Tuesday, April 30, 2024

బిసి కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ద్యేయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ కుల వృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కులవృత్తుల్లో ఉన్నవారికి ఆర్ధిక సహాయం అందించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బ్యాంకు లింకేజీ లేకుండా లక్ష రూపాయల గ్రాంటును అందించే కార్యక్రమానికి సంబంధించి సహచర మంత్రి హరీష్ రావు, సిఎస్ శాంతికుమారితో కలిసి మంత్రి బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మంచిర్యాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా చెక్కులను అందించి, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు జిల్లాల పరిధుల్లోని నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఎ లతో లబ్దిదారులకు చెక్కులు అందించాలని కలెక్టర్లకు సూచించారు. కులవృత్తుల్లో కొనసాగుతున్న వారిని అభివృద్ధి చేసేందుకు, వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించిందని మంత్రి గంగుల పునరుద్ఘాటించారు. పథకం దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇది నిరంతర కార్యక్రమమని, దీని కింద లబ్ధిదారులను గుర్తించి ప్రతినెలా 15వ తేదీన లబ్ధిదారులకు సంబంధిత ఎంఎల్‌ఎలచే చెక్కులు పంపిణీ చేస్తామని మంత్రి గంగుల తెలిపారు. అయితే ఈ దరఖాస్తులను పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

పథకం గ్రౌండింగ్‌లో ఆయా కులవ్రుత్తులకు దోహదపడే పనిముట్లు, పరికరాలు కొనుగోలు చేయడానికి లబ్దిదారులకు సహకరించడం, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. రెండేళ్ల వరకూ ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా లబ్దిదారులు ఆర్థికంగా ఉన్నత స్థితిని సాధించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని మంత్రి చెప్పారు. సంగారెడ్డి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద చేతివృత్తిదారులను గుర్తించి వారికి ఆర్థిక చేయూతనిచ్చేలా కలెక్టర్లు అత్యంత శ్రద్ధ వహించాలని కోరారు. జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారులను గుర్తించాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ లో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, బిసి సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, ఎస్‌సి అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థికశాఖ కార్యదర్శి టికె శ్రీదేవి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, అన్ని జిల్లాల కలెక్టర్‌లు, బిసి సంక్షేమ శాఖ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News