Wednesday, May 8, 2024

ఉద్యమ ఆకాంక్షలే వైద్యకళాశాలలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ స్వరాష్ట్రం ఏ ఆకాంక్షల కోసం ఏర్పాటు కావాలని కోరుకున్నామో.. ఆ ఉద్యమ ఆకాంక్షలన్నీ నేడు కళ్ల ముందు తెలంగాణ స్వరాష్ట్రంలో ఆవిష్కృతమవుతున్నాయి. సుమారు ఆరు దశాబ్దాలకుపైగా అణచివేతతో అభివృద్ధికి, అస్తిత్వానికి భౌగోళికంగా తెలంగాణ పదాన్ని భారతదేశ చిత్రపటంలో నుంచే ఈనేల ఆనవాళ్లు లేకుండా బలమైన కుట్ర జరిగిన సంగతి అందరికీ తెలిసింది. గొప్ప కళలకు, ఖనిజ సంపదకు, ప్రకృతి వనరులను నిండుగా దాచుకున్న తెలంగాణ నేలను పూర్తిగా దోచుకున్నారు. తెలంగాణను నిర్లక్ష్యం చేసి ఈ ప్రాంతంపట్ల చిన్న చూపును ప్రదర్శించారు. అటువంటి తెలంగాణ నేల అనేక పోరాటాల గుణపాఠాలతో కెసిఆర్ రూపంలో రాజకీయ పోరాటంతో నేడు స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసుకొని భారత దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందనడంలో సందేహం లేనేలేదు.

అంతటి అభివృద్ధి పోరాటాన్ని నేడు కెసిఆర్ సారథ్యంలో జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షల మీద పురుడుపోసుకుంది. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చూపిన విశేష కృషితో రాష్ట్ర కల సాకారమై నేడు ఆకాంక్షలన్నీ కళ్లముందు ఒక్కోటి ఆవిష్కృతం అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వెనుకబాటుకు కారణమైన వాటిని కెసిఆర్ పాలనలో ప్రజలకు దగ్గర చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని నేలను తడిపే సాగునీరు లేక రైతన్నలు నీటి కోసం బోర్లు వేస్తూ.. అప్పులపాలై భూములు అమ్ముకున్న అధ్వాన దీనస్థితిని అనుభవించాం. బోర్ల సాయంతో సాగుచేసే రైతన్నలు పడిన కరెంటు కష్టాలను చవిచూశాం. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లలోనే ఉద్యమ రథసారథి కెసిఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో దూసుకుపోతుందనడానికి సందేహం లేనేలేదు. తెలంగాణ రైతన్నల కష్టాలు తీర్చడానికి మహోద్యమంలా మిషన్ కాకతీయ పథకం తీసుకు వచ్చి పల్లెల్లో ఉన్న ప్రతి చెరువును పునరుద్ధరించడంతో పాటు.. కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణం కేవలం మూడున్నరేళ్లలో పూర్తి చేసి తెలంగాణలో భూగర్భ జలాలు పెంపొందేలా చేశారు. అలాగే రైతన్నల కరెంటు కష్టాలు లేకుండా పగటి పూటనే సాగుకు కావాల్సిన కరెంటును సరఫరా చేస్తూ అండగా నిలబడ్డారు.

తాగునీటి కష్టాలు లేకుండా ఉండేందుకు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లను అందిస్తున్నారు. రైతన్నలు ఎదుర్కొనే ఇబ్బందులు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రైతు బంధును ప్రవేశపెట్టి రెండు పంటలకు సాయాన్ని అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు 59 ఏళ్లలోపు రైతు ఏవిధంగా మరణించినా వారి కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేస్తూ.. అండగా నిలబడుతున్నారు. క్షేత్రస్థాయి నుండి అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో కొత్త మండలాలు, తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గ్రామస్థాయి నుంచి అభివృద్ధి చర్యలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణ సంపదను పెంచి తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఉద్యోగాల నియామకాల్లో అస్తవ్యస్తమైన జోనల్ విధానాన్ని సవరించి కొత్త జోన్లు, మల్టీ జోన్లుగా విభజించి ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నది.

