంకల్పించినంతలో సంఘం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన పరుల అవసరమే ఇవాళ దేశానికి రాష్ట్రానికి ఎంతో ఉంది. పదిహేనేండ్లుగా కోయ బాలలకు విద్యనందించే
‘శ్రీ వ్యాస ఆవాసం’ కూడా నిర్వహిస్తున ప్రేరణ ఫౌండేషన్ లాంటి సంస్థల ఆవశ్యకత మనకెంతగానో ఉంది. జాతీయ సాక్షరతా కార్యక్రమంలో భాగంగా స్త్రీలు చదువుకోవాలని మనం తెలుగులో అనేక నినాదాలు రూపొందించుకున్నాం. వాటిల్లో ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’, స్త్రీ విద్య సిరులకు నాంది’, ‘అమ్మ చదివితే అందరూ చదివినట్టే’ ఇట్లాంటి దేశభక్తి పూర్వక నినాదాలు సైతం మన కరడుగట్టిన పితృస్వామ్యాన్ని కరిగించలేకపోయినందున్నే మహిళాక్షరాస్యత ఆశించిన స్థాయిలో సాధింలేకపోయాం. ఈ సందర్భంలో గత 40 ఏండ్లుగా దక్షిణాఫ్రికాలో అక్షరాస్యతా కార్యక్రమాల్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న ‘రీడ్’ ట్రస్టు చేసిన ‘అక్షరాస్యత పేదరికంతో పోరాడుతుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,సామాజిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది’ అనే ఉత్తేజకర వ్యాఖ్యను మనం చెవిన పెట్టాల్సి వుంది. ఈ వ్యాఖ్య మహిళా అక్షరాస్యత విషయంలో మరింత చైతన్యపూరణ కాగలదు. ఇంతకూ కూరగాయల సంతలో చదువు నేర్పించడం, నేర్చుకోవడం ఎట్లా వీలవుతదనే సందేహం తలెత్తవచ్చు. మధ్యాహ్నం భోజనమైనాక మూడున్నర నాలుగు గంటల వరకు పెద్దగా అమ్మకం ఉండదు. గంటా గంటన్నర వ్యవధిలో ఓ ఐదారుగురుకి మించి కొనరు. దాదాపుగా అందరూ ఖాళీగా ఉంటారు. ప్రేరణ ఫౌండేషన్ దీన్నే అభ్యాసన సమయంగా నిర్వహిస్తుంది. అక్షరాలు దిద్దేవాళ్లు దిద్దుతుంటారు. గుణింతాలు పదాలు రాస్తూ పలికే వాళ్లు రాస్తుంటారు, పలుకుతుంటారు. చిన్నచిన్న కథల పుస్తకాలు చదివేవాళ్లు చదువుతుంటారు. ఫౌండేషన్ కార్యకర్తలు సందేహ నివృత్తి చేస్తారు. సమర్థవంతంగా కార్యక్రమం నడుస్తుంటుంది. సమర్థవంత అక్షరాస్యత కార్యక్రమంలో ఆరు ప్రాథమిక భాగాలు ఉంటవి. అవి: 1.ఫోనెమిక్ అవగాహన (Phonemic aware ness), 2. పోనిక్స్ బోధన (Phonics instruction), 3. పదజాలం (vocabulary), 4. పటిమ (fluent), 5. గ్రహణ శక్తి (comprehension), 6. రాయడం (writing). ఫోనెమిక్ అవగాహన అంటే మాట్లాడే పదం విభక్త శబ్దాల శ్రేణితో రూపొందించబడిందని వినగల సామర్థ్యం. ఫోనిక్స్ బోధన అనేది నిర్దిష్ట శబ్దాలు నిర్దిష్ట అక్షరాలు నిర్దిష్ట నమూనాలకు చెందినవని పిల్లలకు బోధించడం. పదజాలం అంటే పదాలు, వాటి అర్థాల పరిజ్ఞానం అని తెలియజెప్పడం. పటిమ అంటే అప్రయత్నంగా సరిగ్గా చదవడం, మాట్లాడటం, వ్రాయడం అనే సామర్థ్యం. గ్రహణశక్తి అనేది ఏమి చదువుతున్నారనే దానితోపాటు ఎట్లా అర్థం చేసుకోవాలనే అవగాహనను కలిగించడం. ఇకరాయడం అంటే విద్యార్థులు కాగితంపై లేదా స్క్రీన్‌పై వాక్యాలను రూపొందించే ప్రక్రియ. ఈ షట్సూత్ర విధానం లక్షణంగా బాలసముద్రంలో అమలవుతుంది. ప్రవేశం, ఉద్యుక్తం, ప్రావీణ్యం అనే మూడు దశలుగా అనియత విద్య ఉంటుంది. ఫోనెమిక్ అవగాహన, ఫోనెమిక్స్ బోధన ప్రవేశం కిందకు వస్తాయి. పదజాలం, పటిమను ఉద్యుక్తత అంటారు. గ్రహణశక్తి, రాయడం ప్రావీణ్యం అవుతాయి. ఈ మూడు దశల్లో కొనసాగుతున్న అంగడి బడి వల్ల ప్రయోజనం ఏమిటని అడిగితే, వ్యాపార నిర్వహణా సామర్థ్యం పెంపొందుతుందని, ప్రాపంచిక అవగాహన మెరుగవుతుందని చదువుకుంటున్న వయోజన మహిళలంతా ముక్తకంఠంతో జవాబిచ్చారు.

Literacy Combats Poverty

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News