Saturday, April 27, 2024

మెటబాలిక్ సిండ్రోమ్‌తో ఎన్నో ఇబ్బందులు

- Advertisement -
- Advertisement -

మెటబాలిక్ సిండ్రోమ్ అనేది జీవనశైలి వ్యాధి. జీవ ప్రక్రియల్లో విపరీత పరిణామాల వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ ఇబ్బందులు గుండెపోటు, అధిక రక్తపోటు, మధుమేహం తదితర రుగ్మతలకు దారి తీస్తాయి. తద్వారా మనిషి శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఎక్కువస్థాయిలో కొలెస్ట్రాల్ (కొవ్వు) ఏర్పడడం, అధిక రక్తపోటుతోపాటు పొత్తి కడుపు చుట్టూ కొవ్వు పెరగడం వంటి లక్షణాలు లేదా వ్యాధులకు దారి తీస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్‌ను నిర్ధారించడానికి ఐదు అంశాలను పరిగణన లోకి తీసుకుంటారు.

అవేవనగా… నడుం చుట్టుకొలత పెరగడం అంటే మగవారిలో 102 సెం.మీ (40 అంగుళాలు) కంటే ఎక్కువ ఉండడం, మహిళల్లో 88 సెంమీ (35 అంగుళాలు) కన్నా ఎక్కువగా ఉండడం, ఇన్సులిన్ నిరోధకత ఆహారం తీసుకోకముందు చక్కెర స్థాయిలు 100 ఎంజీ/ డిఎల్ కన్నా ఎక్కువగా ఉండడం, ఎక్కువ రక్తపోటు, అంటే రక్తపోటు స్థాయిలు 130/85 ఎంఎంహెచ్‌జి కన్నా ఎక్కువగా ఉండడం, ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్, అనగా కొవ్వు సంబంధిత పదార్ధాలు 150 ఎంజీ/డీ కన్నా ఎక్కువగా ఉండడం, తక్కువ హెచ్‌డిఎల్ స్థాయి, అనగా హెచ్‌డిఎల్ అనబడే కొలెస్ట్రాల్ పురుషుల్లో 40 ఎంజీ/ డిఎల్, మహిళల్లో 50 ఎంజీ/డిఎల్ కన్నా తక్కువగా ఉండడం. వీటిలో కనీసం మూడు లక్షణాలు ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలని తెలుసుకోవడం చాలా అవసరం. దీనికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి.

మన దేశంలో 30 నుంచి 40 శాతం మంది మెటబాలిక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని ఒక అంచనా. ఇది అత్యంత పిన్న వయస్సు వారిని కూడా అతి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది. ఊబకాయం లేదా అధిక బరువున్న శరీరం కలవారిలో ఈ సిండ్రోమ్ సంక్రమిస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 25 కిలోలు/ఎమ్ 2 కన్నా ఎక్కువ ఉంటే దానిని ఎక్కువ బరువు ఉండడం అంటారు. బీఎమ్ ఐ 30 కిలోలు/ఎమ్ 2 కన్నా ఎక్కువ ఉండడాన్ని ఊబకాయం అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ 25 కన్నా ఎక్కువగా ఉన్న వారిని మెటబాలిక్ సిండ్రోమ్ నిర్ధారణకు అర్హులుగా పరిగణించాలి. వయస్సు పెరిగే కొద్దీ మెటబాలిక్ సిండ్రోమ్ ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. 60 సంవత్సరాలు దాటిన వారిలో ముఖ్యంగా పురుషులు కన్నా మహిళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. తల్లిదండ్రుల్లో ఒకరికైనా ఊబకాయం, అధికబరువు, మధుమేహం లేదా హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులు ఉంటే వాళ్ల పిల్లల్లో ఇది సాధారణంగా కనిపిస్తుంది.

నిశ్చల జీవనశైలి ఉన్నవారు, తక్కువ శారీరక శ్రమ, తక్కువ కదలిక ఉన్నవారు దీని బారిన పడుతుంటారు. ఈ సిండ్రోమ్ బారిన పడేవారిలో కాలేయంలో కొవ్వు శాతం పెరిగి లేదా కాలేయం పాడైపోవడం జరుగుతుంది. ఊబకాయం ఉన్న రోగుల్లో గాలి పీల్చుకునే నాళాల కండరాలు పటిష్టత కోల్పోతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటువంటివారు గురక పెట్టడమే కాకుండా నిద్ర లేచిన వెంటనే ఉదయం వేళల్లో తలనొప్పి, పగటిపూట నిద్రావస్థ ఏర్పడడం, మానసిక స్థిరత్వం లేకపోవడం, ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరగడం వంటివి జరుగుతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వాళ్లు ఆహారాన్ని నియంత్రించుకోవాలి. తక్కువ కార్బొహైడ్రేట్స్, అంటే తక్కువ పిండిపదార్ధాలు, తక్కువ కొవ్వు ఉండే ప్రొటీన్ , ఫైబర్‌ల శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

దీనివల్ల బరువు తగ్గవచ్చు. మైదా లేదా బియ్యం వంటి వాటిని తీసుకోవడం కన్నా ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు తీసుకోవాలి. అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన కనోలా, ఆలివ్, రైస్‌బ్రాన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటివి తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్, జంక్‌ఫుడ్స్, నూనెలో వేయించిన ఆహార పదార్ధాలు తగ్గించాలి. లేదా మానేయాలి. కొవ్వు తక్కువగా ఉండే లీన్ మీట్ (చికెన్) లేదా చేప ఎక్కువగా తీసుకుంటూ ఎర్రమాంసం తగ్గించాలి. వారంలో కనీసం ఐదు రోజుల పాటు రోజూ కనీసం 45 నిమిషాల పాటు శారీరక శ్రమ అవసరం. కార్డియో లేదా ఏరోబిక్ వ్యాయామాలు, అంటే పరుగెత్తడం, ఈత, ట్రెడ్ మిల్, సైక్లింగ్ వంటివి బరువు తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యం పెరగడానికి దోహదం చేస్తాయి. ఓర్లిస్టాట్, లార్కార్సెరిన్, వంటి ఆకలి తగ్గించే మందులు కొంతమేర బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News