Friday, September 20, 2024

పాక్‌తో చర్చలు బంద్…చర్యకు ప్రతిచర్యే:జై శంకర్

- Advertisement -
- Advertisement -

పొరుగుదేశం పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియ ప్రస్తుతానికి అనిశ్చిత స్థాయిలో ఉందని విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. ఇప్పటివరకూ పాక్‌తో చర్చల్లో ప్రతిష్టంభన ఉంది. ఇప్పుడీ ఘట్టం కూడా ముగిసినట్లే అని ఆయన అన్నారు. అన్నింటినీ తేలిగ్గా తీసుకునే ఉదాసీతతో వ్యవహరించడం భారత్‌కు కుదరదని స్పష్టం చేశారు. ఆ దేశంతో పరిస్థితి పట్ల ఆశాభావం అయితే ఇప్పటికీ లేదన్నారు. ఏదైనా జరిగితే దానికి అనుగుణంగా వెంటనే స్పందించడం అనివార్యం అవుతుందన్నారు. చర్యలకు ప్రతిచర్యలు , ఎదుటి పక్షం పనిని బట్టి పరిణామాలు ఉంటాయన్నారు. చర్చలు , ఉగ్రవాదం ఒకేసారి కుదరవని, ఒకటి జరిగితే ఇంకోటి వదులుకోవల్సి ఉంటుందన్నారు. పాకిస్థాన్ ఎప్పుడూ సీమాంతర ఉగ్రవాదాన్ని నమ్ముకుని ఉంటుంది. చర్చలు సాగేందుకు దీనితో వీలవుతుందా? అని నిలదీశారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి మాట్లాడారు. ప్రపంచంలో ఏ దేశానికి అయినా ఇరుగుపొరుగుదేశాలే జటిల ప్రశ్నలు అవుతున్నాయి.

ఇదే విధంగా అగ్రరాజ్యాల ధోరణి కూడా ఉంటోంది. ప్రధాన శక్తులైన దేశాలకు పరిధి విస్తృతం అయి ఉంటుంది. వారి అజెండా ఎప్పుడూ ఇతరదేశాల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. అయితే ఇందులో తేడాలు ఉండొచ్చు. కొన్ని దేశాల పట్ల వైఖరిలో వ్యత్యాసాలు ఉండనే ఉంటాయని విశ్లేషించారు. మాజీ దౌత్యవేత్త రాజీవ్ సిక్రి రాసిన పుస్తకావిష్కరణలో జైశంకర్ బంగ్లాదేశ్ పరిణామాలు ఇతర విషయాలను కూడా ప్రస్తావించారు. ప్రదానంగా పాకిస్థాన్ వ్యవహారశైలి జటిలతను సృష్టిస్తోందని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ విషయానికి సంబంధించి ఆర్టికల్ 370 నిర్ణయంతో పాకిస్థాన్‌కు తగు సమాధానం ఇవ్వడం జరిగిందనే భావిస్తున్నాం. ఇక ఈ దేశంతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు నెరపాలనేది ఇక ముందున్న అంశం అని తేల్చిచెప్పారు. అఫ్ఘనిస్థాన్‌కు సంబంధించినంత వరకూ ఈ దేశంతో వాస్తవికమైన పటిష్ట ప్రజా సంబంధాలు సామాజిక స్థాయిల వరకూ ఉన్నాయి. ఆ దేశం నుంచి భారత్ పట్ల నిర్థిష్ట సృహద్భావత ఉందన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు ఇతర మైనార్టీలపై దాడులు ఆందోళనకరమే. రాజకీయ అస్థిరత్వ పరిణామంతో శాంతిభద్రతల క్షీణత ఏర్పడింది. దీనివల్లనే మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రస్తుత ప్రభుత్వంతో సంప్రదించడం అనేది సహజ ప్రక్రియ అవుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News