Tuesday, September 10, 2024

అప్పుడు కలెక్షన్ సెంటర్లు..ఇప్పుడు కాల్ సెంటర్లు

- Advertisement -
- Advertisement -

హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అరకొరగా చేసిన పంట రుణమాఫీ కూడా 3 లక్షల మంది అర్హులైన రైతులకు అమలు కాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. సాంకేతిక సమస్యలు చూయించి ఆ రైతులకు రుణాలను మాఫీ చేయలేదని,ఆ విషయం హరీష్ రావుకు కూడా తెలుసని అన్నారు. త్వరలో ఆ రైతులకు రుణమాఫీ చేస్తామని స్వయంగా ప్రకటించి కూడా చేయలేదని అన్నారు. రుణమాఫీ కాక, బ్యాంకులు వేల మంది రైతులను బ్లాక్ లిస్టులో పెట్టి కొత్త రుణాలు పుట్టకుండా చేశాయని, అప్పుడు హరీష్ రావు ఎక్కడున్నారు? ఏ కలుగులో దాచుకున్నారు? అవమానాలు భరించలేక మహబూబాబాద్ లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం హరీష్ రావు పరామర్శించాడా..? అంటూ పొన్నం ప్రశ్నిల వర్షం కురిపించారు. అప్పుడే హరీష్ రావు కాల్ సెంటర్ పెట్టుకొని ఈ పని చేసి ఉంటే బాగుండేదని అన్నారు.

ఇప్పుడు తమ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తోందని, లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ పూర్తి చేసినట్లు తెలిపారు. సాంకేతిక లేక ఇతర సమస్యలతో రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్నదాతలకు హామీ ఇచ్చిందన్నారు. ఒక్క నెల రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రేషన్ కార్డు లేని వాళ్ళకి, సాంకేతిక సమస్య ఉన్నవాళ్లకి రుణమాఫీ చేస్తామన్నామని, అందుకే రైతులు నిశ్చింతగా ఉన్నారని, వాళ్ళకి లేని తొందర హరీష్ రావుకి ఎందుకని ప్రశ్నించారు. సకాలంలో రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. మీ హయాంలో పంటల బీమా లేదని, దీనివల్ల రైతులకు పంట నష్టపరిహారం అందలేదని ఆయన హరీష్‌రావునుద్దేశించి అన్నారు. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారురని, హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చి అడ్డా మీద కూలీలుగా మారారని. అప్పుడే కాల్ సెంటర్ పెట్టి ఉంటే రైతులకు ఎంతో కొంత లబ్ధి జరిగేదని మంత్రి అన్నారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు కాల్ సెంటర్ పెడితే ఏం లాభమని ప్రశ్నించారు. . మీరు బస్ లు ఆర్డర్ లు చేస్తే.. మేము రిబ్బన్ కట్ చేశామా?మీ హయంలో ఒక్క బస్సు అయినా కొనుగోలు చేశారా..? ఒకవేళ అదే నిజమైతే మీకే క్రెడిట్ ఇస్తాం. కానీ మీరు తెచ్చిన ఆరు లక్షల కోట్ల అప్పులకు ఎవరు వడ్డీలు చెల్లిస్తున్నారు..? అది కూడా మీరే చెల్లించండి ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి అని మంత్రి పొన్నం హరీష్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలమైతే మీ ఖాతాలో, కరువు వస్తే పక్కోడి ఖాతాలో వేసే నైజం మీది అని ఆయనన్నారు. అప్పులకైతే బాధ్యత వహించారు, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం మాయే అని డబ్బా కొట్టుకుంటున్నారని ద్వజమెత్తారు. ఇరిగేషన్ మంత్రిగా, ఆర్దిక మంత్రిగా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా, మైనింగ్ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు ఇప్పుడు కాల్ సెంటర్‌లు అంటూ కహానీలు చెప్తున్నాడని దుయ్యబట్టారు. అప్పుడు కలెక్షన్స్ సెంటర్లు ఇప్పుడు కాల్ సెంటర్లు, రేపు రోడ్డు సెంటర్ లో నిలబడాలి. ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా మీ అహంకారం మాత్రం తగ్గలేదు. అంటూ మంత్రి హరీష్‌రావుపై విరుచుకుపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News