Thursday, May 2, 2024

రూ. వెయ్యి కోట్లతో మహీంద్రా ‘ఇవి’ కేంద్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మహీంద్రా అండ్ మహీంద్రా తన లాస్టమైల్ మొబిలిటీ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్‌లో ఉన్న తన ప్లాంట్‌కు అనుబంధంగా ఈ నూతన తయారీ ప్లాంట్ రానునట్లు తెలిపింది. సుమారు రూ.1000 కోట్లతో ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు గురువారం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, సంబంధిత శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఎంఒయులో భాగంగా కంపెనీ తన లాస్ట్ మొబిలిటీ వ్యాపారంలో భాగంగా మూడు, నాలుగు వీలర్ వాహనాలను తయారుచేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జహీరాబాద్‌లో ఉన్న తయారీ ప్లాంట్‌ను విస్తరించాలన్న లక్షంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

కాగా ప్లాంట్ విస్తరణ ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని స్పష్టం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, భారతదేశంలో సస్టైనబుల్ మొబిలిటీ రంగాన్ని మరింతగా వృద్ధిపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబిలిటీ వ్యాలీ ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. ఈ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగు మెగా ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో జహీరాబాద్ ఒకటన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జేజురికర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కంపెనీకి జహీరాబాద్ లో ఉన్న తయారీ ప్లాంట్‌ను మరింత విస్తరించడం ద్వారా త్రి వీలర్ కేటగిరీలో మరిన్ని వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేడు ప్రకటించిన తాజా పెట్టుబడితో త్రి వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరిలో మహీంద్రా అండ్ మహీంద్రా స్థానం మరింత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర ఉన్నతధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News