బలమైన తెలంగాణ నిర్మాణం చేయడానికి పక్కా ప్రణాళికలతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కెసిఆర్ ప్రతి రంగం పట్ల దూరదృష్టితో వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అభివృద్ధిని దగ్గర చేస్తున్నారు. సంక్షేమంలో ఎక్కడా తగ్గకుండా అన్ని వర్గాలకు ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో ఆవిష్కృతమవుతూ.. ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయి. అలాగే మిగతా రాష్ట్రాలు.. తెలంగాణ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకునే స్థాయికి తెలంగాణ ఎదగగలిగింది. ఇదంతా జరిగింది కేవలం 9 ఏళ్లలోపు మాత్రమే. ఇదంతా ఒకలా అయితే.. తెలంగాణ అతిపెద్దగా మోసపోయింది విద్యా వ్యవస్థలో ఆనాడు కనీస వసతులు లేని కాలంలో విద్యా వ్యవస్థ అంతా ఛిన్నాభిన్నంగా తీవ్రమైన నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు డిగ్రీ కళాశాలలు లేని దుస్థితి దాపురించింది. నాటి తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ఒకటి, రెండుకు మించి డిగ్రీ కళాశాలలు లేక ఎంతో మేధోశక్తి కలిగినా అవకాశాలు లేక కోల్పోయిన వారెందరో.. అటువంటి విద్యా వ్యవస్థను స్వరాష్ట్రంలో అతి సులభంగా తెలంగాణ ప్రతి బిడ్డ విజ్ఞానాన్ని ఒడిసి పట్టుకోవాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థ నేడు పటిష్ఠంగా పని చేస్తుందనడానికి అనేకమైన ఉదహరణలు చెప్పవచ్చు.

దాదాపు వేయికిపైగా గురుకులాల ద్వారా విద్య అందుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ కళాశాలలు లేని దుస్థితి ఉండేది.అటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి జిల్లాలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయి. దాదాపు 143 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ద్వారా విద్య అందుతోంది. విద్య వ్యవస్థలో తెచ్చిన మార్పువల్ల నేడు అనేక మంది తెలంగాణ బిడ్డలు నీట్, ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి.. అతి సామాన్యమైన కుటుంబాల్లోని పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనబరిచేలా చేశారు. ఎంతో మందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తన సొంత ఖర్చులతో వైద్య విద్యార్థులకు అండగా నిలిచిన సంగతిని చూశాం. అలాగే ఇటీవల నిజామాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని హారిక యూ ట్యూబ్ సాయంతో ఎంసెట్‌లో ర్యాంకు సాధిస్తే వారి కుటుంబ కష్టాలు తెలుసుకున్న ఉమ్మడి నిజామాబాద్ ఎంఎల్‌సి కవిత అండగా నిలిచి ఎంబిబిఎస్ విద్యకు అండగా నిలబడ్డారు.

ఇంతటి ప్రతిభనంతా అడ్డుకున్న కుట్రలకు కేసీఆర్ రూపంలో అవకాశాలు లభిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలో భారత దేశ చరిత్రలో మరో గొప్ప ఆవిష్కరణ వైద్య విద్యాలయాలని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల్లోనే 8 వైద్య కళాశాలలను పూర్తి చేసి ఎక్కడ జిల్లా వారికి అక్కడే అవకాశం అన్నట్లు నేడు వైద్య విద్యను విద్యార్థులకు దగ్గర చేసిందంటే ఉద్యమ నాయకుని ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేసే గొప్ప ఆలోచన ఆచరణ తెలంగాణలో ఆవిష్కృతం కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఏ ఆకాంక్షల కోసం.. ఉద్యమం జరిగి రాష్ట్రం ఏర్పడిందో.. నేడు ఆ ఆకాంక్షలు కళ్లముందు ఆవిష్కృతం అవుతున్నాయనడానికి సాక్ష్యం.. వైద్య విద్య కళాశాల ప్రారంభమని చెప్పవచ్చు. ఇటువంటి అనేక గుణాత్మక మార్పు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కెసిఆర్‌కు మరింత అండగా తెలంగాణ సమాజం నిలబడాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం
7893303516

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News