Tuesday, May 7, 2024

రెట్టింపు మెజారిటీతో మళ్లీ వస్తా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే ఏడాదిజరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఇంతకన్నా భారీ మెజారిటీతో తిరిగి లోక్‌సభలో అడుగుపెడతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా శుక్రవారం అన్నారు. డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను సభనుంచి బహిష్కరించాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మొయిత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.‘ ఎథిక్స్ కమిటీ చేత అనైతికంగా బహిష్కరించబడ్డ తొలి వ్యక్తిగా పార్లమెంటు చరిత్రలో నిలిచిపోనున్నందుకు గర్వ పడుతున్నాను. ఎథిక్స్ కమిటీకి బహిష్కరించే అధికారం లేదు. ముందు బహిష్కరించడం ఆ తర్వాత సాక్షం సేకరించమని సిబిఐని ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరడం ఎక్కడా చూడలేదు.

మొదటినుంచి చివరిదాకా కూడా అంతా కంగారూ కోర్టు, కోతుల వ్యవహారంగా సాగుతోంది’ అని మొయిత్రా ఎక్స్‌లో ఉంచిన పోస్టులో మండిపడ్డారు. అంతేకాదు మహువా టికెట్‌ను కట్ చేస్తారని ప్రతి ఒక్కరికీ చెబుతూ ఈ టైమ్ వేస్ట్ చేసుకోవద్దని వ్యాపారవేత్త గౌతమ్ అదానీని ఉద్దేశించి మరో ట్వీట్‌లో ఆమె వ్యాఖ్యానించారు. ‘మీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోతుందనేది మాత్రం నిజం. నేను మళ్లీ కృష్ణనగర్‌నుంచి నిలబడతా, నా ఆధిక్యతను రెట్టింపు చేసుకుంటా’ అని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మహువా మొయిత్రాను లోక్‌సభనుంచి బహిష్కరించాలని బిజెపి లోక్‌సభ సభ్యుడు వినోద్ కుమార్ సోంకార్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ తన 479 పేజీల నివేదికలో సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News