Friday, May 3, 2024

నిరవధిక జైలు!

- Advertisement -
- Advertisement -

Mana telangana editorial on UAPA act చట్ట విరుద్ధ కార్యకలాపాల శాసనం (ఉపా) కింద ఎవరినైనా అవధులు మీరి నిరవధికంగా జైల్లో వుంచడం ఆ వ్యక్తి ప్రాథమిక హక్కును కాలరాయడమేనని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశంలో తుది శ్వాస విడుస్తున్న ప్రజాస్వామిక హక్కులకు ప్రాణం పోయగల మంచి న్యాయ సాధనమని చెప్పవచ్చు. ‘ఉపా’ చట్టం కింద ఎటువంటి న్యాయ విచారణకు నోచుకోకుండా జైల్లో మగ్గుతున్నానని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆషిమ్ అనే 74 ఏళ్ల వృద్ధుని కేసులో న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అభయ్ ఎస్ ఓకాల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఎటువంటి విచారణ లేకుండా పౌరులను నిరవధికంగా జైల్లో వుంచడం వల్ల దేశంలో న్యాయ పాలనపై ప్రజల్లో విశ్వాసం అంతరించిపోయే ప్రమాదం తలెత్తుతుందని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. సకాల విచారణ సాధ్యం కాదని తేలిపోయి, అప్పటికే దీర్ఘ కాలం జైలు జీవితం గడిపి వుంటే ఆ వ్యక్తికి తక్షణమే విముక్తి కలిగించి బెయిలు మీద వున్న విచారణ ఖైదీగా న్యాయస్థానాలు పరిగణించవచ్చని పేర్కొంది. ఎవరినైనా అవసరానికి మించి జైల్లో వుంచడం తగదని స్పష్టం చేసింది.

2018లో దేశంలోని జైళ్లలో గల విచారణలోని ఖైదీల సంఖ్య 3,23,537 కాగా, 2019 డిసెంబర్ 1 నాటికి ఇది 3,30,487 కి చేరింది. అంటే 2.15 శాతం పెరిగింది. దేశంలోని మొత్తం ఖైదీలలో 70 శాతం మంది విచారణలోని ఖైదీలే కావడం గమనించవలసిన విషాదం. ‘ఉపా’ కింద 201719 మధ్య 3000 మందిని అరెస్టు చేశారు. 2016, 2017, 2018 సంవత్సరాల్లో 3974 మందిని అరెస్టు చేసి 3005 కేసులు నమోదు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. 2019లో ఈ చట్టం కింద అరెస్టు చేసిన వారిలో కేవలం 34 మందికే శిక్షలు పడ్డాయని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకి తెలియజేసింది. న్యాయ వ్యవస్థకు తగినంత మంది సిబ్బంది, యంత్రాంగం లేనందున అసంఖ్యాకమైన కేసులు పెండింగులో వుండిపోతున్నాయి. ఆర్థికంగా, ఇతరత్రా బలవంతులైన వారు జామీను సాధించి జైళ్ల నుంచి బయటపడుతున్నారు. నిరుపేదలు నిస్సహాయులై లోపలే బతుకులీడుస్తున్నారు.

ఈ స్థితి దేశ మౌలిక ప్రజాస్వామిక నీతికి, న్యాయానికి విరుద్ధమైనది. ఇటువంటి సందర్భాల్లో రాజ్యాంగం 21వ అధికరణ అక్కరకు వస్తుంది. ఈ అధికరణ పౌరులకు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదిస్తున్నది. చట్టం నిర్దేశించే ప్రక్రియ ద్వారా తప్ప ఏ ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని స్పష్టం చేస్తున్నది. ఆ విధంగా ఇది పౌరులకు జీవన హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను కూడా ఇస్తున్నది. 21వ అధికరణ బ్రిటిష్ హయాం లో 1935లోనే పురుడు పోసుకున్నది. భారత రాజ్యాంగం 3వ విభాగంలోని ప్రాథమిక హక్కులలో ప్రధానమైనదిగా చోటు సంపాదించుకున్నది. దీనిని ప్రాథమిక హక్కుల హృదయంగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ విలువలు కలిగిన అధికరణగా జస్టిస్ భగవతి పేర్కొన్నారు. ఈ అధికరణ కింద రాజ్యాంగం హామీ ఇస్తున్న జీవన హక్కు అంటే కేవలం జంతువులా జీవించడం, ఊపిరి కలిగి వుండడం మాత్రం కాదని సుప్రీంకోర్టు మనేక గాంధీ కేసులో స్పష్టం చేసింది.

కాలుష్యం లేని నీరు, గాలితో కూడిన మానవీయమైన వాతావరణంలో జీవించే హక్కునే ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు నిర్వచించింది. ఇంకా ఉపాధి హక్కును, వ్యక్తిగత గోప్యత, నివాసం, ఆరోగ్యం, 14 ఏళ్ల లోపు వయసులో విద్యా హక్కు, ఉచిత న్యాయ సహాయం, ఏకాంత నిర్బంధానికి ఆస్కారం లేకుండా చూడడం, శీఘ్ర న్యాయ విచారణ వంటి అనేక హక్కులతో కూడినదే జీవన హక్కు అని విశదం చేసింది. ప్రస్తుత తీర్పు వెలువడిన కేసులో పదేళ్లుగా న్యాయ విచారణ సైతం చేపట్టకుండా 74 ఏళ్ల వృద్ధుని జైల్లో వుంచడం గమనార్హం. ప్రాథమిక హక్కులకు ఇదెంత ఉల్లంఘనో వివరించి చెప్పనక్కర లేదు. వృద్ధాప్యంలో వున్నారని తీవ్రమైన అనారోగ్యగ్రస్థులని చూడకుండా ‘ఉపా’ వంటి చట్టాల కింద జైళ్లలో మగ్గించవలసిన అవసరం ప్రజాస్వామిక ప్రియులైన ప్రజలకు కలగదు.

కాని ప్రజాస్వామ్యం పేరిట అధికారాన్ని కైవసం చేసుకుని స్వార్థపర వర్గాల మేలు కోసం చట్టాలను దుర్వినియోగం చేసే పాలకులకు మాత్రం తమను ప్రశ్నించే వారిని అటువంటి చట్టాల కింద నోరు మూయించడం అవసరమవుతుంది. భీమా కోరేగాంవ్ కేసులో 16 మంది మేధావులను ఉగ్రవాద చర్యలకు సహాయపడుతున్నవారుగా పేర్కొని జైల్లో అమానవీయ వాతావరణంలో నిర్బంధించడం పట్ల నిరసన తెలుపుతూ పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలు, యూరప్ పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాసిన ఉదంతం వుంది. అందుచేత తాజా సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనైనా సత్వర విచారణ లేకుండా జైళ్లలో నిరవధికంగా మగ్గించడమనే దుర్మార్గానికి స్వస్తి చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News