Sunday, April 28, 2024

ఉక్రెయిన్ సమీపంలో రష్యా భారీ బలగాల మోహరింపు

- Advertisement -
- Advertisement -

Massive Russian Forces' Build-Up Near Ukraine

క్రిమియా, బెలారస్, పశ్చిమ రష్యా ప్రాంతాలకు కొత్తగా సైనిక దళాల తరలింపు
ఉపగ్రహ చిత్రాలతో బైటపడిన వాస్తవాలు

మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి చేసే ఉద్దేశం తమకు లేదని రష్యా ఎంతగా చెబుతున్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్ కు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించినట్లు తాజా ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది. ‘మాక్సార్ టెక్నాలజీస్’ అనే సంస్థ ఈ తాజా ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఈ చిత్రాలను గమనిస్తే క్రిమియా, బెలారస్, పశ్చిమ రష్యా ప్రాంతాల్లో రష్యా కొత్తగా పెద్ద ఎత్తున మిలిటరీ బలగాలను మోహరించిన విషయం స్పష్టమవుతోందని ఆ కథనం పేర్కొంది. క్రిమియాలోని ఒక్టాబ్రిస్కోయే ఎయిర్‌ఫీల్డ్ వద్ద పెద్ద సంఖ్యలో కొత్త సైనిక మోహరింపులు జరిగినట్లు ఈ నెల 10న తీసిన ఉపగ్రహ చిత్రంలో కనిపించాయి. సిమ్‌ఫెరోపోల్‌కు ఉత్తరంగా ప్రస్తుతం వాడుకలో లేని ఈ విమానాశ్రయం వద్దకు ఆ రోజు 550కు పైగా సైనికుల టెంట్లు, వందల సంఖ్యలో వాహనాలు చేరుకున్నాయని ఆ కథనం తెలిపింది.అలాగే డొనుజ్లావ్ సరస్సు ఒడ్డున ఉన్న నోవూజెర్నోయే ప్రాంతానికి కూడా ఇటీవల కొత్త బలగాలు చేరుకున్నాయని, దగ్గర్లో పెద్ద ఎత్తున శిక్షణ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని పేర్కొంది.

అలాగే క్రిమియా ద్వీపకల్పం వాయువ్య ప్రాంతంలోని స్లావ్నే పట్టణం సమీపంలో కూడా కొత్తగా బలగాల మోహరింపును గుర్తించినట్లు తెలిపింది. ఇక ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న బెలారస్‌లో కూడా సరిహద్దులకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్యబ్రోవ్కా విమానాశ్రయందగ్గర్లో కొత్తగా భారీ సంఖ్యలో బలగాలు, సైనిక వాహనాలు, హెలికాప్టర్లు కనిపించాయని తెలిపింది. అలాగే ఉక్రెయిన్ సరిహద్దులకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరిస్టా నగరం సమీపంలో కూడా అదనపు బలగాలు, వివిధ రకాల యుద్ధ బృందాలు కనిపించినట్లు తెలిపింది. ఇక పశ్చిమ రష్యాలో ఉక్రెయిన్ సరిహద్దులకు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్స్ నగరం శివార్లలో ఉన్న సైనిక శిక్షణ ఏరియాలో తాజాగా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అదనంగా ట్యాంకులులాంటి పరికరాలు ప్రతి నిత్యం వస్తూనే ఉన్నాయని, ఈ సైనికులు, పరికరాల కోసం కొత్తగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ఇవన్నీ చూస్తే ఉక్రెయిన్‌పై రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయడానికిసిద్ధ పడుతోందని అర్థమవుతోందని ఆ కథనం పేర్కొంది.

ఉక్రెయిన్‌కు విమానాల నిలిపివేత

ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతుండడంతో ఆ దేశానికి వెళ్లే పలు విమానాలను నిలిపివేయడంతో పాటుగా కొన్ని విమానాలను ఎయిర్‌లైన్స్‌సంస్థలు వేరే ప్రాంతాలకు మళ్లిస్తున్నాయి. డచ్ ఎయిర్‌లైన్ కెఎల్‌ఎం తదుపరి నోటీసుల దాకా ఉక్రెయిన్‌కు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఉక్రెయిన్ గగనతలం మీదుగా తమ విమానాలను నిలిపివేస్తున్నటు ఉక్రెయిన్‌కు చెందిన స్కైఅప్ ఎయిర్‌లైన్స్‌ను అద్దెకు తీసుకున్న ఐరిష్ సంస్థ ప్రకటించడంతో పోర్చుగల్‌లోని మదీరానుంచి కీవ్‌కు వచ్చే విమానాన్ని మాల్డోవన్ రాజధాని కిసినావు మళ్లించినట్లు ఆ సంస్థ తెలిపింది.

రష్యా జలాల్లో అమెరికా జలాంతర్గామి!

ఉక్రెయిన్ విషయంలో అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ జలాంతర్గామి ఉత్తర పసిఫిక్‌లోని తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించినట్లు రష్యా ఆరోపించింది. మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్న సమయంలో తమ యాంటీ సబ్‌మెరైన్ డిస్ట్రాయర్ ‘ మార్షల్ షాపోష్నికోవ్’.. కురిల్స్ దీవుల సమీపంలో అమెరికా నేవీ వర్జీనియా క్లాస్ సబ్‌మెరైన్‌ను గుర్తించినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. నీటి ఉపరితలానికి రావాలన్న తమ ఆదేశాలను విస్మరించడంతో వెంబడించగా.. అది వెనక్కి వెళ్లిపోయిందని తెలిపింది. ఈ వ్యవహారాన్ని మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరణ కోరినట్లు రక్షణ శాఖ తెలిపింది. అయితే ఈ ఆరోపణలనుఅమెరికా కొట్టిపారేసింది. రష్యా వాదనల్లో నిజం లేదని పేర్కొంది. జపాన్‌కు ఉత్తరాన ఉన్న ఈ కురిల్స్ దీవులు రెండో ప్రపంచయుద్ధం నాటినుంచి రష్యా అధీనంలో ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News