Sunday, April 28, 2024

వెళ్లిపోయిన పాటల వెన్నెల సిరి

- Advertisement -
- Advertisement -

Lyricist Sirivennela Sitarama Sastry passed away

న్యూమోనియాతో చికిత్స పొందుతూ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూత
ప్రధాని మోడీ, సిఎం కెసిఆర్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖుల ప్రగాఢ సంతాపం

మనతెలంగాణ / హైదరాబాద్ : ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిరివెన్నెల మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ‘సిరివెన్నెల’ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీతారామశాస్త్రి మరణం సినీ అభిమానులను శోక సముద్రంలో ముంచెత్తింది. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున’ గేయంతో ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. 37 ఏళ్ల సినీ ప్రస్థానంలో సిరివెన్నెల 800లకు పైగా చిత్రాల్లో దాదాపు మూడు వేలకు పైగా పాటలు రాశారు.

ఆయనకు 13 సార్లు నంది అవార్డు రావడం విశేషం. తొలి గీతం ‘సిరివెన్నెల’లోని ‘విధాత తలపున’కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత ఆయనది. ఉత్తమ గేయ రచయితగా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌గానూ అలరించారు. సాహిత్యరంగానికి ఆయన చేసిన సేవలకుగానూ 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తెలుగులో శ్రీశ్రీ, – ఆత్రేయ, -ఆరుద్ర, – దాశరథి, – కొసరాజు, – వేటూరి వంటి ప్రసిద్ధ గేయ రచయితల సరసన సిరివెన్నెల సీతారామశాస్త్రి సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ప్రేక్షకులను పరవశింపజేసేలా అన్ని రకాల జోనర్లలో ఆయన పాటలు రాశారు. చివరి వరకు రాస్తూనే వచ్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

చెంబోలు సీతారామశాస్త్రి 1955 సంవత్సరం మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో డాక్టర్. సి.వి.యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. పదో తరగతి వరకు అనకాపల్లిలో చదువుకున్న ఆయన కాకినాడలో ఇంటర్, ఆంధ్రా విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు. అదే సమయంలో 10వ తరగతి అర్హతపై బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం రావటంతో రాజమండ్రిలో కొంతకాలం పనిచేశారు.

గాయకుడు కావాలనుకొని పాటల రచయితగా…

సీతారామశాస్త్రిలో కవి ఉన్నాడని గుర్తించిన మొదటి వ్యక్తి ఆయన సోదరుడు. చిన్నప్పటి నుంచి సీతారామశాస్త్రికి పాటలు పాడాలని కోరిక. కొన్నిసార్లు ప్రయత్నించి పాటలు పాడడానికి పనికిరానని నిర్ధారణకు వచ్చారు. అయితే కొత్త పదాలతో ఎప్పుడూ ఏదో ఒకటి పాడడం గమనించిన ఆయన సోదరుడు ‘అన్నయ్యా కవిత్వం కూడా బాగా రాస్తున్నావు. నువ్వు ఒకసారి ప్రయత్నించు’ అని చెప్పారట. ఆ తర్వాత ఏవీ కృష్ణారావు, సహచరుడు చాగంటి శరత్‌బాబుతో కలిసి సాహితీ సభలకు వెళ్లేవారు. ఆ సమయంలో సీతారామశాస్త్రిని అందరూ భరణి అని పిలిచేవారు. ఎం.ఏ చదువుతున్న సమయంలో దర్శకుడు కె.విశ్వనాథ్ నుంచి పిలుపు రావటంతో ‘సిరివెన్నెల’ చిత్రానికి తొలిసారి పాటలు రాశారు. ఆవిధంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే మధుర గీతాలెన్నింటినో సిరివెన్నెల రాసి సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

హిట్ చిత్రాల్లో సుమధురమైన పాటలు…

సిరివెన్నెల, స్వయంకృషి, స్వర్ణ కమలం, సంసారం ఒక చదరంగం, శృతి లయలు, ఇంద్రుడు చంద్రుడు, నిన్నేపెళ్లాడతా, గాయం, అంతం, అల్లుడు గారు, శుభలగ్నం, క్షణ క్షణం, మనీ, సింధూరం, మురారి, ఒక్కడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చక్రం, కొత్తబంగారు లోకం, గౌతమిపుత్ర శాతకర్ణి… ఇలా ఎన్నో చిత్రాల్లోని పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం నుంచి జాలువారిన సుమధురమైన పాటలు సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘దోస్తీ&’ పాట కూడా ఆయన రాసిందే. సిరివెన్నెల చివరగా నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా కోసం రెండు పాటలు రాశారు.

నటుడిగానూ మెరిసి…

సిరివెన్నెల సీతారామశాస్త్రి గేయ రచయతగానే కాకుండా.. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘గాయం’ సినిమాలో నటుడిగానూ మెరిసారు. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అంటూ తను రాసిన పాటలోనే అభినయించారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా సినిమాలో ఒక్క పాటయినా రాయించాలని దర్శక నిర్మాతలు తపిస్తుంటారు. సిరివెన్నెల తనయుడు రాజా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఇక సీతారామ శాస్త్రికి దర్శకుడు త్రివిక్రమ్ అల్లుడి వరుస అవుతారు. ఆయన సోదరుడి కూతురుని త్రివిక్రమ్ పెళ్లి చేసుకున్నారు.

ప్రముఖుల సంతాపం…

సమాజ కవిగా కూడా పేరుగాంచిన సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించిందని అంటూ ట్వీట్ చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసిన ఆయన.. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియపరిచారు. “అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

ఓం శాంతి..” అని నరేంద్ర మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు. “సిరివెన్నెల మనకిక లేదు. సాహిత్యానికి ఇది చీకటి రోజు. నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గ ద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు. మిత్రమా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్పవుతున్నాం..” అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. ‘వాగ్దేవి వరప్రసాదంతో తెలుగునాట నడయాడిన విద్యత్కవి సిరివెన్నెల. తన పాటతో మానవతావాదం, ఆశావాదం పొదిగిన అక్షర శిల్పి ఆయన”అని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ “తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశలా వ్యాపింపచేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి నాకు ఎంతో ఆప్తులు. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ.. వారి కుంటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను”అని అన్నారు. జూ.ఎన్టీఆర్ మాట్లాడుతూ “సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది.

అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి”అని తెలిపారు. “తరలిరాని లోకాలకు తరలి వెళ్లిన అక్షర తూటా… మమ్మల్ని ముందుండి నడిపే ఒక వెలుతురు ఆరిపోయింది.. గురువు గారు చేబ్రోలు సీతారామశాస్త్రి శివైక్యం పొందారు… అని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాము”అని త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. “సరస్వతీ పుత్రుడు… విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది”అని మోహన్‌బాబు అన్నారు.
సిరివెన్నెల చివరిచూపు నిమిత్తమై ఆయన భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం 7గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు.

బుధవారం అంత్యక్రియలు…

బుధవారంఉదయం 7 గంటలకు అభిమానుల సందర్శనార్ధం సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News